మలి విడతలోనూ జన సైనికులకు మొండిచెయ్యే..!

నామినేటెడ్ పదవులపై కొండంత ఆశలు. తొలి జాబితాలో ఉత్తరాంధ్రలో ఒక్కరికి. రెండో జాబితాలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్. కీలక పదవులన్నీ టీడీపీకేనా? రగిలిపోతున్న సీనియర్లు.

Update: 2024-11-09 11:54 GMT

సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చాలామంది ఆశావహులు టిక్కెట్ల కోసం ఆరాటపడ్డారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నాక వీరంతా త్యాగమూర్తులయ్యారు. వీరు ఆశ పెట్టుకున్న సీట్లను టీడీపీ నేతలు తన్నుకుపోయారు. పొత్తు ధర్మాన్ని పాటించాలన్న అధినేత పవన్ కల్యాణ్ మాటకు వీరంతా కట్టుబడిపోయారు. ఇప్పుడు సీట్లను త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో మనకే పెద్ద పీట వేస్తారన్న పవన్ మాటలతో అయిష్టంగానో, ఆశతోనో వారంతా ఆ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చారు. వారు ఆశించినట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి నామినేటెడ్ పదవుల పందేరం ఎప్పుడెప్పుడా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అధికారం చేపట్టిన నాలుగు నెలలకు తొలివిడత నామినేటెడ్ పదవుల పంపకం జరిగింది. ఆ

విడతలో ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో జనసేనలో ఒక్కరంటే ఒక్కరికే పదవి దక్కింది. ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్రావును వరించింది. అప్పట్లోనే జనసేన నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే రెండో విడతలో తమకు అవకాశం దక్కుతుందని సరిపెట్టుకున్నారు. రెండు నెలల తర్వాత రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితాను శనివారం విడుదల చేశారు. ఆ జాబితాలో ఉత్తరాంధ్రలో 13 మందికి వివిధ పదవులు దక్కాయి. ఈసారి ఇద్దరికే పదవులొచ్చాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి పాలవలస యశస్వికి ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్, కె.రవికుమార్కు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి లభించాయి. ఉత్తరాంధ్రలో మిగిలిన ఐదు జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏ ఒక్క జనసేన నాయకుడికీ నామినేటెడ్ పదవి అదృష్టం వరించలేదు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన తమకు నామినేటెడ్ పదవుల్లో మొండి చేయి చూపిస్తారా? అంటూ జనసేన నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు.

 

కీలక పదవులన్నీ టీడీపీ వారికే..

పైపెచ్చు రెండో జాబితాలో కీలక పదవులన్నీ టీడీపీ వారికే లభించడం జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కీలకమైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, గిరిజన సహకార సంస్థ చైర్మన్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ వెలమ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ వంటివన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలయ్యాక తామంతా కరివేపాకులుగా చేశారంటూ రగిలిపోతున్నారు. ఎన్నికలకు ముందు చేపట్టిన పార్టీ ఉద్యమాల్లో అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసుల్లో కోర్టుల అరెస్టయి,

జైళ్లకెళ్లామని, ఎన్నికల్లో సీట్లను త్యాగం చేయడమే కాదు.. టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశామని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు జనసేన పీఏసీ సభ్యుడు, సీనియర్ నాయకుడు కోన తాతారావు వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని ఆశించారు. అలాగే విశాఖ ఉత్తరం నియోజకవర్గం సీటునాశించి భంగపడ్డ ఉషాకిరణు, భీమిలి ఇన్చార్జి పంచకర్ల సందీప్, చోడవరం సీటును త్యాగం చేసిన పీవీఎస్ఎన్ రాజు తదితరులు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వీరిలో ఎవరికీ దక్కలేదు.

 

లోకేష్ శిష్యుడికి జాక్పాట్ !

ఇక రెండో జాబితా నామినేటెడ్ పదవుల్లో లోకేష్ శిష్యుడు జాక్పాట్ కొట్టారు. వీఎంఆర్డీఏ చైర్మన్ గిరీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్కు కట్టబెట్టారు. ఈ జాబితాలో ఆయన పేరు చూసి ఇటు జనసేన నేతలే కాదు.. టీడీపీ నాయకులు సైతం అవాక్కయ్యారు. స్టూడెంట్ నాయకుడికి రాష్ట్రంలోనే అతి పెద్దది, ప్రతిష్టాత్మకమైన వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని ఎలా ఇస్తారంటూ విస్తుపోతున్నారు. ఈ కీలక పదవిని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆశిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబీ వంటి వారు ఈ పదవిని ఆశించారు. అయితే అనూహ్యంగా విద్యార్థి నాయకుడు ప్రణవ్ గోపాల్కు ఇవ్వడంతో షాక్ అయ్యారు. మంత్రి లోకేష్కు ప్రణవ్ గోపాల్ సన్నిహితంగా ఉంటారు. అందువల్ల లోకేష్ పట్టుబట్టి ప్రణవ్కు ఈ చైర్మన్ పదవిని ఇప్పించారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల రెండో జాబితా జనసేనలో ఓ పెద్ద డిజాస్టర్ అని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.

వ్యూహాత్మకంగానేనా?

ఎమ్మెల్యేలకు గాని, మాజీ ఎమ్మెల్యేలకు గాని, సీనియర్లకు గాని, జనసేన నేతలకు గాని వీఎంఆర్డీఏ చైర్మన్ పదవినిస్తే ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతారన్న భావనతోనే వారికి కాకుండా విద్యార్థి నేత ప్రణవ్ గోపాలు ఇచ్చారని టీడీపీ, జనసేన పార్టీల సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. కీలకమైన ఈ పదవిని తమ చెప్పుచేతల్లో ఉన్న వారికిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముందు చూపుతోనే పార్టీ ముఖ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

 

ఉత్తరాంధ్రలో ఎవరికీ ఏ నామినేటెడ్ పదవులు?

1. ఏపీ గవర వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మాల సురేంద్ర (అనకాపల్లి) 2. ఏపీ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ (మాడుగుల)

3. ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గండి బాల్జీ (పెందుర్తి)

4. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు (బొబ్బిలి-విజయనగరం)

5. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు (యలమంచిలి, అనకాపల్లి జిల్లా)

6. ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ కావలి గ్రీష్మ (రాజాం)

7. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ దొన్ను దొర (విజయనగరం జోన్)

8. ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ (విశాఖపట్నం సౌత్)

9. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మినాయుడు (బొబ్బిలి)

10. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రణవ్ గోపాల్ (విశాఖపట్నం ఈస్ట్)

11. ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ (అరకువేలీ అల్లూరి సీతారామరాజు జిల్లా)

12. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోరికన రవికుమార్ (శ్రీకాకుళం-జనసేన)

13. ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి (శ్రీకాకుళం-జనసేన) 

Tags:    

Similar News