జగన్‌ నిర్ణయం చాలా అవమానానికి గురి చేసింది: మోపిదేవి వెంకటరమణ

గత శాసనసభ ఎన్నికలు తనను తీవ్ర బాధకు గురి చేశాయి. ఎప్పుడు పోటీ చేయకుండా ఉండలేదు.

Update: 2024-09-23 06:34 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన మొన్నటి వరకు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉండి, టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు తనను చాలా బాధకు గురి చేశాయన్నారు. తన రాజకీయ ప్రయాణంలో తొలిసారిగా బాధకు గురి చేసిన సంఘటన 2024 శాసన సభ ఎన్నికలే అని అన్నారు. దాని గురించి ఆయన మాట్లాడుతూ ఆ ఎన్నికల్లో తాను శాసన సభకు పోటీ చేయక పోవడం అనేది తనను చాలా బాధకు గురి చేసిందన్నారు. ఎప్పడు తాను శాసనసభకు పోటీ చేయకుండ ఉండ లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయడం తనకు నచ్చిన అంశమని, కానీ ఆ అవకాశం గత ఎన్నికల్లో తనకు లేకుండా పోయిందన్నారు. ఇది తన రాజకీయ ప్రయాణంలో బాగా బాధపెట్టిన అంశంగా ఆయన చెప్పుకొచ్చారు. అందరు పోటీ చేస్తున్నారు. సీనియర్‌ లీడర్‌ అయిన తాను మాత్రం పోటీలో లేక పోవడం అనేది తనను తీవ్ర అవమానానికి గురి చేసిందని అని చెప్పారు. ఎందుకు జగన్‌ మోహన్‌రెడ్డి తనను ఎమ్మెల్యేగా పోటీలో నిలప కూడదని నిర్ణయించుకున్నారో తనకు తెలియదన్నారు. కానీ తనను పోటీలో పెట్టకూడదని జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం తనను బాగా బాధ పెట్టిందని, ఇది తనను తీవ్ర అవమానానికి గురి చేసిందని చెప్పారు.

తాను రాజ్యసభకు రాజీనామా చేసిన రోజే ఢిల్లీలో ఓపెన్‌గా చెప్పానన్నారు. రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నానని ఆ రోజే ఓపెన్‌గా చెప్పానన్నారు. తాను ఉన్న పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌సీపీకి, రాజ్య సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే అది నా తప్పే అవుతుందని, వైఎస్‌ఆర్‌సీపీకి ద్రోహం చేసిన వాడిని అవుతునానని అన్నారు. అందుకే ఎన్నికలకు ముందు అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ పార్టీలో తాను చేసినంత వరకు తన బాధ్యతను నిర్వహించానన్నారు. తర్వాత తాను ఏ పార్టీలోకి వెళ్లినా, వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసినా, దాని మీద ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. అందువల్లే వైఎస్‌ఆర్‌సీపీని, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మోపిదేవి వెంకటరమణ విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో సోదర సంఘీయులతో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ మీద, జగన్‌పైన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఆయనకు ఎంతో నమ్మిన బంటుగా పని చేసిన మోపిదేవి, మాజీ సీఎం జగన్‌ కేసుల్లో కూడా జైలుకెళ్లారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న మోపిదేవి వైఎస్‌ఆర్‌సీపీ, జగన్‌పైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News