ఎంఎల్ఏల కొనుగోళ్ళకు బీఆర్ఎస్ కు ఆఫర్లు వస్తున్నాయా ?
ఎంఎల్ఏలను కొనుగోలుచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేయమని తమకు ఆఫర్లు వస్తున్నట్లు బీఆర్ఎస్ దుబ్బాక ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతోంది;
ఇపుడీ విషయమే తెలంగాణ రాజకీయాల్లో లేటెస్టు సంచలనంగా మారింది. ఎంఎల్ఏలను కొనుగోలుచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేయమని తమకు ఆఫర్లు వస్తున్నట్లు బీఆర్ఎస్ దుబ్బాక ఎంఎల్ఏ కొత్త ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతోంది. దుబ్బాక పార్టీ సమావేశంలో మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ వ్యపారాలు, పారిశ్రామికవేత్తలు బాగా విసిగిపోయినట్లు చెప్పారని ఎంఎల్ఏ చెప్పారు. అందుకనే ప్రభుత్వపాలనతో విసిగిపోయిన వర్గాలన్నీ తమదగ్గరకు వస్తున్నట్లు వెల్లడించారు. ఎంతమంది ఎంఎల్ఏలను అయినా సరే కొనుగోలుచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాడగొట్టేయమని తమపై ఒత్తిడిపెడుతున్నట్లు కొత్త తెలిపారు. ఎంఎల్ఏ వ్యాఖ్యలతో కాంగ్రెస్(Congress) ఎంఎల్ఏలను కొనుగోలుచేసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్(BRS) సిద్ధమవుతోందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
ఫిరాయింపులను ప్రోత్సహించటంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR) కు ఘనమైన చరిత్రే ఉంది. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు టీడీపీ(TDP), కాంగ్రెస్(Congress) కు చెందిన 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను ప్రలోభాలకుగురిచేసి, ఒత్తిళ్ళు పెట్టి ఏదోరూపంలో బీఆర్ఎస్ లోకి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. తాము అధికారంలో ఉన్నపుడు ఎలాంటి పనులుచేసినా చట్టబద్దమే, అంతా న్యాయబద్దంగా చేసినట్లే. అదేపనిని తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారపార్టీ చేస్తేమాత్రం అంతా రాజ్యాంగవిరుద్ధం, చట్టవ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి పాతర వేసి తూట్లు పొడవటం అని గగ్గోలు పెట్టేస్తారు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు తాము పాల్పడిన ఫిరాయింపులే ఇపుడు తమమెడకు చుట్టుకునేసరికి కేటీఆర్, హరీష్ రావుకు సడెన్ గా రాజ్యాంగం, చట్టం, న్యాయం అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇపుడు పార్టీ మీటింగులో ఎంఎల్ఏ మాట్లాడిన మాటలనే గతంలో కేసీఆర్ కూడా చెప్పారు. కాంగ్రెస్ లో నుండి ఎంఎల్ఏలు వచ్చేస్తామని తనను అడుగుతున్నారని పార్టీ మీటింగులో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే తానే వద్దని వాళ్ళని ఆపినట్లు కూడా కేసీఆర్ చెప్పారు.
ఇపుడు కొత్త ప్రభాకరరెడ్డి కూడా అచ్చంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనే చేశారు. కాకపోతే ఎంఎల్ఏలు వచ్చేయాలని అనుకుంటున్నట్లు కాకుండా ఎంఎల్ఏలను కొనుగోలుచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైన నిధులను తాము సమకూరుస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమపూ ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. కొత్త వ్యాఖ్యల్లో ఆశ్చర్యం ఎందుకంటే ఏపార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కనీసం 61 మంది ఎంఎల్ఏల బలం అవసరం. ఇపుడు బీఆర్ఎస్ కు ఉన్నబలం కేవలం 38 మంది మాత్రమే. అంటే తక్కువలో తక్కువ 23 మంది ఎంఎల్ఏల మద్దతు అవసరం. బీఆర్ఎస్ తరపున గెలిచిన 38 మంది ఎంఎల్ఏల్లో 10 మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఇపుడు బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే బీఆర్ఎస్ కు కనీసం 33 మంది ఎంఎల్ఏల మద్దతు అవసరం.
టెక్నికల్ గా తనకున్న బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదుకదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం బీఆర్ఎస్ కు లేదు. ఈ విషయం తెలియకుండానే ఎంఎల్ఏ కొత్త బహిరంగంగా మాట్లాడారని అనుకోవటంలేదు. అయినా మాట్లాడారంటే లోలోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీఆర్ఎస్ ఏదన్నా వ్యూహం రచిస్తోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎంఎల్ఏ కొత్తప్రభాకరరెడ్డి తాజా వ్యాఖ్యలపై రెవిన్యు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు తహతహలాడుతున్నట్లు మండిపోయారు. అయితే బీఆర్ఎస్ ఎన్నిప్రయత్నాలుచేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేరని ధీమా వ్యక్తంచేశారు. ఇదేవిషయమై రేవంత్(Revanth) ఎలాగ స్పందిస్తారో చూడాలి.