జనసేనకు కేటాయించారనే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వాయిదా పడిందా

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక మంగళవారానికి వాయిదా వేశారు.;

Update: 2025-05-19 09:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఒకటిగా భావించే గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వాయిదా పడింది. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సోమవారం జరగాల్సి ఉండగా తగినంత మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మంగళవారానికి వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం మొత్తం 56 మంది సభ్యులు కౌన్సిల్‌ సమావేశానికి హాజరు కావలసి ఉండగా కేవలం 54 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో డిప్యూటీ మేయర్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.

అయితే కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదేనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం ఏమైనా లోపించిందా? లేక కావాలనే హాజరు కాలేదా అనేవి చర్చనీయాంశంగా మారింది. విశాఖ మేయర్‌ పదవిని కూటమి భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీకి దక్కింది. మేయర్‌గా ఉన్న హరికుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దింపేసి, ఆ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. టీడీపీ కార్పొరేటర్‌ అయిన పీలా శ్రీనివాసరావుకు మేయర్‌ పదవి దక్కింది.
ఈ నేపథ్యంలో జనసేనకు డిప్యూటీ మేయర్‌ పదవిని కేటాయించాలనే డిమాండ్‌ రావడంతో డిప్యూటీ మేయర్‌ పదవిని కూటమి పార్టీ అయిన జనసేనకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం టీడీపీ శ్రేణులకు నచ్చలేదనే చర్చ కూడా ఉంది. పలువురు టీడీపీ కార్పొరేటర్లతో పాటు టీడీపీ నాయకులు కూడా డిప్యూటీ మేయర్‌ పదవిని జనసేనకు కేటాయించడంపైన అసంతృప్తిగా ఉన్నారనే చర్చ కూడా కూటమి వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారమైనా సరిపడిన సంఖ్యలో కౌన్సిల్‌ సమావేశానికి కూటమి కార్పొరేటర్లు హాజరు అవుతారా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరో వైపు డిప్యూటీ మేయర్‌ పదవి ఎవరికి కేటాయించాలనే దానిపై కూటమి పెద్దలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై కూటమి పెద్దలు పెట్టారు. కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులంతా మంగళవారం కౌన్సిల్‌ సమావేశానికి పూర్తి స్థాయిలో హాజరయ్యేలా ఇప్పటికే అందిరితో చర్చించారని, మంగళవారం డిప్యూటీ మేయర్‌ ఎన్నిక పూర్తి అవుతుందనే టాక్‌ జీవీఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News