రేవంత్ ప్రభుత్వంకన్నా మీనాక్షి నటరాజనే బెటరా ?
భౌగోళికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ) పరిధిలో ఉన్న 400 ఎకరాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత నిర్లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరించింది;
ఒక సెన్సిటివ్ ఇష్యూ డీల్ చేసేముందు ప్రభుత్వం ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి ? అందులోను వేలాదిమంది విద్యార్ధులతో ముడిపడిన విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఏమిచేసింది ? చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. భౌగోళికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ) పరిధిలో ఉన్న 400 ఎకరాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత నిర్లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరించింది. అందుకనే సొసైటీ ముందు ప్రభుత్వం దోషిగా నిలబడాల్సొచ్చింది. అంతా అయిపోయిన తర్వాత చివరలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) జోక్యంచేసుకుని ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నుండి బయటపడేసే చర్యలు మొదలుపెట్టారు.
ముందుగా మీనాక్షి చేసినపని ఏమిటంటే విద్యార్ధులు, అధ్యాపకులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో మాట్లాడటం. ఆ తర్వాత యూనివర్సిటి అధికారులతోను, మంత్రుల కమిటితోనూ సమావేశమయ్యారు. మొదటి సమావేశంలో సమస్య ఏమిటన్నది మీనాక్షికి అర్ధమైపోయింది. తర్వాత యూనివర్సిటి అధికారులతో, మంత్రుల కమిటితో మాట్లాడినపుడు సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. నిజానికి మీనాక్షి చేసిన సూచనల కారణంగానే రెండురోజులుగా యూనివర్సిటి(HCU) కాస్త ప్రశాంతంగా ఉందని చెప్పాలి.
ఇంతకీ మీనాక్షి చేసిన సూచనలు ఏమిటంటే ముందు విద్యార్ధులపైన పెట్టిన పోలీసు కేసులను విత్ డ్రా చేసేయమని. తర్వాత యూనివర్సిటి కాంపౌండ్ నుండి పోలీసులను కూడా విత్ డ్రా చేయమని. మీనాక్షి చేసిన రెండు సూచనల్లో విద్యార్ధులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని మంత్రుల కమిటి పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో ప్రభుత్వంపైన మండిపోతున్న విద్యార్ధులను శాంతింపచేసింది. అలాగే యూనివర్సిటి నుండి కూడా పోలీసులను విత్ డ్రా చేసేయటానికి వైస్ ఛాన్సలర్(వీసీ) కు ప్రభుత్వం లేఖ రాసింది. ఎందుకంటే యూనివర్సిటిలో గొడవలను కంట్రోల్ చేయటానికి పోలీసులు అవసరమని వీసీనే కోరారు కాబట్టి. పోలీసుల ఉపసంహరణ మీద అభిప్రాయం కోసం ప్రభుత్వం వీసీకే లేఖరాసింది.
మీనాక్షి చేసిన మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే 400 ఎకరాల వివాదం కోర్టు పరిధిలో ఉందికాబట్టి విద్యార్ధుల సమస్యల మీద మాత్రమే చర్చించాలని. మీనాక్షి చేసిన సూచనతో విద్యార్ధులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కసారిగా పాజిటివ్ గా మారిపోయారు. ఫైనల్ రిజల్టు ఏమిటన్న విషయాన్ని వదిలేస్తే ఒక్కసారిగా యూనివర్సిటిలో ప్రశాంతత అయితే సాధ్యమైంది కదా. 400 ఎకరాలు ప్రభుత్వ భూమే అయినా యూనివర్సిటి కాంపౌండ్ లో ఉన్న భూములను తీసుకోవాలని అనుకున్నపుడు ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ముందుగా యూనివర్సిటి విద్యార్ధులతో మాట్లాడాల్సింది. విద్యార్ధులను కన్వీన్స్ చేస్తే ఉద్యోగులు ఆందోళనలు చేసే అవకాశంలేదు. విద్యార్ధులు గనుక రోడ్లపైకి వస్తే వాళ్ళని ఆపటం ఎవరివల్లా కాదన్న విషయాన్ని ప్రభుత్వం మరచిపోయిందా ?
గోటితో పోయేదాన్ని చివరకు రేవంత్ ప్రభుత్వం గొడ్డలిదాకా తెచ్చుకున్నది. 400 ఎకరాలను తీసుకోవాలని అనుకున్నపుడు ప్రభుత్వం కాస్త తెలివితో వ్యవహరించుంటే ఇష్యూ ఇంత పెద్దది అయ్యేదే కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్ధులంటే లెక్కలేని తనంవల్లే సమస్య చివరకు సుప్రింకోర్టు(Supreme Court) దాకా వెళ్ళింది. ఏదేమైనా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా మీనాక్షి నటరాజన్ ప్రభుత్వాన్ని సరైన దారిలోనే నడుపుతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఇష్యూ చివరకు ఏమవుతుందో చూడాలి.