TIP TO JAGAN|జగన్ కి ఓనాటి శిష్యుడు కోటంరెడ్డి చెప్పిన చిట్కా ఏటంటే..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నేత జగన్ కి ఓనాటి శిష్యుడు. ఇప్పుడు ఆయన తన మాజీ బాస్ జగన్ కి ఓ చిట్కా చెప్పారు. అసెంబ్లీకి రావాలంటే అదే మంచి మందు అంటున్నారు..
By : The Federal
Update: 2024-11-22 08:33 GMT
"జగనన్నా.. నిన్ను అసెంబ్లీలో చూడాలని ఉందన్నా.. ఒక్కసారి అసెంబ్లీకి రండన్నా.." అంటున్నారు ఓనాటి వైసీపీ నాయకుడు, జగన్ మోహన్ రెడ్డి శిష్యుణ్ణని చెప్పుకున్న ఈనాటి తెలుగుదేశం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ ఓటమి తర్వాత అసెంబ్లీలో జగన్ కనపడడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సెటైర్లు పేలుస్తున్న తరుణంలో ఆయన చాలా వెటకారంగా కొన్ని కామెంట్లు చేశారు. వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వస్తారంటూ సెటైర్ వేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. జగన్ మనస్తత్వం తనకు బాగా తెలుసునన్నారు. జగన్ కి ఏమి చెబితే శాసనసభకు వస్తారో కూడా సభాపతికి సలహా ఇచ్చారు. వైసీపీకి ప్రస్తుతం 11 సీట్లే ఉన్నాయి. దాంతో వైఎస్ జగన్ సభకు రాకుండా మొహం చాటేశారన్నారు. అయితే సభకు రావాలంటే తన దగ్గర ఓ చిట్కా ఉందని, రోజుకు ఒక గంట జగన్‌కు మాట్లాడేందుకు సమయం ఇస్తే ఆయనే సభకు వస్తారని, లేని పక్షంలో 'జగనన్న' రారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
"2017లో ys Jagan పాదయాత్రకు వెళ్ళే సమయంలో బాధ్యతలు బుగ్గనకు గానీ ఇంకెవరికైనా అప్పగించి వెళ్ళాలి.. కానీ జగన్ అలా చేయలేదు... ఎందుకంటే ఆయన మినహా మిగతావారెవరూ మాట్లాడటం "అన్న"కి ఇష్టం ఉండదు. అందుకనే జగన్ అసెంబ్లీకు రావడం లేదు. ఎవరిని రానివ్వడం లేదు" అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. "మైక్ ఆయన ఒక్కడికే ఉండాలి... ఇంకెవరు మాట్లాడకూడదు" అని జగన్ అనుకుంటారన్నారు. అందుకనే జగన్‌కు స్పీకర్ గంట సమయం మాట్లాడటానికి ఇస్తానంటే తప్పకుండా అసెంబ్లీకు వస్తారన్నారు.
"జగన్‌ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదు" అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్‌కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా ఎవ్వరూ అడ్డం రాకూడదని, ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఎప్పుడు సమస్యల కోసం పోరాడలేదని.. ఆయన మైక్ కోసమే "మమ్ములను" పోరాడమని చెప్పేవారని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పడం గమనార్హం.