బాలినేనికి జనసేన బలమైన స్థానమేనా?

ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన బాలినేనికి జనసేనలో స్థానబలం దక్కుతుందా?

Update: 2024-09-27 03:44 GMT

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అమావాస్య రోజులు పోయిన తరువాత వచ్చేనెల 4న జనసేనలో చేరాలనుకున్నారు. అయితే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈనెల 26న చేరాలని, పార్టీలో చేరే వారు ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు చేరొచ్చని ప్రకటించారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ ముందుగానే వారికి సమాచారం అందించి తేదీని ఖరారు చేశారు. హంగు, ఆర్బాటాలు వద్దని, పార్టీ కార్యాలయంలోకి వచ్చి చేరాలని వారిని పవన్‌ కళ్యాణ్‌ కోరారు. జనాన్ని తీసుకు రావద్దని వారికి చెప్పారు. వారు పార్టీలో చేరుతున్న కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు మీడియా వారిని కూడా అనుమతించలేదు. ఎందుకు ఇలా జరిగింది. దీని వెనుక ఏముంది?

తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత
ఎన్‌డిఏ భాగస్వామి కూటమి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికపై పూర్తి వ్యతిరేకత ఉంది. నానుంచి బాలినేని తప్పించుకోలేరని, జైలు ఊసలు లెక్కించాల్సిందేనని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ అల్టిమేట్‌ ఇవ్వడం విశేషం. తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత ఉన్నందున సభ పెట్టి జన బలం చూపించి చేర్చుకుంటే ఒంగోలులో జనసేన, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందని భావించిన పవన్‌ కళ్యాణ్‌ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Delete Edit
జనార్థన్‌ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటాన్ని ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరటం లేదు. జనసేనతో చేరితో దామచర్లకు ఎందుకు అంత ఆగ్రహం వస్తోంది అనేది పలువురిని వేదిస్తున్న ప్రశ్న. పవన్‌ కళ్యాణ్‌ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని కాపాడలేడని బహిరంగంగానే దామచర్ల అనటం చర్చకు దారి తీసింది. బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు జనార్థన్‌కు వ్యక్తిగత వార్నింగ్‌లు ఇచ్చారని, పలు సంఘటనల్లో కేసులు నమోదు చేయించారనే ప్రచారం సాగుతోంది.
జనార్థన్‌ను బాలినేని ఎలా ఎదుర్కొంటారు?
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ను బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా ఎదుర్కొంటారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఎన్‌డీఏ కూటమిలో జనసేన ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే జనసేన కూడా సగం అధికారం అనుభవిస్తున్నట్లే. చంద్రబాబు నాయుడు కూడా పవన్‌ కళ్యాణ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దశలో తనకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు. తనతో పాటు కలిసొచ్చే వారికి రాజకీయ ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చనేది బాలినేని ఆలోచన.
Delete Edit
బాలినేని బొమ్మను చించేసిన తెలుగుదేశం కార్యకర్తలు
బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒంగోలు పట్టణంలో పలు చోట్ల జనసేన కార్యకర్తలు, బాలినేని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ఫ్లెక్సీలు వెలిసాయి. బుధవారం రాత్రి ఫ్లెక్సీలపై బాలినేని బొమ్మ వరకు కత్తిరించి తొలగించారు. పవన్‌ కళ్యాణ్‌ బొమ్మను మాత్రం అలాగే వదిలేశారు. దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య కనిపించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం ఒంగోలు ఎస్‌పి దామోదర్‌ను కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రధానంగా దామచర్ల జనార్థన్‌ అనుచరులు ఈ పని చేశారని, వారిని కట్టడి చేయాలని ఫిర్యాదు చేశారు. ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకుంటానని ఎస్‌పీ ఇచ్చిన హామీ మేరకు బాలినేని అక్కడి నుంచి నిష్క్రమించారు.
పార్టీలోకి తన క్యాడర్‌ను చేర్చుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం
బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరుతున్న సందర్బంగా తన బలం ఏమిటో చూపించేందుకు పవన్‌ కళ్యాణ్‌ అంగీకరించకపోవడంతో కొద్ది రోజులు గ్యాప్‌ ఇచ్చి వైఎస్సార్‌సీపీలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న చాలా మందిని ఒక వేదికపైకి తీసుకొచ్చి జనేన పార్టీలో చేర్చుకునేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌కు బాలినేని చెప్పనున్నారు.
Delete Edit
తిరుగులేని నాయకుడుగా ఉండగలడా?
వైఎస్సార్‌సీపీలో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడుగా ఎలా ఉన్నాడో అలాగే జనసేన పార్టీలో కూడా ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఉండగలడా అనే సందేహం పలువురిలో ఉంది. తనకు తాను మాత్రం జనసేనలో తిరుగులేని నాయకుడిగా ఉండగలడనే నమ్మకంతో ఉన్నారు. చాలా కాలంగా పవన్‌ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డికి పరిచయం, స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందువల్ల బాలినేని అడిగిన పనులు కాదనడనే నమ్మకంతో బాలినేని ఉన్నాడు. దామచర్ల జనార్థన్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు జనసేన పార్టీనే మంచి ఆయుధమని బాలినేని భావించారు. అందుకే బాలినేని జనసేనను ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి బాలినేని మాదిరి జనాదరణ ఉన్న నాయకుడు లేడు. ఈయనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు పార్టీ బలాన్ని, తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు ఉపయోగ పడుతుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News