మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ ఇరుక్కున్నట్లేనా?

దశలవారీ మద్య నిషేధం అన్న జగన్ మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు చేశారు.;

Update: 2025-04-20 10:33 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP Liquor Scam) వైఎస్సార్సీపీ నేతలను ఒక ఊపు ఊపేస్తోంది. జగన్ కు కుడి భుజంగా ఇటీవలి వరకు ఉన్న విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో జరిగిన అంశాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం అమ్మటమే కాకుండా ఇష్టానుసారం ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడంతో పాటు మద్యం కొనుగోలు చేసే వారి నోరు మూయించింది. మేము అమ్మేది ఇలాగే.. ఇష్టమైతే కొనుక్కో.. లేకుంటే వెళ్లిపో.. అంటూ ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడింది. మద్యం ప్రియులు గత ప్రభుత్వంలో ఐదేళ్లూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూనే కొనుగోలు చేశారు.

పైగా రాత్రి సమయాల్లో షాపుల వద్ద కనీసం లైట్లు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే మద్యం బ్రాండ్స్ కనిపించకుండా ఉండటం కోసం ఈ విధంగా చేసే వారనే ఆరోపణలు ఉన్నాయి. షాపులో ఉండే అమ్మకం దారులు కూడా కొనుగోలు దారులకు మర్యాద ఇచ్చే వారు కాదు. మద్యానికి అలవాటు పడిన వారు నిత్యం ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే కొనుగోలు చేశారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని ప్రకటించిన జగన్ మద్యం అమ్మకాల్లో తమ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తుంటే చూస్తూ ఉన్నారంటే ఆయన కూడా ఇందులో భాగస్వామేననే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో పూర్తి స్థాయి బాధ్యులు ఎవరనేది వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కసిరెడ్డితో కలిసి మిథున్ వ్యాపారం చేశారా?

మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, SPY డిస్టిలరీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి అడా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ప్రమేయం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి SITకి తెలిపారు. ఈ కంపెనీ మద్యం కుంభకోణంలో అక్రమ లాభాలు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం విధానంలో మార్పులు, నాసిరకం బ్రాండ్ల ప్రమోషన్, లంచాల సేకరణలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంలో మిథున్ రెడ్డి పేరు ప్రస్తావించారు. మిథున్ రెడ్డి కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బును కంపెనీలు, సినిమా నిర్మాణం, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు CID విచారణలో వెల్లడైంది.

పార్లమెంట్ లో లావు ఆరోపణలు

టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కుంభకోణాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి, మిథున్ రెడ్డిపై ఆరోపణలను లేవనెత్తడంతో ఈ కేసు జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. మిథున్ రెడ్డి అరెస్టు భయంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ బెయిల్ ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక అరెస్టు రక్షణ పొందారు. ఇది అతనిపై దృష్టిని మరింత పెంచింది. SIT మిథున్ రెడ్డిని ఏప్రిల్ 19, 2025న విచారణకు పిలిచింది. ఈ విచారణ అతని న్యాయవాదుల సమక్షంలో, CCTV కెమెరాలు ఉన్న ప్రదేశంలో జరగాలని హైకోర్టు ఆదేశించింది, ఇది అతనిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలను సూచిస్తుంది

కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఎంత?

రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన అతను మద్యం విధానంలో అవకతవకలు, ముడుపులు, నకిలీ బ్రాండ్ల ద్వారా అక్రమ లాభాలు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ప్రత్యేక కార్యాలయం నుంచి కిక్‌బ్యాక్ నెట్‌వర్క్‌ను నిర్వహించినట్లు SIT గుర్తించింది. అతను నెలకు కనీసం రూ. 60 కోట్ల కమీషన్లు వసూలు చేసి, సుమారు రూ. 3,000 కోట్లను ఉన్నత స్థాయి వ్యక్తులకు చేరవేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం బ్రాండ్‌లను ఎంత మొత్తంలో కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్‌లను విక్రయించాలో రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని సిట్ సేకరించిన సమాచారంలో ఉంది.

రాజ్ కసిరెడ్డి అడా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈడీ క్రియేషన్స్ వంటి కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు. ఈ కంపెనీల ద్వారా నాసిరకం ‘J’ బ్రాండ్లను ప్రభుత్వ మద్యం షాపులకు సరఫరా చేసి, అక్రమ లాభాలు ఆర్జించినట్లు SIT విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును సినిమా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఆసుపత్రులు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో పెట్టుబడులుగా మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.

రాజ్ కసిరెడ్డిని SIT నాలుగు సార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదు. హైకోర్టు అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత అతను దేశం విడిచి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. పోలీసుల వద్ద సమాచారం ఉంది. హైదరాబాద్‌లోని అతని నివాసాలు, కార్యాలయాలు, బినామీ సంస్థలపై SIT దాడులు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇది అతనిపై దృష్టిని మరింత పెంచింది.

విజయ సాయి రెడ్డి ఆరోపణలు

రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డిని “క్రిమినల్ బ్రెయిన్”గా అభివర్ణించి, కుంభకోణంలో అతని ప్రధాన పాత్రను బహిర్గతం చేశారు. అతని నెట్‌వర్క్‌లో అవినాష్ రెడ్డి, చాణిక్య (ప్రకాష్ కిరణ్), సునీత్, సైఫ్ వంటి వ్యక్తులు ఉన్నారని SITకి తెలిపారు. విజయసాయిరెడ్డి తన నివాసంలో జరిగిన మద్యం విధాన సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి పాల్గొన్నట్లు ఒప్పుకున్నారు. ఇది అతనిపై అనుమానాలను మరింత పెంచింది.

ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 18,860 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. దీని తీవ్రత కారణంగా కీలక వ్యక్తులైన మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిపై SIT దృష్టి సారించింది.

కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అవినీతిని బహిర్గతం చేసేందుకు SITని ఏర్పాటు చేసింది. మిథున్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా, రాజ్ కసిరెడ్డి జగన్ బంధువుగా ఉండటం వల్ల వారు ప్రధాన లక్ష్యాలుగా మారారు. SIT దాడుల్లో రాజ్ కసిరెడ్డి కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న ఆర్థిక రికార్డులు, పత్రాలు, విజయసాయిరెడ్డి ఇచ్చిన సాక్ష్యం వారిపై వచ్చిన ఆరోపణలను బలపరిచాయి.

వైఎస్సార్సీపీ హయాంలో నాసిరకం ‘J’ బ్రాండ్లు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయని, నగదు చెల్లింపుల ద్వారా అక్రమ లాభాలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం 2024 ఎన్నికల్లో కీలక రాజకీయ అస్త్రంగా మారింది. దీని వల్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారిని టార్గెట్ చేయడం తప్పనిసరి అయింది.

అరబిందో పాత్ర ఏమిటి?

ఈ కుంభకోణంలో పాత్రదారులకు రూ. 100 కోట్ల రుణం అరబిందో కంపెనీ వారి నుంచి తాను ఇప్పించినట్లు ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, SPY డిస్టిలరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అభ్యర్థన మేరకు విజయసాయిరెడ్డి ఈ రుణాన్ని అరబిందో ద్వారా ఇప్పించినట్లు సిట్ కు తెలిపారు. రాజ్ కసిరెడ్డి నేరస్వభావం తనకు తెలియదని, పార్టీ సీనియర్లు పరిచయం చేసినప్పుడు అతన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. మద్యం విక్రయాల్లో తాను జోక్యం చేసుకోలేదని, కసిరెడ్డి తనకు షాక్ తగిలే విధంగా మోసం చేశాడని తెలిపారు.

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి, ఎంపీ పి మిథున్ రెడ్డి, డొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చాణిక్య (ప్రకాష్ కిరణ్), సునీత, సైఫ్ లు కసిరెడ్డి నెట్‌వర్క్‌లో సహచరులుగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి SIT విచారణకు హాజరయ్యారు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పటికీ, వారు తమ ప్రమేయాన్ని ఖండిస్తున్నారు.

Tags:    

Similar News