వందల ఎకరాలు జగన్‌ లాక్కున్నారు : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును వేధించి చంపేశారు. బాంబులతో బెదిరించి భూములు లాక్కున్నారు. పల్నాడు పర్యటనలో పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు.

Update: 2024-11-05 11:45 GMT

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన పవర్‌ ప్రాజెక్టు కోసం బెదిరించి వందల ఎకరాలను ప్రజల నుంచి లాక్కున్నారని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జగన్‌మోహన్‌రెడ్డి సరస్వతి పవర్‌ ప్లాంట్‌ భూముల పరిశీలన కోసం మంగళవారం పల్నాడు పర్యటన చేపట్టారు. అందులో భాగంగా మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో పర్యటించారు. భూములిచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆ గ్రామాల్లోని సరస్వతి పవర్‌ ప్లాంట్‌ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ సరస్వతి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. దీని చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 400 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయని, వాటిని రెవిన్యూ భూములుగా మార్చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాక్కున్నారని ధ్వజమెత్తారు.

2009లో ఈ భూములను 30 ఏళ్లకు తీజుకు తీసుకుంటే, వైఎస్‌సీపీ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి 50 సంవత్సరాలకు పెంచుకున్నారని విమర్శలు గుప్పించారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్నారు. పరిశ్రమను ఏర్పాటు చేసి, చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ప్రజల నుంచి ఆ భూములను అమ్మేలా మోసం చేశారని విమర్శించారు. ప్రజలకు ఇష్టం లేకున్నా, బలవంతంగా ఆ భూములను జగన్‌మోహన్‌రెడ్డి పవర్‌ ప్లాంట్‌ కోసం అమ్మాల్సిన పరిస్థితులను క్రియేట్‌ చేశారని ఆరోపించారు. ఈ ప్రాసెస్‌లో ప్రజలు, రైతుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పెట్రోల్‌ బాంబులు వేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంశాన్ని కూడా ప్రస్తావించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాదరావును వేధించి వేధించి చంపేశారని విమర్శలు గుప్పించారు.

ఒక పక్క ఫర్నిచర్‌ పేరుతో కోడెల శివప్రసాదరావును వేధింపులకు గురి చేస్తూ, మరో పక్క ప్రజల నుంచి తన పవర్‌ ప్రాజెక్టు కోసం భూములు లాక్కొనే ప్రయత్నం చేశారని జగన్‌పై వపన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. దళిత కుటుంబాలకు చెందిన భూములను కూడా లాక్కున్నారని విమర్శించారు. దాదాపు 24 ఎకరాల భూమిని ఎస్సీ వర్గాలకు చెందిన వారిని బెదిరించి, భయపెట్టి మరీ లాక్కున్నారని ధ్వజమెత్తారు. ఆ విధంగా బలవంతంగా లాక్కున్న భూముల్లో దాదాపు 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయన్నారు. మరో 24.78 ఎకరాల కుంటలు, చెరువుల భూములు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి లాక్కున్న భూములను సొంత ఆస్తిగా భావిస్తూ వాటాల కోసం జగన్‌ కుటుంబంలో కొట్లాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. రాష్ట్రంలోని సజహ వనరులు ఎవరి సొత్తు కాదని అన్నారు. సరస్వతి భూముల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వీటిపైన విచారణ చేపట్టి నిగ్గు తేలుస్తామన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సోమవారం విమర్శలు చేసిన విధంగానే పల్నాడు పర్యటనలో కూడా విమర్శలు చేశారు. పోలీసు అధికారులు మెత్తబడి పోయారని లేకుంటే ఎందుకు భయపడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక యువతను వైఎస్‌ఆర్‌సీపీ వారు భయపెడితే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెట్రోలు బాంబులు, నాటు బాంబులు వేసి బెదిరిస్తోంటే ఏమి చేస్తున్నారని పోలీసులను నిలదీశారు. వైఎస్‌ఆర్‌సీపీ రౌడీ మూకల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అని అన్నారు. శాంతి భద్రతలు అంటే ఎంత బలంగా ఉంటాయో వైఎస్‌ఆర్‌సీపీ కేడర్‌కు చూపించాలని పోలీసులకు సూచించారు.
Tags:    

Similar News