బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి నిప్పుల వాగు ద్వారా వెలుగోడు రిజర్వాయర్ స్పిల్ వే గేట్లు ఎత్తి గాలేరు ద్వారా కుందు నదికి విడుదల చేసే నీటిని పదివేల క్యూసెక్కులకు మించకుండా నిలుపు చేసి కుందూనది పరీవాహక ప్రాంతంలో వరదలను నివారించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలోఉపాధ్యక్షులు వై యన్ రెడ్డితో కలిసి బొజ్జా మాట్లాడుతూ.. శ్రీశైలం వెనక జలాల నుండి కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకొని పోవడానికి అవసరమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కృష్ణా కుడి ప్రధాన కాలువ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణాలు పూర్తి సామర్థ్యంతో పూర్తి అయినప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకునే నిర్మాణాల పూర్తి చేయకపోవడం నిర్వహణ పట్ల పాలకుల నిర్లక్ష్యం రాయలసీమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం 22 రోజుల క్రితం మొదలుపెట్టి నేడు 31 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచారు. కానీ ఈ రోజుకు కూడా గండికోట, మైలవరం బ్రహ్మ సాగర్ రిజర్వాయర్లకు చుక్క నీరు కూడా చేరలేదు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్లకు 30 టీఎంసీలు నీటిని కూడా తరలించలేక పోయారు. ఇది రాయలసీమ సాగునీటి వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.
ఇదే సందర్భంలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి విడుదల చేసిన నీటిలో సుమారు 18000 కేసెక్కులు కృష్ణా జలాలు నిప్పుల వాగు, గాలేరు నది ద్వారా కుందునదికి వదలడం వలన కుందూ పరివాహక ప్రాంతంలో సాగు చేసిన పంటలు మునిగి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం జరగడమే గాక నంద్యాల ప్రాంతం వరద ముంపుకు గురవుతుందన్న అధికారుల ప్రకటనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకులు ఇప్పటికైనా రాయలసీమ అభివృద్ధి పట్ల నిజాయితీతో వ్యవహరించాలని రాయలసీమ సమాజం ఆశిస్తున్నది. గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టడం, నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా గోరుకల్లు, గండికోట, మైలవరం రిజర్వాయర్లకు వెలుగోడు రిజర్వాయర్ నుండి మద్రాసు కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బ్రహ్మసాగర్ కు శ్రీశైలం రిజర్వాయర్ వరద రోజులలో నీటిని నింపి రాయలసీమ అభివృద్ధికి దోహదపడాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.