చంద్రబాబు వల్లే వర్గీకరణ సాధ్యమైంది.. సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ

ముప్పై ఏళ్ల పోరాటం తర్వాత న్యాయం గెలిచిందంటూ ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబే ప్రధాన కారణమని చెప్పారు.

Update: 2024-08-01 09:29 GMT

ఎస్సీ ఉపవర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వాలని సీజేఐ చంద్రచూడ్ సహా ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1గా తీర్పునిచ్చింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఉపవర్గీకరణ ద్వారా షెడ్యూల్డ్ కులాల్లో బాగా వెనకబడిన వారికి లబ్ది చేకూరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించిన తీర్పుపై ఎస్సీ, ఎస్టీ నేత మందకృష్ణ మాదిగ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ముప్పై ఏళ్ల పోరాటం ఇప్పటికి ఫలించిందని, తమకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించిందని అన్నారు.

ప్రధాని మోదీకి మందకృష్ణ కృతజ్ఞతలు

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ ప్రత్యేక చోరవ తీసుకున్నారని, అందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. అదే విధంగా వర్గీకరణ చేసేలా చూసిన చంద్రబాబుకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని, రిజర్వేషన్ల వ్యవస్థ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని చెప్పారు. అదే విధంగా వర్గీకరణకు సంబంధించిన జీవోలు విడుదలైన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లను సరిచేసుకుని రీనోటిఫికేషన్లు ఇవ్వాలని కోరారు. అతి త్వరలోనే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తానమని, అదే విధంగా ఈ పోరాటంలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చంద్రబాబు వల్లే వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు. తొలుత వర్గీకరణకు ఆమోదం తెలిపింది కూడా చంద్రబాబేనని గుర్తు చేశారు. 1997లో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన చంద్రబాబే ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. ‘‘ఆనాడు వర్గీకరణకు చంద్రబాబు అంగీకరించకుండా ఉండి ఉంటే.. వేదాలి అవకాశాలు మాకు వచ్చి ఉండేవి కావు. ఇన్నేళ్ల పోరాటం తర్వాత న్యాయం బతికిందంటే దానికి అప్పుడు చంద్రబాబు తెచ్చిన చట్టమే ప్రధాన కారణం. అందుకనే చంద్రబాబు సహా ముప్పైఏళ్ల పోరాటంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ తెలిపారు మందకృష్ణ.

అసలేంటీ వివాదం..

1994లో రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి మాదిగ రిజరవేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ పోరాటం మొదలైంది. సుదీర్ఘంగా సాగిన ఈ ఉద్యమాలకు 1997లో వర్గీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో బ్రేక్ పడింది. అయితే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని మాల మహానాడు వ్యతిరేకించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఉద్యమబాట పట్టారు. ఇదే అంశంపై మాల మహానాడు..ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. రిజవర్వేషన్ల వర్గీకరణకు రద్దు చేసింది. దాంతో ఈ వివాదం కాస్తా అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.

ఈ కేసును విచారించిన ఐదుగు న్యాయమూర్తుల ధర్మాసనం.. 2004లో మరోసారి వర్గీకరణకు వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది. ఆ తర్వాత నుంచి దాదాపు ఇరవై ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో వర్గీకరణపై న్యాయపోరాటం జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణ సముచితమేనంటూ 6:1గా తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News