మారనున్న అనకాపల్లి వైసీపీ ముఖచిత్రం

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో వైసీపీ ఉందా? ముత్యాలనాయుడు దాఖలు చేసిన నామినేషన్‌ను రద్దు చేయిస్తుందా? ఆయన స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన నేతకు అవకాశమా?

Update: 2024-04-23 11:48 GMT

ప్రస్తుతం అత్యద్భుతంగా రాణిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటో తెలుసా? అదే ఆంధ్ర రాజకీయం. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక రాష్ట్రంలోని ప్రజలందరినీ గోళ్లు కొరుక్కునేలా చేస్తోంది. దానికి తోడు ఇప్పుడు నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కావడం, అది పూర్తయ్యే సమయం కూడా దగ్గరపడుతుందటం.. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగలు తగ్గకపోవడంతో ఆంధ్ర రాజకీయాలు మరింత థ్రిల్లింగ్ సెన్సేషన్‌ను ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం అనకాపల్లి వైసీపీలో నెలకొని ఉంది. అక్కడి అభ్యర్థి విషయం పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. అభ్యర్థిని మార్చాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.

అనకాపల్లిలో మారనున్న అభ్యర్థి

అనకాపల్లి ఎంపీ సీటుకు వైసీపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడును పార్టీ ప్రకటించింది. కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల కారణంగా అభ్యర్థిని మార్చాలని పార్టీ అధిష్టానం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అక్కడ ముత్యాలనాయుడు స్థానంలో టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ యోచిస్తోందని, ఇప్పటికే ఈ అంశంపై ఇద్దరు నేతలతో చర్చలు కూడా చేస్తోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈ విషయాన్ని పార్టీ చాలా గుట్టుగా చేస్తోందని, అసలు ముత్యాలనాయుడు తొలగించాలన్న ఆలోచనకు కారణం ఏంటో కూడా ఇంకా తెలియదని పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

అనకాపల్లి సీటు అతనికేనా?

ఒక వారం రోజుల క్రితం టీడీపీ నేత అడారి కిషోర్ కుమార్.. సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు. చేరిన తొలి రోజు నుంచే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉండటంతో ఇప్పుడు అనకాపల్లి అభ్యర్థిగా కిషోర్‌ నిలబెడితే ఎలా ఉంటుంది అన్న విషయంపై పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. కిషోర్‌ను నెలబెట్టడం ద్వారా అనకాపల్లి ఎంపీ సీటు వైసీసీ సొంతం అయ్యే అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.

కిషోర్‌నే ఎందుకు?

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడును కాదని ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ నుంచి వచ్చిన ఆడారి కిషోర్‌కు వైసీపీ ఎందుకు పెద్దపీట వేస్తుంది? అతడి కోసం సీనియర్ నేత ముత్యాలనాయుడిని కూడా తొలగించాలని ఎందుకు ఆలోచిస్తుంది? అయితే కిషోర్ బలమైన గవర సామాజిక వర్గం నేత కావడంతో ఆయనను అభ్యర్థిగా నిలబెడితే పార్టీకి సామాజికవర్గం పరంగానూ, రాజకీయంగానూ లాభం ఉంటుందని వైసీపీ యోచిస్తోందని విశ్లేషకులు చెప్తున్న మాట.

ముత్యాలనాయుడుతో చెడిందా!

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ముత్యాలనాయుడును తొలగించడానికి వైసీపీ సిద్ధమవుతున్న వార్తలు అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ముత్యాలనాయుడుకు, వైసీపీ అధిష్టానానికి చెడిందా? ముత్యాలనాయుకు గెలుపు విషయంలో వైసీపీ సందిగ్దంలో ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దాంతో పాటుగా టికెట్ల విషయంలో ముత్యాలనాయుడు, వైసీపీ పెద్దల మధ్య మనస్పర్థలు వచ్చాయని, దాంతో వైసీపీని ముత్యాలనాయుడు ఎదిరించడంతో ఆయనను పోటీ నుంచి తప్పించి బుద్ది చెప్పాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడేలా

నామినేషన్ల ప్రక్రియ ఈనెల 25న ముగియనుంది. ఈరోజే ముత్యాలనాయుడు తన నామినేషన్‌ను కూడా దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందన్న సందేహాలు రేకెత్తాయి. అయితే నామినేషన్‌లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉందని, ఈ సమయంలో కిషోర్‌ చేత నామినేషన్ వేయించి.. ముత్యాలనాయుడు నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేయొచ్చని నిపుణులు చెప్తున్నారు. కానీ అందుకు ముత్యాలనాయుడు ఒప్పుకుంటారా? అసలు వైసీపీ ప్లాన్ ఏంటి? అన్నవి మాత్రం ఇంకా వీడని చిక్కుముళ్ల మాదిరిగానే ఉన్నాయి. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News