ఏపీలో ఇక వర్షాలే వర్షాలు
16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు ఎనిమిది రోజులు ముందుగా ప్రవేశించాయి.;
ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో నిప్పులు వర్షం కురిపించిన భానుడు చల్లబడ్డాడు. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కరిబిక్కిరి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాటి నుంచి ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శనివారం నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే ఈ ఏడాది ఎనిమిది రోజులు ముందుగానే ఎంట్రీ ఇచ్చేశాయి. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2009లో కూడా నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే ప్రవేశించాయి.
సహజంగా జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ 2009లో ముందుగానే ప్రవేశించాయి. మే 23నే రుతుపనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీటైంది. మే 24న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.