ఫుడ్ ప్రాసెసింగ్’లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!
విశాఖలో శుక్రవారం జరిగిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-08-29 11:05 GMT
ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. త్వరలోనే పండ్ల మొత్తం ఉత్పత్తిలో 25 శాతానికి చేరుకుంటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. శుక్రవారం విశాఖలోని ఓ హోటల్లో జరిగిన ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీ తొమ్మిది శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ చేస్తున్న ఏపీ దేశానికే ఆక్వా హబ్‌గా ఉందని చెప్పారు. సీఎం ఈ సదస్సులో ఇంకా ఏమన్నారంటే..?
సదస్సులో ప్రతినిధులకు అభివాదం చేస్తున్న సీఎం
‘ప్రస్తుతం ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అందిపుచ్చుకోవాలి. పట్టణీకరణ, జీవనశైలి, తలసరి ఆదాయాలు కొత్త అవకాశాలకు వీలు కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర జిల్లాలు, విశాఖలో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకో, కాఫీ తదితర క్లస్టర్లు ఉన్నాయి. గ్లోబల్ బ్రాండ్స్ ఫ్రమ్ ఇండియా బై ఇండియన్స్ అనేది మన నినాదం కావాలి. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎకో సిస్టం ఉంది. తొమ్మిది ఇంటిగ్రెటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజి, 33 లక్షల టన్నుల గోదాముల సామర్థ్యం ఉంది. 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. అగ్రిటెక్ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నాం. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్లకు, ప్రాడక్టు పెర్‌ఫెక్షన్‌కు ఏపీ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది ప్రధాన సవాలుగా ఉంది. దీనిపై కూడీ ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. రూ.200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం’ అని చెప్పారు.
ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సుకు హాజరైన ప్రతినిధులు
ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
‘వచ్చే ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధిస్తాం. రతన్ టాటా ఇన్వోషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలకు కూడా పెద్ద పీట వేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంది. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనే గతేడాది రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులకు ఇదే మంచి సమయం. ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటునందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. రిస్క్ లయబిలిటీ చాలా తక్కువగా ఉంది. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. వ్యవసాయాన్ని లాభదాయకంగాను, సుస్థిరంగాను మార్చటమే నా లక్ష్యం. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఏపీ చాప్టర్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషదాయకం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో వివరించారు.