రాజుకుంటున్న జగన్, షర్మిల ఆస్తుల గొడవ

ఏపీలో వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిల ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఎక్కడ నలుగురు గుమికూడినా, ఇదే విషయం చర్చించుకుంటున్నారు.

By :  Admin
Update: 2024-10-26 06:44 GMT

అన్నా, చెల్లెలైన వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిల ఆస్తుల గొడవ రోజు రోజుకు రాజుకుంటోంది. ఒకరు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు కాగా, మరొకరు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌ వారసత్వంగా వీరికి వచ్చిన ఆస్తులు ముందుగానే పంపకాలు జరిగినట్లు వారి బందువులు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న కాలంలో జగన్‌ చేసిన వ్యాపారాల వల్ల వచ్చిన ఆస్తులు ఎక్కువుగా ఆయన పేరు మీదనే ఉన్నాయి. సరస్వతీ పవర్‌కు సంబంధించిన ఆస్తుల విషయంలో సగం వాటా ఉందని, ఆ మొత్తాన్ని కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాత ఇస్తానని 2019లో జగన్, షర్మిలకు గిఫ్ట్‌డీడ్‌ రాసిచ్చారు. ఆ తర్వాత ఇటీవల సరస్వతీ పవర్‌ ప్రాజెక్టు ఆస్తుల్లో సగం వాటా షర్మిల పేరుపై బదిలీ కావడంతో తనకు తెలియకుండా ఎలా బదిలీ చేయించుకుంటారని జగన్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అన్నా, చెల్లెలు మధ్య లేఖల యుద్ధం మొదలైంది. ఈ లేఖల్లో తాను చేసి కరెక్ట్‌ అంటే తాను చేసిందే కరెక్ట్‌ అని ఇరువురు మీడియాకెక్కారు. షర్మిల చేస్తున్నది చాలా తప్పన్న రీతిలో శుక్రవారం సాక్షి పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన షర్మిల పది ప్రశ్నలు సంధిస్తూ మీడియా ముఖంగా అన్నకు సవాల్‌ విసిరింది. శనివారం సాక్షిలో మరో కథనం ప్రచురితమైంది. సరస్వతీ పవర్‌ వాటాలపై షర్మిల వాదన అసంబద్దం అంటూ మరో కథనం ప్రచురితమైంది. షర్మిలపై వస్తున్న కథనాల గురించి ఆమె గతంలోనూ స్పందించారు. సాక్షిలో తనకు కూడా వాటా ఉందనే విషయాన్ని జగనన్న గుర్తించాలని, నా పైనే సాక్షిలో ఇటువంటి కథనాలు రావడం నన్ను చాలా బాధిస్తోందని అన్నారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు షర్మిల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అన్నా, చెల్లెలు ఆస్తుల వ్యవహారం గురించి చెబుతారా? పార్టీ వ్యవహారాలేమైనా చెబుతారా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News