వివేకా హత్యే ప్రచారాస్త్రం..

కడప ఎంపీ స్థానానికి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ రెడ్డి 20న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Update: 2024-04-18 07:07 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించింది. ఈ ఘటనే కడప జిల్లాలో ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. సార్వత్రిక ఎన్నికల కోసం ప్రచార కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి ఈనెల 20వ తేదీ కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఇంకొన్ని గంటల్లో నోటిఫికేషన్ వెలువడనున్నది.

ఆరోజు ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థన అనంతరం, నామినేషన్ దాఖలకు కడపకు వచ్చే అవకాశం ఉంది.

ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎన్. తులసిరెడ్డి.. పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. " 20వ తేదీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు" అని బుధవారం ప్రకటించారు. " కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కడప. రాహుల్ గాంధీని పీఎం చేయాలనేది దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ ఆశయం. ఈ ఆశయ సాధన కోసమే వైఎస్ షర్మిల రెడ్డి పనిచేస్తున్నారు" అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ దిశగానే పనిచేసే కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని ఆయన సూచించారు.

తగ్గని షర్మిల దూకుడు

రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ దూకుడు మరింత పెంచి, సొంత అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ టార్గెట్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడానికి ముందు నుంచి.. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకున్న వైఎస్ షర్మిళ రెడ్డితో పాటు, వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత కూడా ఏకపక్షంగా సీఎం జగన్, అవినాష్ రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పిస్తున్నారంటూ దండయాత్ర ప్రారంభించారు.

ఇప్పటికీ అదే వరవడితో కడప జిల్లాలో అక్కాచెల్లెళ్లు వైయస్ షర్మిల రెడ్డి, వైయస్ సునీత రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రచారం నిర్వహించారు. కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గాలను ఇప్పటికే చుట్టేశారు. ఆ నాటి దివంగత సీఎం వైఎస్ఆర్ అభిమానులు, మద్దతుదారులను కూడగట్టే ప్రక్రియలు కొంతమేరకు సఫలమైనట్లు కడప జిల్లా నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది.

"రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రావడాన్ని కడప ఎంపీ స్థానాన్ని గెలవడం ద్వారా సుసాధ్యం చేస్తానని" అని వైయస్ షర్మిల రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్వయానా బాబాయి కుమారుడైన కడప సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆమె పోటీ చేయనున్నారు. "బాబాయ్ వైయస్ వివేక హత్య కేసులో నిందితుడైన వైయస్ అవినాష్ రెడ్డికి తన సొంత అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారు" అంటూ ఏకధాటిగా నిందారోపణలు చేస్తున్నారు షర్మిల.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మిగతా కొన్ని నియోజకవర్గాలతో పాటు కడప పార్లమెంటు స్థానం అత్యంత సున్నితంగా, హాట్ సీట్‌గా మారింది. రానున్న రోజుల్లో కడప ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? వైయస్ షర్మిలకు తన తండ్రి అభిమానులు, ప్రజల నుంచి ఎంత మేరకు ఆదరణ లభిస్తుంది? అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News