Counterfeit notes | పొద్దుపోయిందిి.. కనిపెట్టలేరని అకున్నాడేమో..
రూ. 500 నకిలీనోటు మార్చాలనే ప్రయత్నం. పది మంది అంతర్రాష్ట్ర మూఠాను అన్నమయ్య పోలీసులకు పట్టించాడు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-07 13:51 GMT
పొద్దుపోయింది కదా కనుక్కోలేరని అనుకున్నాడు. మద్యం దుకాణంలో నకిలీ 500 నోటు చలామణికి యత్నించిన వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. అతని ద్వారా అన్నమయ్య జిల్లా పోలీసులు పదిమంది అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు.
అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పి (పరిపాలన) ఎం. వెంకటాద్రి, రాయచోటి డిఎస్పిఎంఆర్. కృష్ణమోహన్, వాయల్పాడు సిఐ . జె.ప్రసాద్ బాబుతో కలిసి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు.
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
చిత్తూరు జిల్లా పడమటి తాలూకాలో ప్రతి గ్రామంలోనూ వారపు సంత నిర్వహించడం ఇప్పటికి కనిపిస్తుంది. ఈ జిల్లాకు పొరుగునే ఉన్న కడప జిల్లా (అన్నమయ్య జిల్లా) గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారపు సంతలకు ఆదరణ తగ్గలేదు. రద్దీని దృష్టిలో ఉంచుకొని నకిలీ నోట్లు, చిల్లర నాణ్యాలు గతంలో ఎక్కువగా చలామణి చేసేవారు. వ్యాపార లావాదేవీలు బిజీగా ఉండే వారు పసికట్టలేక మోసపోయిన సంఘటనలు అనేకం. ఈ నకిలీ ముఠాలు తాజాగా మద్యం దుకాణాలను కూడా నోట్ల చలామణికి ఎంచుకున్నట్లు తాజా సంఘటన స్పష్టం చేస్తుంది.
మదనపల్లి కు 15 కిలోమీటర్ల దూరంలో వాల్మీకిపురం పట్టణం ఉంది. ఇక్కడి లక్కీ బ్రాందీ షాపులో జూన్ 26వ తేదీ పొద్దుపోయిన తర్వాత మద్యం కొనడానికి వచ్చిన కాలేషావలీ 500 నోటు ఇచ్చాడు. తెలిసిన ముఖం కావడంతో దుకాణం మేనేజర్ నవీన్ కుమార్ అప్రమత్తమయ్యాడు.
"ఇంతకుముందు రెండుసార్లు నకిలీ నోటికి ఇచ్చావు. హెచ్చరించారు. మళ్లీ వస్తావా" అని నవీన్ కుమార్ గదమాయించడంతో నకిలీ నోటితో వచ్చిన కాలేషావలీ పారిపోయాడు. వెంటనే లక్కీ షాప్ మేనేజర్ నవీన్ కుమార్ వాయల్పాడు సిఐ జే. ప్రసాద్ బాబుకు ఫిర్యాదు చేశాడు.
"వాల్మీకిపురం వద్ద ఉన్న నయారా పెట్రోల్ పంపు వద్ద అదుపులోకి తీసుకోవడంతో మొత్తం వ్యవహారం బయటపడింది" అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు.
వాయల్పాడు సిఐ, సిబ్బందితో వెళ్లారనీ, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశారని ఎస్పీ విద్యాసాగర నాయుడు చెప్పారు. వారిని చుట్టుముట్టి పట్టుకుని పెద్దమనుషుల సమక్షంలో విచారించగా షేక్ కాలేషా వలీ ద్వారా తీగ లాగితే సూత్రధారుుల బయటపడ్డారని ఆయన చెప్పారు.
ఎస్పీ ఇంకా ఏమి చెప్పారంటే..
"కర్ణాటకకు చెందిన రాథోడ్, కుమార్, బాబు (పరారీ లో ఉన్నాడు) దొంగ నోట్ల చలామణిని అంగీకరించారు. వారిపై కర్ణాటక లో పాత కేసులు ఉన్నాయి. ఆ ముగ్గురు మదనపల్లిలో నకిలీ నోట్లను ముద్రించి, చలామణి చేసేలా పథకం రచించారు" అని ఎస్పీ వివరించారు. వారి నుంచి 500 రూపాయల ముద్రణతో ఉన్న 735 నకిలీనోట్లు, ముద్రించడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు
A1. షేక్ కాలేషా వల్లి @ కలేసా
A2. వి.యం.ముస్తాక్ అహమద్ @ ముత్తు
A3. యస్ఎండి. హఫీజ్ @ హఫీజ్
A4. భీమసింగ్ పండిట్ రాథోడ్ @ భీమసింగ్ రాథోడ్.
A5. టి.కుమారస్వామి @ కుమార్
A6. షేక్ షఫీక్ అహ్మద్ @ షఫీ
A7. నందిమంగళం యెజాజ్ పాషా @ యెజాజ్
A8. వి.యం.ఫుర్ఖాన్
A9. షేక్ ఆసిఫ్
A10. షేక్ సుహెల్
స్వాధీనం చేసుకున్నవి
1) 735 నకిలీ 500 రూపాయల నోట్లు
2) 01 EPSON EcoTank L3210 ప్రింటర్
3) TNPL A4 800 GSM పేపర్ల 03 పెట్టెలు
4) 01 LENOVO ల్యాప్‌టాప్
5) 12 సెల్ ఫోన్స్.
6) ఆర్బిఐ అక్షరాలతో ముద్రించ బడిన ఆకుపచ్చ రిబ్బన్.
నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన రాయచోటి డిఎస్పీ, ఎం.ఆర్. కృష్ణమోహన్, వాయల్పాడు సిఐ. జె. ప్రసాదబాబు, ఎస్ఐ లను అభినందించారు. వారికి నగదు రివార్డులు అందించారు.