Revanth credibility|రేవంత్ క్రెడిబులిటీ దెబ్బతింటోందా ?

రాజకీయనేతలకు మాట చాలా ముఖ్యం. ఇచ్చిన హామీలను అమలుచేయటం, మాటమీద నిలబడటం వల్ల సదరు నేతల క్రెడిబులిటి పెరుగుతుంది;

Update: 2025-01-11 11:12 GMT

రాజకీయనేతలకు మాట చాలా ముఖ్యం. ఇచ్చిన హామీలను అమలుచేయటం, మాటమీద నిలబడటం వల్ల సదరు నేతల క్రెడిబులిటి పెరుగుతుంది. ఎందుకంటే ఇచ్చినమాటను నేతలు నిలబెట్టుకుంటున్నారా లేదా అని జనాలు గమనిస్తుంటారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి(Revanth) క్రెడిబులిటీ దెబ్బతినేస్తోంది. బహిరంగంగా ఇచ్చినహామీలను, చేసినప్రకటనలను రేవంత్ తుంగలో తొక్కేస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా(Game changer Movie) విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీయటంతో రేవంత్ ప్రభుత్వం క్రెడిబులిటీపై చర్చ పెరిగిపోతోంది. పుష్పసినిమా(Pushpa movie) రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుగున్నపుడు రేవంత్ మాట్లాడుతు తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుండవని, టికెట్ల ధరలు పెంపుకు అనుమతించేదిలేదని గట్టిగా ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో సినీప్రముఖులు షాక్ తిన్నా మిగిలిన జనాలు హ్యాపీగా ఫీలయ్యారు.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించటమే కాకుండా టికెట్ల రేట్లపెంపుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. దీనిపై దాఖలైన కేసును శుక్రవారం హైకోర్టు(Telangana Highcourt) విచారించింది. ప్రభుత్వనిర్ణయాన్ని సవాలుచేస్తు కూరగాయల వ్యాపారి గొర్ల భరత్ రాజ్, సతీష్ కమాల్ కేసువేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విజయసేన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం పరువును తీసేసేవే అనటంలో సందేహంలేదు. ఇక్కడ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ అనే అర్ధం. ‘గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రత్యేకషోలు ఎందుకు అనుమతించారు ? టికెట్ల ధరలను ఎందుకు పెంచార’ని జస్టిస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘బెనిఫిట్ షోలుండవని, టికెట్ల ధరలు పెంపుండదని ప్రభుత్వం ప్రకటించిందికదా’ అని జస్టిస్ గుర్తుచేశారు. ‘అర్ధరాత్రుళ్ళు సినిమాల ప్రదర్శనకు అనుమతిస్తే జనాలు ఇళ్ళకు వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుంద’ని జస్టిస్ అడిగారు. అభివృద్ధి అంటే అర్ధరాత్రుళ్ళు కూడా జనాలు బయటతిరగటమేనా ? అని నిలదీశారు. ‘పేరుమార్చినా నిర్ణీత షోలకన్నా ఎక్కువషోలు ప్రదర్శించటాన్ని బెనిఫిట్ షోలు అనే అంటార’ని జస్టిస్ స్పష్టంగా ప్రకటించారు. ప్రత్యేకషోలు వద్దని జస్టిస్ తేల్చిచెప్పేశారు. ప్రత్యేకషోలు, టికెట్ల ధరల పెంపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిని జస్టిస్ ఆదేశించారు. పునఃసమీక్షించాలని జస్టిస్ అన్నారంటే నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని చెప్పటమే. హైకోర్టు ఆదేశాలతో గేమ్ ఛేంజర్ సినిమా ప్రత్యేకషోలు, టికెట్ల ధరల పెంపు అంశంపై అయోమయం పెరిగిపోతోంది.

సరే, సినిమాను పక్కనపెట్టేస్తే హైకోర్టు వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి క్రెడిబులిటి డ్యామేజి అయినట్లు అర్ధమైపోతోంది. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో ఎందుకు రేవంత్ యూటర్న్ తీసుకోవాల్సొచ్చింది ? అన్నది కీలకం. సినిమాకు ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రతిపక్షాలు రేవంత్ ను వాయించేస్తున్నాయి. యూటర్న్ సీఎం అంటు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ విషయంలో అనికాదు కాని మూసీ ప్రాజెక్టు అంచనా వ్యాయం, రైతు రుణమాఫీ లాంటి కీలకమైన అంశాలపైన కూడా ముందొక ప్రకటన చేసి తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. మూసీ బ్యూటిఫికేషన్(Musi River Project) అన్నది రేవంతే. తర్వాత అన్నీవైపులా గోలమొదలైతే బ్యూటిఫికేషన్ను పునరుజ్జీవనంగా మార్చాడు. అలాగే లక్షన్నర కోట్లరూపాయలతో ప్రాజెక్టు టేకప్ చేయబోతున్ననట్లు ప్రకటించింది రేవంతే. తర్వాత ప్రతిపక్షాలు అంచనావ్యయంపై గోలచేస్తే లక్షకోట్లరూపాయలని చెప్పింది ఎవరంటు ఎదురు ప్రశ్నించారు. పునరుజ్జీవనం కోసం నివాసితుల ఇళ్ళను కూల్చాలని నిర్ణయించింది రేవంతే. హైకోర్టు మొట్టికాయలతో నివాసితులతోచర్చలపేరుతో కమిటీని నియమించాడు.

రు. 31 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించింది రేవంతే. తర్వాత 16 వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి రైతురుణమాఫీ అయిపోయిందని ప్రకటించింది కూడా రేవంతే. ఈ విషయంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు గోలగోల చేస్తే 2 లక్షల రూపాయలకు పైన ఉన్నరుణాలు ఇంకా మాఫీచేయలేదని రేవంత్ క్లారిటి ఇవ్వాల్సొచ్చింది. రైతురుణాలన్నీమాఫీ అయిపోయిందని ముందు ఎందుకు ప్రకటించారు ? తర్వాత ప్రతిపక్షాలు గోలచేస్తే చేయాల్సిన రుణమాఫీ ఇంకాఉందని ఎందుకు క్లారిటి ఇవ్వాల్సొచ్చింది ? ఇలాంటి నిర్ణయాలు, ప్రకటనలతోనే రేవంత్ జనాల్లో పలుచన అయిపోతున్నారు. తాను ఇచ్చిన మాటను తానే నిలుపుకోకపోతే, అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడుండకపోతే ఇక రేవంత్ ను జనాలు ఎందుకు నమ్ముతారు ?

Tags:    

Similar News