"సీమ"పై వైఎస్ జగన్ పట్టు జారుతోందా?

రాయలసీమలో మాజీ సీఎం వైఎస్. జగన్ పట్టుజారుతోందా? మున్సిపాలిటీలు చేజారుతున్నాయా? వారికి టీడీపీలో ద్వారాలు తెరిచారా? చక్రం తిప్పిన నేతలంతా ఏమయ్యారు.

Update: 2024-07-12 10:50 GMT

రాయలసీమలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. ఆ గట్టుపైకి దూకాలనుకునే వారికి ధైర్యం చెప్పే వారు లేరు. ప్రధాన నేతల పరిస్థితి కూడా దాదాపు అదేవిధంగా ఉంది. తమను తాము రక్షించుకునే స్థితిలో మాజీలు చాలా వరకు హైదరాబాద్కు పరిమితం అయ్యారని చెబుతున్నారు. దీంతో జంపింగ్ రాజాలను నిలువరించే స్థితిలో కూడా లేరు. కొందరికి అధికార టీడీపీ కూటమిలో కూడా ద్వారాలు తెరిచి లేవంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ నేతల పరిస్థితి ఏమిటి? కొన్నిచోట్ల సొంత నిర్ణయాలు తీసుకున్న కూటమి నేతల వల్ల వర్గపోరు రగిలింది. ఇది కాస్తా, అధినేతలకు తలనొప్పిగా మారింది.


రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం బనాయించిన కేసులను తిరిగదోడుతున్నారు. గతంలో తమ పార్టీ శ్రేణులు, నాయకులపై వేధింపులు, దాడులకు పాల్పడిన వారిలో మంత్రులను కూడా వదలకుండా చట్టప్రకారం తీసుకుంటున్న చర్యలతో బెంబేలెత్తుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ద్వితీయశ్రేణి నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటున్నారు.
నెల్లూరులో ఆయన మినహా నేతలేరీ..?

అదికారంలో ఉండగా చక్రం తిప్పిన ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి వెంట భుజాలెగరేసుకుని తిరిగిన నేతలు అడ్రస్ లేరు. బయటికి బయలు దేరాలంటే మంత్రులకు ధీలుగా ఎస్కార్ట్, కాన్వాయ్ వాడిన ఎమ్మెల్యేలు గడప దాటడం లేదు. వారి చడీచప్పడు లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిన కాకాణి గోవర్థనరెడ్డి మాత్రం ఫలితాలు వెలువడిన తరువాత కూడా జనం మధ్యలో ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై స్పందిస్తున్నారు. ఆయన మినహా మీసాలు మెలేసిన ఒక నేత కూడా రాయలసీమలో పార్టీ శ్రేణుల కోసం బయటికి వచ్చే సాహసం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో
మారుతున్న ముఖచిత్రాలు..
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి నగర పాలక సంస్థలు, ఏడు మున్సిపాలీటీలు ఉన్నాయి. ఇప్పటికే చిత్తూరు కూటమి ఖాతాలో చేరింది. తిరుపతి దాదాపు అదే పరిస్థితి. మదనపల్లె మినహా మిగతావి వైఎస్ఆర్ సీపీ ఖాతా నుంచి జారిపోయే పరిస్థితి ఉంది. అనంతరం జిల్లాలో నగర కార్పొరేషన్ తో సహా ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఒక కార్పొరేషన్ తోసహా ఏడు మున్సిపాలిటీలు, కడపలో నగర కార్పొరేషన్తో సహా ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో నగర పాలక సంస్థలు టీడీపీ గుప్పిట్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆరోపణలు లేని వారిని మాత్రమే తీసుకోవడం ద్వారా అవినీతికి పాల్పడిన వారి భరతం పట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.


పుంగనూరు నుంచి అమలు...
రాయలసీమలోని చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ నుంచి గట్టు దూకే కార్యక్రమం ప్రారంభమైంది. అది మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించింది.
చిత్తూరు జిల్లాలో పుంగనూరుకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. స్థానిక మున్సిపాలిటీలో టీడీపీ నుంచి నామినేషన్లు కూడా దాఖలు చేయనివ్వని స్థితిలో పెద్దిరెడ్డి మద్దతుదారులు ఇష్టానురాజ్యంగా వ్యవహరించి, పుంగనూరు మున్సిపాలిటీని దక్కించుకున్నారు. ఇక్కడ 31 మంది కౌన్సిలర్లలో చైర్మన్ సహా 19 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సీపీకి గుడ్బై చెప్పారు. పుంగనూను టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు)ని రొంపిచర్లలోని ఆయన నివాసంలో కలిసి, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
"వైఎస్ఆర్ సీపీలో పదవులు ఇచ్చారు. అధికారం మాత్రం ఇవ్వలేదు"
అని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంబాషాతో పాటు కౌన్సిలర్లు వ్యాఖ్యానించారు.
రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ార్ సీపీ ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి తగిలిన మొదటిదెబ్బ అనడంలో సందేహం లేదు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సొంత ఊరిలో పాదం మోపనివ్వకుండా తిరగబడ్డారు. దీంతో ఆయన తమ వెంట తిరిగి తిరుగుబాటు చేసిన వారిని ఆయన నిలువరించలేని స్థితి కాదు కాదా. ధైర్యం చెప్పే అవకాశం కూడా లేకుండా చేశారు.
మూసుకున్న ద్వారాలు
అధికార టీడీపీలో చేరాలని తలచిన కుప్పం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు చుక్కెదురైంది. కుప్పం నియోజకవర్గాన్నికూడా టార్గెట్ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులను మోహరించారు. కుప్పం మున్సిపాలిటీలో పాగా వేయించారు. ఇక్కడ 19 మంది వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లను గెలిపించుకుని డాక్టర్ సుధీర్ ను చైర్మన్ చేశారు. టీడీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు విజయం సాధించారు. ఇందుకోసం ఎంఎల్సీ భరత్ కూడా తీవ్రంగా పని చేశారు.
2024 ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ సీపీ కంగుతిన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడి, నెల తిరగకముందే పరిస్ధితులు శరవేగంగా మారాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ సహా ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన కుప్పం టీడీపీ నేతలు మండిపోయారు. అవేమి పట్టించుకోని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కౌన్సిలర్లతో కలిసి, గురువారం అమరావతికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆస్పత్రిపై దాడి చేశారని సమాచారం. కాగా, అమరావతికి వెళ్లిన సుధీర్ కు సీఎం ఎన్. చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో తిరిగి వచ్చారు. పార్టీశ్రేణులకు అండగా నిలవాల్సిన ఎంఎల్సీ భరత్ హైదరాబాద్ కు పరిమితం అయ్యారని పార్టీ వర్గాల సమాచారం. అన్నీ ముందుండి నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరికి వెళ్లలేని స్థితిలో కుప్పం వెపు ఏమి వెళతారు? దీంతో వారి వ్యవహారం అగమ్యగోచరంగా మారింది.

తిరుపతి నగర పాలక సంస్థలో కూడా వైఎస్ఆర్ సీపీ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఫలితాల అనంతరం డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆయన ఎక్కడికో వెళ్లారని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా చప్పుడు కాకుండా, ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను అపహాస్యం చేశారని టీటీడీ, బీజేపీ నేతలు మండిపడ్డారు.

"నేను ప్రతిపాదించిన కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు" అని బీజేపీ అధికార ప్రతినిధి జీ. భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తన ప్రమేయం లేకుండానే సంతకం ఫోర్జరీ చేశారని కూడా ఆయన అలిపిరి పోలీస్ స్తేషన్ వద్ద అప్పట్లో ధర్నాకు కూడా దిగారు. కార్పొరేషన్లో 50 డివిజన్లలో 48 కైవసం చేసుకుంది. వారిలో చాలామంది జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి సిగ్నల్ ఇస్తే, మున్సిపల్ ముఖచిత్రం మారిపోతుందని చెబుతున్నారు. మంత్రి పదవి దక్కని స్థితిలో ఆయన స్తబ్దతగా ఉన్నారు.
నెల్లూరు నగర ఎస్టీ మహిళా మేయర్ స్రవంతి అధికార టీడీపీ పార్టీలో చేరడానికి రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని బహిరంగంగా ప్రాధేయపడ్డారు. ఆమెను ప్రమోట్ చేసింది శ్రధరరెడ్డే. కానీ, ఆమె భర్త జయవర్ధన్ వ్యవహారం వివాదస్పదంగా మారడంతో పెండింగ్ లో ఉంచారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ సీపీ నుంచి విజయం సాధించినా, ఆయన శ్రీధరరెడ్డి వెంటే ఉండడంతో నెల్లూరు కార్పొరేషన్ పూర్తిగా టీడీపీ ఖాతాలో ఉన్నట్లే లెక్క.

అనంతపురం నగర కొర్పొరేషన్ లోని 50 డివిజన్లలో వైఎస్ఆర్ సీపీ పట్టులో ఉన్నా, మేయర్ వాసిం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి ఎన్నికల ముందు నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో ఎంఎల్ఏ అభ్యర్థిత్వం కోసం చేసిన ప్రయత్నాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అడ్డుకున్నారని ఆగ్రహంగా ఉన్న ఆయన, అనుచరులతో పక్కచూపులు చూస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని పామిడి, తాడిపత్రి, గుంతకల్లు, కల్యాణదుర్గం, రాయదుర్గం మున్సిపాలిటీల పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. దీంతో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాలక మండళ్లు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కొందరికి చెక్ పెడుతున్నారు.
రగిలిన చిచ్చు...

కర్నూలు నగరంతో పాటు, నందికొట్కూరులో అధికార కూటమిలో పార్టీ నేతలను చేర్చుకునే విషయంలో చిచ్చు రగిలింది. నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానం నుంచి జీ. జయసూర్య విజయం సాధించారు. రిజర్వు చేయకముందు బైరెడ్డి కుటుంబ పెత్తనం సాగేది. 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి ఎంపీగా విజయం సాధించారు. ఎన్నికల ముందు వరకు చక్రం తిప్పిన ఆయన అన్న కుమారుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డికి బ్రేక్ పడింది. ఆయనతో మెలిగిన, మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లను బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీలోకి స్వాగతించడంతో ఎమ్మెల్యే జయసూర్య, పార్టీ ఇన్చార్జి మండుపోతున్నారు. "పార్టీలో బైరెడ్డి ఏ హోదా ఉంది." అని ఎమ్మల్యే జయసూర్య, ఇన్చార్జి, మాండ్ర శివానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

2021 మార్చి పదో తేదీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.. 2020 లో తీసుకుని వచ్చిన చట్టం ప్రకారం నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆస్కారం లేదు. దీనివల్ల మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. అయితే, అధికార పార్టీలోకి వెళితే మేలు జరుగుతుందని కొందరు భావించినా, వారికి ద్వారాలు తెరవడం లేదని చెబుతున్నారు.
Tags:    

Similar News