పోలీస్‌ స్టేషన్‌లో చండీ హోమమా?

భక్తులు ఇండ్ల వద్ద, దేవాలయాల వద్ద హోమాలు నిర్వహిస్తారు. అయితే విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే హోమం నిర్వహించారు.

Update: 2024-10-15 12:36 GMT

ఎవరైనా భక్తి ప్రపత్తులు చాటు కోవాలంటే హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఇందుకోసం ఒక చిన్న కుటీరం లాంటిది కొత్తగా నిర్మించి కొందరు పెద్దలు చేస్తారు. మరి కొందరు నివాస భవనంలోనే చేస్తారు. ఇంకొందరు దేవాలయాల్లో చేస్తారు. అయితే ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో హోమాలు చేస్తున్న సంఘటన పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పదేళ్లుగా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కూడా నిర్వహించినట్లు అక్కడ పనిచేసి రిటైర్డ్‌ అయిన పోలీసులు కొందరు తెలిపారు. హోమాలు చెయ్యాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. పోలీసులు కాబట్టి వీరికి నియమాలు అవసరం లేకుండా పోయాయి. పోలీస్‌ డ్రెస్‌లోనే హోమ కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి దుర్గమ్మ వారికి ప్రత్యేకంగా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ చీరను తీసుకెళ్లి ఇస్తారు.

ప్రతి సంవత్సరం పోలీసులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోమం, పూర్ణాహుతి సమర్పణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పెద్దగా విమర్శలు రావడం లేదు. అలాగని మంచి కార్యక్రమం చేస్తున్నారనే అభినందనలు కూడా రావడం లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి చీర, సారె దుర్గమ్మకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ పోలీసులు కూడా ప్రత్యేకించి చీర, సారె సమర్పించడం ఏమిటనే చర్చ జరుగుతోంది. అంటే పోలీసులు ప్రత్యేకించి అమ్మవారి కార్యక్రమాల్లో మేము భాగస్వాములుగా ఉంటాము. ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవ మర్యాదలు మాకు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లున్నారు. ఇలా అయితే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దరసరా ఉత్సవాల సందర్భంగా దేవాలయం లిమిట్స్‌లో ఉండే పోలీస్‌ స్టేషన్‌లలో పూర్ణాహుతి, చండీహోమాలు నిర్వహించాలి. కానీ వారెవ్వరూ ఈ పనులు చేయడం లేదు. విమర్శలకు తావివ్వకుండా తమ విధులు తాము నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు పూర్ణాహుతి, చండీహోమం నిర్వహించారంటే పోలీస్‌ స్టేషన్‌ను దుర్గమ్మ గుడిగా మార్చారా? అనే సందేహం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులకు భక్తి ఎక్కువై హోమాలు స్టేషన్‌లలోనే చేస్తున్నారని కొందరు నాస్థికులు ఎద్దేవా చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో ఆరు వేల మంది పోలీసులు డ్యూటీలు నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరి వీరందరూ హోమంలో పాల్గొనాలా? పోలీసులు కావాలంటే వారి ఇండ్లలో భక్తిని చాటుకునేందుకు పూజలు, హోమాలు, యాగాలు చేయొచ్చు. అంతే కాని పోలీస్‌ స్టేషన్‌లో ఇవేమిటనే విమర్శలు కూడా ఉన్నాయి. పైగా పూర్ణాహుతి సమర్పణ అనంతరం విజయవాడ పోలీస్‌కమిషనర్‌ ఎస్‌వి రాజశేఖరబాబు అక్కడే మీడియాతో మాట్లాడటం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే వీరు ప్రచారం కోసం పనిచేస్తున్నారు తప్ప దుర్గమ్మపై భక్తితో కాదని పలువురు కనక దుర్గ భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏమైనా పోలీస్‌ స్టేషన్‌లో చెయ్యాల్సిన పనులు కాకుండా పూజలు, హోమాలు, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు చేపట్టడం ఏమిటనే విమర్శలను విజయవాడ పోలీసులు ఎదుర్కొంటున్నారు.
Tags:    

Similar News