సనాతన వీరమల్లు ‘చే’ కు చెల్లు!
పిఠాపురం సభలో పవన్ పిల్లిమొగ్గలు;
-తెలకపల్లి రవి
'జయకేతనం' (Jayaketanam) పేరుతో తన నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన అద్యక్షుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జరిపిన బ్రహ్మాండమైన సభ అంతకంటే పెద్దస్థాయిలో సనాతన హిందూత్వ (Hindutva) సమర్థన తతంగంగా ముగిసింది. రాష్ట్రంలో తమ కూటమిపాలన గురించి ,చేయబోయే మంచి గురించి చెబుతారనుకున్నవారికి ఆశాభంగమే మిగిలింది.
పవర్ స్టార్ ఆత్మకథా శకలాలు,కుటుంబ జ్ఞాపకాలు, ఆవేశ వ్యాఖ్యానాలు, ఆత్మజ్ఞానం ప్రకటనలూ తప్ప రాజకీయ స్పష్టత లభించింది లేదు. పార్టీ పెట్టడంలో ధైర్యం ఇన్నేళ్లు నిలబెట్టడంలో తెగువ,100 శాతం స్ట్రయిక్ రేట్‌పై అతిశయాలు మాత్రమే మిగిలాయి. పనిలో పనిగా మేము నిలబడ్డామనే గాక 40 ఏళ్ల టి డిపిని ని లబెట్టామనే ప్రకటించడం నాయకత్వం వహించే తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టింది.అయితే పిఠాపురంలో మాత్రం పవన్ స్వయంగా గెలిచారు తప్ప మాజీత్యాగరాజులదేమీ లేదంటూ ఆ వర్మ కు వర్తించేలా కర్మ అంటుంటే ఆశ్చర్య పోవడం అనివార్యమైంది.
ప్రధాన ప్రత్యర్థి జగన్‌పైనా పరాజిత వైసీపీ (YSR Congress) పైన విమర్శలు విసుర్లు ఒకే గానీ అధికారంలో వాటా కల్పించిన టిడిపి పాత్ర ప్రధానంకాదా అనే ప్రశ్న పెద్దదిగా నిలిచింది. 2018లో ఇదే కాకినాడలో ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అని చేసిన విమర్శలు గుర్తు చేసుకున్న విమర్శకులూ విస్తుపోయారు.
ఘన విజయం సాధించిన పార్టీలూ, పెద్ద పదవులు అలంకరించిన వాళ్లూ విజయోద్వేగానికి లోనవడం సహజమే గానీ పిఠాపురంలో పవన్ పలుకులు పరిధి దాటేయనిపిస్తుంది.తమ కుటుంబంలో పెద్దల గురించి పరిపరివిధాల మాట్లాడటం సంస్కారంతో పక్కనపెడదాం.
పదహారేళ్ల ప్రయాణం తర్వాత వచ్చిన తొలి విజయంతోనే తాను తారాపథం చేరినట్టు భావించుకోవడం ఎక్కడ వాస్తవికత? రాజమండ్రి జైలు బయిట టిడిపితో జట్టుకడతానని ప్రకటించడం గేమ్ ఛేంజర్ (Game Changer) అయివుండొచ్చు గానీ అదే వారిని నిలబెట్టడమా?తన కన్నా చాలా పెద్దవైన రెండు పార్టీలనూ నిజంగా తానే కలిపానని పవన్ నిజంగానే భ్రమపడుతున్నారా?వారు భ్రమపెడుతున్నారా? దానధర్మాలు, సహాయ కార్యక్రమాలు, వైసీపీ దాడులను నిర్బంధాలను తట్టుకుని రంగంలో కొనసాగడం నిజమే కానీ వివిధ దశల్లో ఇందుకు తోడుగా నిలిచిన పౌర సమాజం, సోదర పార్టీలు, మీడియా వీటి పాత్ర లేశమైనా వుండదా? ఆ మాటకొస్తే 2019లో కలసి పోటీ చేసిన,స్వంత శక్తిగా ని లబెట్టిన కమ్యూనిస్టులను ఎర్రచొక్కాలని గేళి చేయడం ఎలాటి కృతజ్ఞత?
తమాషా ఏమంటే పవన్ ప్రసంగంలో అత్యధిక భాగం ఎర్రచొక్కాలకు సమాధానం చెప్పడానికీ, సనాతనం సమర్థించుకోవడానికి సరిపోయింది.ఇమేజ్ కోసం నాడు భారీ బొమ్మలతో ప్రదర్శించిన చే గువేరా (Che Guevara) తన దృష్టిలో విప్లవస్పూర్తి కాదు డాక్టర్ మాత్రమేనని ప్రకటిస్తున్నారు.(ఏదో ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నానని చెబితే ఇంతకన్నా మెరుగ్గా వుండేదేమో!) చే అంటే కమ్యూనిజం సోషలిజం మాత్రమే కాదని తెలుసుకొని తరించమంటున్నారు.
తరిమెల నాగిరెడ్డి (Tarimela Nagireddy) 'తాకట్టులో భారత దేశం' మాత్రం వదలడం లేదు. తనకు సైద్ధాంతిక నిబద్దత వుండబట్టే ఇంతకాలం నిలబడ్డానని చెబుతున్న పవన్ కళ్యాణ్ లా చేనుంచి కమ్యూనిజాన్ని వేరు చేసి చూపిన వారు ప్రపంచంలోనే మరొకరు వుండరేమో. మరోవైపున ఖుషీలో చారుమజుందార్ స్మరణ చేసిన పాత్రను ధరించి ఏ మేరా జిందగీ అంటూ పాడిన తనను గ ద్దరన్న ఎలా అక్కున చేర్చుకున్నాడో ఇప్పటికీ విని ఆనందించమన్నారు.
గుజరాత్ మారణకాండపై మాష్టార్జీతో రాయించిన ‘నారాజు కాకుర అన్నయ్య నజీరు అన్నయ్య’ పాటను ఆలపిస్తూనే గోద్రా రైలు దహనం అందుకు కారణమని దాన్నెందుకు ఖండిరచడం లేదని అ వాస్తవాలతో బుకాయిస్తున్నారు.షరామామూలుగా కుహనా లౌకిక వాదం పేరిట సనాతన హిందూత్వను నెత్తినెత్తుకుంటున్నారు. ఆయన ప్రస్తావించిన ప్రతి అంశాన్ని అందరూ ఖండిరచినా హిందువులనే ఖండిస్తారు ముస్లింలను ఖండిరచరేమిటని అభాండాలు వేస్తున్నారు.
చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి గానీ ,దక్షిణాది మోడీ అవతారంలోకిపవన్ మారినట్టు పిఠాపురం నిరూపించింది,హిందీని రుద్దడం మిథ్య అంటూ మొత్తం దక్షిణాది పై దాడిగా మారింది.ఉత్తర దక్షిణాల మధ్య తేడా ఏంటని చికాకు పడుతున్న పవన్ కళ్యాణ్‌కు గతంలో తాను దక్షిణాది రాష్ట్రాల ఫెడరేషన్ పెట్టాలని ఇదే గద్దర్‌తో చర్చలు జరిపి సంకేతాలు ఇచ్చిన సంగతి గుర్తురాలేదు.హిందీ గో బ్యాక్ అంటూ ఏదో పత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్‌చేసి ట్వీట్ పెట్టడమూ మర్చిపోయారు. ఈ అంశం కాస్త బయిటకు వచ్చాక తాను హిందీ బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించానే గానీ భాషను వ్యతిరేకించలేదని సర్దుబాటు సమాధానం విడుదల చేశారు.ఇప్పుడు అందరి విమర్శ అదే తప్ప అసలు హిందీభాషే వద్దని ఎవరన్నారు?
కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానం మరోసారి హిందీ బలవంతాన రుద్దుతున్నారనే నిరసనకు దారితీసింది.కేంద్రం ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లోనూ కూడా హిందీనే పెంచడంపై ఎంపిలు నిరసన తెలియజేశారు. కేరళ సిపిఎం ఎంపి జాన్ బ్రిటాస్ దీనిపై సుదీర్ఘ లేఖ రాశారు. హిందీ భారతీయ ఆత్మ అని పవన్ ఆరాధ్యనేత అమిత్ షా స్వయంగా ప్రకటించారు.మరి రాజ్యాంగంలోని మిగిలిన భాషల సంగతేమిటి?
తమిళనాడులో సంప్రదాయికంగా హిందీ (Hindi) సమస్యపై భావోద్వేగాలు ఎక్కువ గనక ఆ పేరే వినిపిస్తుంది గానీ సమస్య నిజమైందే.నూతన విద్యా విధానం త్రిభాషా సూత్రాని మళ్లీ ముందుకు తెచ్చింది. ప్రాథమిక విద్యలో మాతృభాషలో జరగాలని చెప్పడం గాక స్థానిక భాష లేదా ప్రాంతీయ భాష ఏదో ఒకదాంట్లో జరగాలని,మరోభారతీయ భాష కూడా నేర్పాలనీ ఆ విధానం చెబుతున్నది. ఇది అశాస్త్రీయమే గాక ఆ లేత వయసుకు భారం కూడా.ఇప్పటికే ఇంగ్లీషు మీడియం తో చదువులు మొదలవుతున్న స్థితిలో ప్రాంతీయ భాష భారతీయ భాష అనడం హిందీ లేదా సంసృతం తెచ్చిపెట్టడానికే దారితీస్తుందనేది అనుభవం.
హిందీ రాష్ట్రాలలో ఆ భాష నేర్చుకుంటే సరిపోతుంది గాని ఇతర చోట్ల మరో భారతీయ భాష కింద హిందీనే నేర్పడం కద్దు. కేంద్రం నిధులు యంత్రాంగం,పథకాలు అన్నీ హిందీ కోసమే వున్నాయి తప్ప ఇతర భాషలకోసం ఎలాటి ఏర్పాటు లేదు. ఇంగ్లీషు తో పాటు తమిళం ఎలాగూ నేర్చుకుంటున్నప్పుడు హిందీని తప్పనిసరి చేయడమేమిటని తమిళనాడులో గత వందేళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యం చూడకుండా త్రిభాషా విధానం అమలు చేయకపోతే కేంద్ర విద్యానిధులు నిలిపేస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటివారు నిర్ణయం తీసుకోవడం భగ్గున నిరసనకు దారితీసిందని పవన్ కు తెలియదా? ఈ బలవంతపు శాసనాలు ఆపకుండా తమిళులు హిందీవ్యతిరేకులన్నట్టు పవన్ వారిపై ఆభాండాలు వేయడం అనుచితం. అంతటితో ఆగక ఆయన్ తెలుగువారిని తమిళులు అవమానిస్తారని చెబుతున్నారు. ఎప్పుడైనా చారిత్రికంగా తేడాలు తగాదాలు వుండకుండా పోవు. వాటికీ కేంద్రం ఏకపక్ష ఆధిపత్యానికి పోటీ ఏంటి? మద్రాసీలుగా పిలవబడే తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ వల్లనే నిలబడిరదని టిడిపి వారు ఆయన అభిమానులు చెబుతుంటారు.
ఎన్టీఆర్ (NT Ramarao)ను గౌరవించవచ్చు గాని అంతకుముందే మహా నాయకులెందరో వున్నారు.వీరతెలంగాణ సాయుధ పోరాటం వంటి ఘట్టాలూ వున్నాయి ప్రజాస్వామ్య చైతన్యమూ వుంది. నిజానికి పవన్ అపహాస్యం చేసిన పెరియార్ వంటివారి ద్రావిడ భావజాలం ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో చూస్తాం,ఇప్పుడు పవన్ రాయలసీమ బలిజ అంటూ కులం ప్రాంతం పేరుతో నాటి ఒక తమిళనేతను ఆక్షేపించడం అవసరమా?
ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ తమిళ చిత్రాలు హిందీలో డబ్ చేయొద్దని సవాల్ చేయడం మరీ హాస్యాస్పదం, తమిళనాడులో మరీ ముఖ్యంగా చెన్నయ్‌లో హిందీ సినిమాలు బాగానే ఆడతాయి. షారుఖ్ ఖాన్ దీపికా పడుకోన్ ల చెన్నై ఎక్స్‌ప్రెస్, రజనీకాంత్ (Rajnikanth) ‘ధారావీ’ పై తీసిన ‘కాలా’ వంటి చిత్రాలు కూడా చూశాం. ఇప్పుడు పాన్ ఇండియా యుగంలో దక్షిణాదినే హిందీ పరిశ్రమ చూపు వుంటున్నది. సినిమాల నుంచి ప్రాంతాలవరకు మతాల వరకూ ప్రతి విషయంలోనూ పవన్ బిజెపి భావజాలాన్ని మోడీని మోయడమే కార్యక్రమంగా పెట్టుకున్న ఫలితమిది.
ప్రకాశ్ రాజ్ (Prakash Raj) దీనికి సరిగ్గానే సమాధానమిచ్చారు.సున్నితమైన భాషా సాంసృతిక సమస్యలను విశాల దృష్టితో చూడకుండా సనాతన సులోచనాలుతగిలించుకోవడం వల్ల సమగ్రంగా చూడలేక అరకొర వ్యాఖ్యలు చయడం తగనిపని. ఇలాటి అంశాల్లో అవగాహన రాహిత్యంఅవకాశవాదం అనర్థదాయకం.ఈ బహుభాషా పాండిత్యాన్ని ఉపయోగించి తమిళ మరాఠా భాషల్లో హిందీలో మాట్లాడి ఎకాఎకిన జాతీయ నాయకత్వంలోకి వెళ్లిపోయినట్టు ఆయన భావించడం, దక్షిణాదిలో తమకు ఠికాణా లేదు గనక బిజెపి నాయకత్వం ఆయనను ముందుకు నెట్టవచ్చు.టిడిపిని అదుపులో పెట్టుకోవడానికీ పవన్ అవసరం కావచ్చు.ఆ మాటకొస్తే పవన్ లోకేశ్‌లే బిజెపి నేతలతో ఎక్కువగా సంబంధం కలిగివున్నారు. తమిళం మాట్లాడతాడని బిజెపి సంఘ పరివార్‌లు పవన్‌కు జాతీయ బాధ్యతలు దక్షిణాది నాయకత్వం అప్పగిస్తారనుకుంటే పొరబాటే.
కొసమెరుపు: ఇవన్నీ చెప్పిన జనసేనాని పులిచంపినలేడి నెత్తురూ ఎగరేసిన ఎర్రని జండా కావాలన్న శ్రీశ్రీ కవిత్వ చరణాలతో ప్రసంగం ముగించడం ఆసక్తిగా లేదూ?ఉదయసూర్యుని సప్తహయములు కనకదుర్గా చండసింహం ఆదిసూకర వేదవేద్యుడు వంటి పదాలు చూసి ఆయన ఈ ఎంపిక చేసి వుంటారు. కానీ నిజమేమంటే దేవతలపై వాహనాలు తిరగబడుతున్నాయని చెప్పడానికి మహాకవి ఎంచుకున్న సంకేతాలవి, పుడమితల్లికి పురిటినొప్పులు అనే భావన తన సనాతనానికి సరిపోలుతుందని ఉప ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి స్త్రిప్టు తయారు చేసిన మ హానుభావులెవ్వరో మరి?చే గువేరా అరుణాశయాలను తోసిపుచ్చిన పవన్ మళ్లీ అదే తప్పు పునరావృతం చేయడం హరిహరవీరమల్లు తాజా అధ్యాయమా?
(తెలకపల్లి రవి, సామాజిక, ఆర్థికాంశాల విశ్లేషకుడు)