Pushpa lies|పుష్ప చెప్పిందంతా అబద్ధాలేనా ?

నష్టపోయిన కుటుంబాన్ని తాము అన్నీ విధాలుగా ఆదుకుంటామని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న పిల్లాడి వైద్యఖర్చులన్నీ తామే భరిస్తామని ఐదురోజుల క్రితం ప్రకటించాడు.

Update: 2024-12-18 05:27 GMT

సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబందించి పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధాలేనా ? క్షేత్రస్ధాయిలో వింటున్నది చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అల్లుఅర్జున్(Allu Arjun) సినిమాల్లో మాత్రమే హీరో అని నిజజీవితంలో కాదన్న విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. తాజా ఉదాహరణ ఏమిటంటే తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ స్పృహకోల్పోయిన విషయం తెలిసిందే. పుష్ప2(Pushpa2 Movie) బెనిఫిట్ షో సందర్భంగా 4వ తేదీరాత్రి థియేటర్లో ఘటన జరిగినప్పటినుండి ఈరోజు వరకు శ్రీతేజ ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటున్నాడు. తొక్కిసలాటలో పిల్లాడికి ఊపిరి ఆడలేదు. ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అవటంతో ఇపుడు తేజ కోమాలో ఉన్నాడు. కోమాలో నుండి ఎప్పుడు రికవరి అవుతాడో చెప్పలేమని డాక్టర్లు ప్రకటించారు.

ఇదే విషయమై అల్లు అర్జున్ @ పుష్ప మీడియాతో మాట్లాడుతు నష్టపోయిన కుటుంబాన్ని తాము అన్నీ విధాలుగా ఆదుకుంటామని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న పిల్లాడి వైద్యఖర్చులన్నీ తామే భరిస్తామని ఐదురోజుల క్రితం ప్రకటించాడు. అయితే ఇదే విషయమై పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్(Police Commissioner CV Anand) మీడియాతో మాట్లాడుతు పిల్లాడి వైద్యఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. పిల్లాడి వైద్యఖర్చుల విషయంలో పుష్ప చెప్పింది అబద్ధమా ? లేకపోతే పోలీసు కమీషనర్ చెప్పింది అబద్ధమా ? అన్న విషయాలను ఆరాతీస్తే పుష్పచెప్పిందే అబద్ధమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే తొక్కిసలాట నేపధ్యంలో కూడా పుష్ప చెప్పినవి అబద్ధాలే అని ఇప్పటికే తేలిపోయింది కాబట్టి.

విషయం ఏమిటంటే మృతురాలి కుటుంబానికి నష్టపరిహారంగా రు. 25 లక్షలు ప్రకటించిన పుష్ప ఆ మొత్తాన్ని ఇచ్చింది లేనిది ఇప్పటివరకు చెప్పలేదు. ఒకవేళ 25 లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చుంటే ఆ విషయాన్ని చాలా గొప్పగా ప్రకటించుకునేవారే అనటంలో సందేహంలేదు. బాధిత కుటుంబం కూడా అల్లుఅర్జున్ ఫ్యామిలీనుండి తమకు పరిహారం అందిందని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇక తొక్కిసలాట విషయానికివస్తే తాము థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు ముందస్తు సమాచారం అందించామని పుష్ప యూనిట్ ప్రకటించింది. అయితే ముందస్తు సమాచారం అందించామని చెప్పారే కాని పోలీసులు ఏమన్నారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. సినిమా యూనిట్ థియేటర్ కు వస్తున్నట్లు చెబితే పోలీసులు వద్దన్నారు.

హీరోతో పాటు యూనిట్ థియేటర్ దగ్గరకు వస్తే క్రౌడ్ ను కంట్రోల్ చేయటం చాలా కష్టమని, థియేటర్ కు రెండు గేట్లు లేవని, అలాగే థియేటర్ చుట్టుపక్కల చాలా రెస్టారెంట్లున్నాయి కాబట్టి జనాలరద్దీ విపరీతంగా ఉంటుందని స్పష్టగా పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పోలీసులు తమను రావద్దన్న విషయాన్ని థియేటర్ యాజమాన్యం కాని పుష్ప యూనిట్(Pushpa Unit) కాని బయటపెట్టలేదు. అనుమతిలేకుండా థియేటర్ రోడ్డులో అదికూడా ఓపెన్ టాప్ కారులో జనాలకు అభివాదం చేస్తు అల్లు అర్జున్ ర్యాలీగా రావటం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్పారు. ఆ విషయాన్ని అల్లు అర్జున్ ఎక్కడా మాట్లాడటంలేదు. తొక్కిసలాట జరగటానికి తనకు ఎలాంటి సంబంధంలేదని మాత్రమే పదేపదే పుష్ప చెబుతున్నాడు. థియేటర్ కే రావద్దని పోలీసులు చెప్పినపుడు ఇక ర్యాలీగా రావటం పుష్పకు తప్పుగా అనిపించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అల్లు అర్జున్ థియేటర్ కు రావటం వల్లే తొక్కిసలాట జరిగిందని, భార్య మరణానికి కారణమని అప్పట్లోనే రేవతి భర్త భాస్కర్ ఆరోపించాడు. ఆ ప్రకటనను పుష్ప కొట్టిపారేశాడు. అయితే తర్వాత తన ఆరోపణలను భాస్కర్ ఉపసంహరించుకున్నాడు. అల్లు అర్జున్ మీద చేసిన ఆరోపణలను భాస్కర్ ఎందుకు ఉపసంహరించుకున్నాడో తనకే తెలియాలి.

ఇంతజరిగిన తర్వాత కూడా తొక్కిసలాటకు తనకు ఎలాంటి సంబంధంలేదనే పుష్ప వాదించటాన్ని పోలీసులు తప్పుపడుతున్నారు. థియేటర్ యాజమాన్యం, పుష్ప, అర్జున్ మేనేజర్, సెక్యూరిటిలో కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టుచేసి విచారించిన విషయం తెలిసిందే. ఘటనకు కారణమని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీచేసి మళ్ళీ విచారణకు రమ్మని పిలిచిన విషయం తెలిసిందే. గడచిన 20 ఏళ్ళుగా తన సినిమా రిలీజపుడు థియేటర్ కు వెళ్ళి సినిమా చూడటం తనకు అలవాటని అర్జున్ చెప్పుకుంటున్నాడు. అయితే పోలీసుల అనుమతిలేకుండా థియేటర్ కు రావటం, అనుమతి నిరాకరించినా ర్యాలీగా రావటంవల్లే థియేటర్లో తొక్కిసలాట జరిగిందని పుష్ప ఒప్పుకోవటంలేదు.

ఈ విషయాలను పక్కనపెట్టేస్తే కోర్టులో పుష్ప తరపున కేసు వాదించిన నిరంజన్ రెడ్డిపైనా పోలీసులు మండిపోతున్నారు. అరెస్టయిన పుష్ప విడుదల కోసం నిరంజన్ రెడ్డి కోర్టులో వాదిస్తు థియేటర్లో తొక్కిసలాట జరిగినపుడు పోలీసులు గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా మొదటి అంతస్తులో ఉన్నారని ఎద్దేవా చేశారు. బహుశా పోలీసులు కూడా అల్లు అర్జున్ ను చూడటానికే మొదటి అంతస్తులో వెయిట్ చేస్తున్నారేమో అని ఎగతాళిగా మాట్లాడారు. పోలీసులు తమవిధులను సక్రమంగా నిర్వర్తించకపోవటం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మరణించిందని లాయర్ వాదించారు. అయితే తొక్కిసలాట జరగకముందే పోలీసులు థియేటర్లో గ్రౌండ్ ఫ్లోర్ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు వీడియోలో కనబడింది.

తొక్కిసలాటలో కిందపడిపోయిన మహిళకు పోలీసులే ప్రధమ చికిత్స చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయవుతున్నది. స్పృహతప్పి పడిపోయిన మహిళను పోలీసులే మరో చోటికి మోసుకుని వచ్చి కిందపడుకోబెట్టి సీపీఆర్(CPR Process) విధానంలో రక్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. అలాగే కొడుకు శ్రీతేజను కూడా పోలీసులే అంబులెన్సులో తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం. పుష్పతో పాటు యూనిట్ ను థియేటర్ కు రావద్దని చెప్పినా వినకుండా అల్లు అర్జున్ వస్తాడని, అందులోను ర్యాలీగా వస్తాడని పోలీసులు ఎలాగ అనుకుంటారు ? అందుకనే కొద్దిపాటి బందోబస్తు మాత్రమే థియేటర్లో ఉంది. తప్పులన్నీ అల్లు అర్జున్ బృందంచేసి ఇపుడు తప్పించుకోవటానికి అబద్ధాలు చెబుతున్నట్లు అర్ధమవుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

Tags:    

Similar News