ఓటుపై పల్నాడు గాయం.. ప్రహసనంగా మారిన వెబ్ కాస్టింగ్..!

పోలింగ్ ప్రక్రియలో పల్నాడు చేసిన గాయం కీలకమైన వెబ్ కాస్టింగ్ పై సందేహాలకు ఆస్కారం కల్పించింది. ఇది ఓ ప్రహసంగా మార్చారనే అపవాదును మూటగట్టుకుంది.

Update: 2024-05-26 02:00 GMT

 "నేను లేస్తే మనిషిని కాదు. జాగ్రత్త..!" అని వైకల్యంతో ఉన్న ఓ వ్యక్తి బెదిరించే వాడంట. ఈ సామెతకు సరిపోయినట్లే.. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో వెబ్ కాస్టింగ్ తీరు మారినట్లు కనిపిస్తోంది. పల్నాడులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన తర్వాత అనేక సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో సున్నిత, వివాదాస్పద పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలు అమర్చడం, ఓటింగ్ సరళని పర్యవేక్షించడంలో వైఫల్యాలు కొట్టుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థలో డొల్లతనం బహిర్గతం చేస్తున్నట్లు వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా...

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13వ తేదీన జరిగింది. అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమి మధ్య ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో వివిధ సమస్యలు, ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గతంలో జరిగిన సంఘటనలను సమీక్షించి పకడ్బందీ చర్యలు తీసుకుంది. హింసకు తావులేని విధంగా సాయుధ బలగాలను మోహరించింది. అంతేకాకుండా, రాష్ట్రంలో మొదటిసారి అత్యధిక పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులో 14 అసెంబ్లీ సెగ్మెంట్లలోని 12,438 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి, 100 శాతం వెబ్ కాస్టింగ్ కు చర్యలు తీసుకుంది. అందులో పల్నాడుతోపాటు తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె, కడప జిల్లాలోని రాయచోటి అసెంబ్లీ స్థానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత సున్నితమైనవిగా గుర్తించింది. ఆ మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇంతవరకు అభినందించదగిన విషయమే.

 

తిరుపతిలో పరిశీలిద్దాం...

తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలోని కపిలతీర్థం రోడ్డు మార్గంలోని ఎస్బిఐ వెనుక ఉన్న ఏపీ ఎన్జీవో హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన మీ-సేవ కేంద్రంలో 40, 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీసేవ కేంద్రంలో ఒక సీసీ కెమెరా, ఈవిఎం, వివి ప్యాట్ కనిపించే విధంగా సీసీ కెమెరా ఉందని క్యూలో ఉన్న ఓ ఓటరు అభ్యంతరం చెప్పారు. దీనిపై స్పందించిన ఫెడరల్ ప్రతినిధి ఆ విషయాన్ని అక్కడే ఉన్న బిఎల్ఓల దృష్టికి తీసుకువెళ్లారు.

యాదృచ్ఛికంగా అక్కడే ఓ యువకుడు కనిపించాడు. తనను కెమెరాలను పర్యవేక్షించే సాంకేతిక నిపుణుడిగా పరిచయం చేసుకున్నారు. మీసేవ కేంద్రంలోని ఆ కెమెరా పనిచేయడం లేదు. ఎన్నికల సంఘం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి" అని స్పష్టం చేసిన ఆ సాంకేతిక నిపుణుడు.. తన సెల్ ఫోన్లో అనుసంధానం చేసి ఉన్న కెమెరాలోని దృశ్యాలను చూపించారు. దీనిని బట్టి అర్థమైంది ఒకటే.

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును, అందులోని దృశ్యాలను ఆ సాంకేతిక నిపుణుడు చూసే వెసులుబాటు ఉందనే విషయం స్పష్టమైంది. అలాగే, నియోజకవర్గ ఎన్నికల యంత్రాంగం కంట్రోల్ రూమ్ లో వీక్షించే సదుపాయం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు అనేక ధర్మ సందేహాలకు ఆస్కారం కల్పించిందని చెప్పడంలో సందేహం లేదు.

ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యత

అన్ని వందల పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సామర్థ్యం ప్రభుత్వం అంటే ఎన్నికల సంఘం వద్ద ఉండకపోవచ్చు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి, సున్నితంగా పర్యవేక్షించి పరిశీలించడానికి, ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వెబ్ కాస్టింగ్ బాధ్యతలు అప్పగించారనేది సుస్పష్టం. కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా అని తెలుసుకోవడంతో పాటు పోలింగ్ ను కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల లో దృశ్యాలను చూసే అవకాశం ఆ సంస్థల ప్రతినిధులకు అక్కడ కనిపించింది. అలాగే కంట్రోల్ రూమ్ లో ఉన్న అధికారులు కూడా మానిటరింగ్ చేసే సదుపాయం కూడా ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత రికార్డ్ అయిన డాటాను ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కకు ఉంచితే..

 

సందేహాల తుట్టిని కదిపిన మాచర్ల

పోలింగ్ కు ముందే.. సమస్యాత్మక, అత్యంత సున్నితమైన కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. అయినా, మాచర్ల అసెంబ్లీ స్థానంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన సంఘటన పదిరోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలింగ్ జరిగే సమయంలో కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటిని తమ సెల్ఫోన్ల ద్వారా పర్యవేక్షించే ప్రైవేటు సిబ్బంది, కంట్రోల్ రూమ్ లో డేగ కళ్ళతో పర్యవేక్షించే ఎన్నికల యంత్రాంగం ఈ వ్యవహారాలను మూడంచల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎందుకు గుర్తించలేక పోయిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ఈ విషయమై సామాజిక విశ్లేషకుడు తుంగా లక్ష్మీనారాయణ స్పందించారు. " వెబ్ కాస్టింగ్ లో జరిగిన లోపాలపై రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాలిన" అని అన్నారు. "ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలు సముచితమే. పది రోజుల తర్వాత వరుస పెట్టి పోలింగ్ నాడు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయంటే, అందుకు ఆ ఇద్దరు అధికారులతో పాటు, క్షేత్రస్థాయిలోని సిబ్బందికి బాధ్యత కూడా ఉందిన" అని వ్యాఖ్యానించారు. "ఈవీఎంలు ధ్వంసమైన చోట, రీపోలింగ్ నిర్వహించడం ద్వారా చిత్తశుద్ధి చాటుకోవాల్సిన అవసరం ఉంది" అని సూచించారు.

వెబ్ కాస్టింగ్ బాధ్యతలు ఎవరికి ఏ ప్రాతిపదికన అప్పగించారనే విషయాలు తెలుసుకునేందుకు ఫెడరల్ ప్రతినిధి విఫలయత్నం చేశారు. తిరుపతి, పీలేరు, రాజంపేట రిటర్నింగ్ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేదు. బహుశా కౌంటింగ్ ఏర్పాట్లలో వారందరూ తలమునకలుగా ఉండి ఉండవచ్చు.

ఈ వ్యవహారాలపై విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బూర్తి నగేష్ స్పందించారు. " కేంద్రం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకు సర్వసత్తాక హక్కులు ఉంటాయన్న విషయాన్ని అధికారులే మరిచిపోయారు. జరిగిన సంఘటనలకు వారిద్దరే బాధ్యులు" అని వ్యాఖ్యానించారు. " ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో నిర్ణయాలు చేయడం వేరు. అన్ని హక్కులు కలిగిన ఎన్నికల ప్రధాన అధికారులు కూడా ఆమూసలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది సరైనది కాదు. పోలింగ్ జరిగిన పది రోజుల తర్వాత వరుస పెట్టి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అంటే, వెబ్ కాస్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు" అని చెప్పక తప్పదని నగేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News