తిరుమలలో ఆ పాలన అధర్మమా? ధర్మారెడ్డి వివాదం ఏమిటి?

తిరుమలను చరిత్రలో ఎన్నడూ లేనంతగా వివాదంలోకి లాగారు. ఇందులో మాజీ ఈఓ ధర్మారెడ్డి వ్యవహార సరళి ఏంటి? ఆయనపై విజిలెన్స్ విచారణ ఎందుకు వేశారు?

Update: 2024-07-11 14:34 GMT

తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చడంతో భక్తులు వేదనకు గురవుతున్నారు. శ్రీవారి టికెట్ల జారీ, సివిల్ పనులకు కేటాయింపులు. శ్రీవాణి ట్రస్ట్ జరిగిన అక్రమాలపై టీటీడీ మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన వ్యవహారం వెనుక ఏమి జరిగింది.

అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీ అధినేతల చలువతో ధర్మారెడ్డి పరిపాలన సాగించిన తీరు విమర్శలకు గురైంది. సిబ్బంది అధికారులతో ఆయన వివరించిన తీరు కూడా ధర్మారెడ్డి పై వివాదాస్పద అధికారిగా ముద్ర వేసింది. తిరుమలలో ఆయన ఇష్టారాజ్యంగా పాలన, నిర్ణయాలతో ఎవరినీ ఖాతరు చేయలేదని మాటలు కూడా పడాల్సిన పరిస్థితి కల్పించుకున్నారు. ఆయన అర్హతపై కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చిన తర్వాత మరింతగా చెలరేగారని, అప్పటి అధికార పార్టీ వారితో స్వామిభక్తి చాటుకున్న ధర్మారెడ్డి సామాన్య యాత్రికులకు మేలు చేసిన కార్యక్రమాలు తెరమరుగయ్యాయి.

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పారుమంచాల గ్రామానికి చెందిన ఏవీ ధర్మారెడ్డి ఎలక్ట్రానిక్స్ లో ఎమ్మెస్సీ చదివారు. 1991 సెప్టెంబర్ 16వ తేదీ కేంద్ర హోం శాఖ కంటోన్మెంట్ సీఈవోగా ఢిల్లీలో నియమితులయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నంనికి చెందిన రాజ్యసభ సభ్యునితో ఏర్పడిన పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పరిచయం ఏర్పరిచింది. డాక్టర్ వైయస్ఆర్ కు కడప, రాయలసీమ ప్రాంతానికి చెందిన వారంటే కాస్త అభిమానం ఎక్కువ అనేది ఆయనను దగ్గరగా గమనించే వారు చెప్పే మాట. రక్షణ శాఖలో కీలకమైన అధికారి కావడం, కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా మెలిగిన ధర్మారెడ్డికి అనుకూలంగా పరిస్థితులు మారాయనే విషయం గతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
2004లో డాక్టర్ వైఎస్.ఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికే సాన్నిహిత్యం పెరగడంతో ఆ రాజ్యసభ సభ్యుని ద్వారా ఏవీ ధర్మారెడ్డి 2004లోనే టీటీడీ ప్రత్యేక అధికారిగా నియమితులై 2006 ఆగస్టు వరకు తిరుమల కేంద్రంగా బాధ్యతలు నిర్వహించారు.
తిరుమల, టీటీడీ ఆలయ వ్యవహారాలు పరిపాలనపై అవగాహన పెంచుకున్నారు. ఆయన డిప్యూటేషన్ గడువు ముగియడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 సెప్టెంబర్ నుంచి 2008 మార్చి వరకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా పనిచేశారు. అక్కడ కూడా డిప్యూటేషన్ ముగించుకున్న ధర్మారెడ్డి తిరిగి 2008 ఏప్రిల్ నుంచి 2010 ఆగస్టు వరకు మరోసారి టీటీడీలో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఈ సమయంలో ఆయన టీటీడీపై పట్టు సాధించారు. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వీస్ లోనే ఉంటూ 2010 సెప్టెంబర్ నుంచి 2011 ఏప్రిల్ వరకు ఏపీ సమాచార కమిషన్ లో సెక్రటరీగా పని చేశారు. అప్పటికే డాక్టర్ వైఎస్ఆర్ మరణించడం రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సేవలు ఢిల్లీకి మరాయి.
"ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కానీ. ఈసారి ఈవో గానే వస్తా"
అని ఢిల్లీలో తనను కలవడానికి వెళ్లిన తిరుపతికి చెందిన కొందరు ఉద్యోగ సంఘాల నేతలతో సవాల్ చేశారు.
ఫెడరల్ ప్రతినిధికి ఆ నాయకుడు ఈ విషయం ఒకసారి గుర్తు చేశారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే, టీటీడీ ఈవోగా ఉన్న జవహరరెడ్డిని బదిలీ చేసి, మే 8వ తేదీ ఏవీ ధర్మారెడ్డినీ కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్పై టీటీడీ ఈవో ( ఎఫ్ఎసి) గా అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.

2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి తుడా చైర్మన్ గా పనిచేశారు. ఆయన కోసం ప్రత్యేక జీవో జారీ చేయడం ద్వారా టీటీడీ పాలకమండలిలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా చేశారు. సాధారణంగా తిరుపతి ఎమ్మెల్యే అంటే టీటీడీలో ప్రోటోకాల్ ఉంటుంది. 2019లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి ఎమ్మెల్యేని కూడా పాలకమండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిని చేశారు. వారితో 2004లో ప్రత్యేక అధికారిగా వచ్చిన ధర్మారెడ్డికి ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగానే మళ్లీ టీటీడీ అదనపు ఈవోగా రావడానికి మార్గం ఏర్పడినట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ మమకారంతోనే గత ఐదేళ్లగా కేంద్రంలో వైఎస్సార్సీపీకి పనులు చక్కదిద్దడంలోధర్మారెడ్డి తనవంతు సహకారం అందించారని చెబుతున్నారు.

తిరుమలలో తనదే రాజ్యం..
తిరుమల క్షేత్రం తనదే అన్నట్లు పాలన సాగించారని ధర్మారెడ్డి విమర్శలకు గురయ్యారు. ఆయన ఎదుటపడి మాట్లాడేందుకే భయమేసేదని, కొందరు అధికారులు చెప్పారు. పాత క్యూలను కాదని, రద్దీ రోజుల్లో ఏటీసీ సర్కిల్, వైకుంఠ1 మీదుగా శిలాతోరణం వరకు రోజుల తరబడి సామాన్య భక్తులను నిరీక్షింప చేశారని ఉపయోగాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు.
టీటీడీ పూర్తి అదనపు ఈవో గా బాధ్యతలు నిర్వహించిన ఏవీ ధర్మారెడ్డి అప్పటి అధికార వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతిపాదించిన అంశాలకు నో అనకుండా అనుమతులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అది కూడా శాస్త్రబద్ధంగానే అన్నట్లు " పాలకమండలి అనుమతి"తో నిధులు పారించారనేది ప్రధాన అభియోగం.
2024- 25 టీటీడీ వార్షిక బడ్జెట్ రు. 5141.74 కోట్లతో ఆమోదించారు. అంతకముందు బడ్జెట్ తో పోలిస్తే దాదాపు రు. వెయ్యి కోట్లు అదనం.
ఇందులో ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన నిధులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. సాధారణంగా రు. 250 నుంచి 300 కోట్ల వరకు బడ్జెట్లో కేటాయిస్తుంటారు. ఈ వార్షిక బడ్జెట్లో రెట్టింపు స్థాయిలో రు. 1,722 కోట్లకు పెంచారు. ఇందుకు ప్రధాన కారణం...

2024 సార్వత్రిక ఎన్నికల వేళ చోటుచేసుకున్న వ్యవహారం వెనుక  తిరకాసు ఉందనేది అప్పట్లో ప్రతిపక్షాలు బాహాటంగా విమర్శించాయి. తిరుపతి నుంచి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేతో  పాటు టీటీడీ చైర్మన్ గా కూడా భూమన కరుణాకర్ రెడ్డి  ఉన్నారు. ఆయన కుమారుడు, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సోపానం వేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తిరుపతి నగరంలో అవసరం లేని చోట్ల కూడా రోడ్ల విస్తరణ, నిర్మాణం, సుందరీకరణ పనులకు నిధులు కేటాయించడానికి పాలకమండలిలో తీర్మానం చేశారనేది ప్రధాన అభియోగం.
"తిరుపతిలో జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధుల్లో అక్రమాలు జరిగాయి" అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించడమే కాకుండా, గతంలోనే కోర్టు వరకు కూడా తీసుకువెళ్లారు. ఇదిలా ఉంచితే...
వీటో అధికారం ఏమైంది
టీటీడీలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సివిల్ ఇంజనీరింగ్ పనులకు రు. 1,722 కోట్లు కేటాయిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇది అపసవ్యం అనుకుంటే ఈవో ఆ తీర్మానాలను వీటో చేయడానికి ఆస్కారం ఉన్నట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అది చేయకపోగా.. ఏ పని చేయడానికి అయినా అందుబాటులో ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకున్నట్లు చెబుతున్నారు. అదెలాగంటే..

"టీటీడీలో నామినేషన్ పద్ధతిన పనులు కేటాయించరు. ప్రతి అంశం టెండర్ ద్వారానే సాగుతుంది. ప్రతిపాదిత రు. కోట్ల పనులు ఓ నాయకుడి అనుచరుడికి ఇవ్వాలని అనుకున్నారు. మిగతా వారెవరు నామినేషన్ వేయకుండా చూసుకుని, ఒకరే పత్రాలు సమర్పిస్తారు. ఒక పనికి ఒకే నామినేషన్ వస్తే తిరస్కరించే అధికారం ఉంటుంది. మళ్లీ అదే పనికి రెండోసారి కూడా టెండర్ పిలుస్తారు. అప్పుడు కూడా ఒకే టెండర్ దాఖలు అవుతుంది. దానిని ఖరారు చేస్తారు"
అంటే.." రెండోసారి లేదా మూడోసారి టెండర్ పిలిచిన ఒకే దరఖాస్తు అందితే, ఆమోదించే అధికారం ఆ అధికారికి ఉంటుంది" దీనిని అస్త్రంగా మార్చుకొని రు. వేల కోట్ల సివిల్ పనులు వైఎస్ఆర్ సీపీ అస్మదీయులకు కట్టబెట్టారని టీటీడీలోని ఓ సీనియర్ సివిల్ ఇంజనీర్ ఫెడరల్ ప్రతినిధికి వివరించారు. తిరుమల కాంప్లెక్స్ -5 యాత్రి సదన్ నిర్మాణంలో కూడా రు. కోట్లు కమిషన్ రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సేవా టికెట్ల మంజూరులో...
శ్రీవారు అందరివాడు కాదు. కొందరి వాడే అన్నట్లు ఐదేళ్లపాటు వ్యవహారం సాగింనేది బహిరంగ రహస్యం. శ్రీవారి సేవా టికెట్లు, విఐపి టికెట్ల జారీలో మాజీ మాజీ ఈఓ ఏవీ. ధర్మారెడ్డి అధికారపక్ష నాయకులు ప్రధానంగా మంత్రులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అనేక సాక్షాలు వెల్లడయ్యాయి. అందులో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా జారీ చేసిన లేఖలపై రోజుకు పదుల సంఖ్యలో టికెట్లు జారీ అయ్యాయి. వైయస్ఆర్ సీపీ నాయకులు, వ్యాపారవేత్తలకు ఇష్టానుసారంగా శ్రీవారి టికెట్లు కేటాయించారనే విషయాలు వెలుగు చూశాయి. ఆసుపత్రుల నిర్మాణానికి రు. కోటి పైన విరాళాలు ఇచ్చే వారికి ఉదయస్తమాన సేవా టికెట్ల జారీలో కూడా వివక్ష చూపించారని ఆరోపణలు ఉన్నాయి.

శ్రీవాణి ట్రస్ట్ శిరోభారం

టీటీడీకి ఈవోగా వచ్చే వారు తనదైన మాకు గుర్తింపు కోసం తహతహలాడుతారు. ఆ కోవలోనే మాజీ ఈవో ఏవి. ధర్మారెడ్డి 2019 సెప్టెంబర్ లో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీ వాణి) ద్వారా విరాళా సేకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో దాత రు.10,500 చెల్లిస్తే, అందులో రు. 500 శ్రీవారి దర్శనానికి వీఐపీ టికెట్ జారీ చేస్తారు. మిగతా రు.10 వేలు అనేక జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలో డిపాజిట్ చేశారు. ఆ నిధులతో పురాతన ఆలయాలను జీర్ణోదరణ చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో కొత్త ఆలయాల నిర్మాణానికి వెతించే విధంగా విధివిధానాలను మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి రూపకల్పన చేశారు.

ఈ శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు ముసురుకోవడంతో అప్పటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి తో కలిసి శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ట్రస్టు ప్రారంభించిన నాటి నుంచి 8.25 లక్షల మంది దాతకు ఆన్లైన్ ఆఫ్లైన్ లో రు. 860 కోట్లు అందినట్లు వెల్లడించారు. ఇందులో దేవదాయ శాఖ తో పాటు 176 ప్రైవేట్ ఆలయాలకు మంజూరు చేసాం. వెనుకబడిన ప్రాంతాల్లో 2,273 ఆలయాల కోసం ఒక్కో దానికి రు.10 లక్షలు కేటాయించాం. అని వారు అప్పట్లో వివరించారు. బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసిన 151 ఒక కోట్లకు రు.36.5 కోట్లు వడ్డీ వస్తుందని కూడా వారు స్పష్టం చేశారు. ఇంతవరకు సవ్యంగానే ఉన్నప్పటికీ సమరసత సంస్థ ద్వారా 32 ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు.

అంతా రహస్యం

ఇదిలా ఉంటే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత టీటీడీలో 2019 నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మారేవరకు టి బోర్డులో ఆమోదించిన తీర్మానాలు నిధుల వివరాలు వెబ్సైట్లో లేకుండా రహస్యంగా వ్యవహరించారు. ఇది అనేక సందేహాలకు తావు ఇవ్వడమే కాకుండా అపసవ్య పరిస్థితులను కప్పిపెట్టే ప్రయత్నం జరిగినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాటు టీటీడీ ఈవో జె శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక విషయాలు వెలుగు చూసాయి.
ఈ వ్యవహారాలపై ఇప్పటికే 40 మంది సభ్యుల ఉన్న రాష్ట్ర విజిలెన్స్ విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసింది. ఇందులో ఇంజనీరింగ్ పనుల్లో చేసిన అవకతవకలకు సంబంధించి ఆధారాలు కనుగొన్నట్టు సమాచారం. శ్రీవాణి ట్రస్టులో కూడా రికార్డులు లెక్కలు పారదర్శకంగానే ఉన్నాయని, ఒక అంశంలో మాత్రమే తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ యంత్రాంగం గమనించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా..

అవన్నీ గాలికి..

టీటీడీ అదనపు ఈవో గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో తనకు ఉన్న అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్న ఏవి ధర్మారెడ్డి సామాన్య భక్తులు సిబ్బందికి మేలు చేసే పనులు చేసినట్లు కూడా చెబుతున్నారు. అందులో ప్రధానంగా..
తిరుమల లో వైకుంఠ ద్వార దర్శనం ఏడాదికి రెండు రోజులు మాత్రమే ఉండేది. పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర పండితుల సలహాలు తీసుకున్న తర్వాత సామాన్య భక్తులకు కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించడానికి పది రోజులు పాటు ద్వారాలో తెరిచి ఉంచే అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం పది కౌంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 20 లక్షల మందికి పైగానే దర్శన భాగ్యం కల్పించారు. శ్రీవారి లడ్డు ప్రసాదం పోటులో వేడికి కార్మికులు తట్టుకోలేకపోతున్నారని గ్రహించి దాతల సహకారంతో అధునాతన స్టవ్వులు ఏర్పాటు చేయించారు. ఆర్జిత సేవల టికెట్లను కంప్యూటరీకరించారు. అలిపిరి నడకమార్గంలో యాత్రికులకు ఇబ్బంది లేకుండా రిలయన్స్ సహకారంతో రు. 25 కోట్లు వెచ్చించి పైకప్పు పునర్నిర్మాణం చేశారు. బర్డ్స్ ఆస్పత్రిలో సేవల పరిధిని విస్తరించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా భక్తులకు మహాలవు దర్శనం కోరుకున్నన్ని లడ్డు ప్రసాదాలు అందుబాటులోకి తీసుకురావడానికి పోటు సామర్థ్యాన్ని పెంచారు. పరకామణి లెక్కింపు ఇమ్మదీకరంగా ఉండడం గ్రహించిన ఏవీ ధర్మారెడ్డి చెన్నై చెందిన దాత సహకారంతో ప్రత్యేక భవనాన్ని నిర్మించడం ద్వారా అక్కడ హుండీ కానుకలు సులభతరంగా లెక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.
ఆరోపణలు ముసురుకున్న నాటి నుంచి మాజీ ఈఓ ధర్మారెడ్డితో మాట్లాడడానికి ఫెడరల్ ప్రతినిధి అనేకసార్లు ఫోన్ చేసినా, కాల్ రిసీవ్ చేసుకోలేదు. తిరుమలలో తనతో సాన్నిహిత్యంగా మెలిగిన వారితో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

అధికార రాజకీయ పలుకుబడి, తనకు సహకారం అందించిన వారికి పరస్పర సహకారం అందించే దిశగా తీసుకున్న నిర్ణయాలకు వత్తాసు పలికిన మాజీ ఈఓ ధర్మారెడ్డి కష్టాలలో చిక్కుకున్నారనే విషయం ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనున్నదో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News