బ్రెయిన్‌తో ప్రజారోగ్య రంగంలో ఆవిష్కరణలు

అంతర్జాతీయ, స్థానిక నైపుణ్యాలను సమన్వయం చేయటం ద్వారా ప్రజారోగ్య రంగంలో బ్రెయిన్‌ కార్యక్రమం గణనీయమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.;

Update: 2025-08-25 14:44 GMT

వైద్యారోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్‌ బయోడిజైన్‌ రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌(బ్రెయిన్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ లో అంతర్భాగంగా ఈ రీసెర్చి ఇన్నోవేషన్‌ కార్యకలాపాలు ఉంటాయని ఆయన అన్నారు. ఏఐ, మెడ్‌ టెక్‌ అలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆసియా–పసిఫిక్‌ బయోడిజైన్‌ అలయన్స్, అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ ఫోర్డ్‌ బయోడిజైన్‌ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ, స్థానిక నైపుణ్యాలను సమన్వయం చేయటం ద్వారా ప్రజారోగ్య రంగంలో బ్రెయిన్‌ కార్యక్రమం గణనీయమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆసియా పసిఫిక్‌ బయోడిజైన్‌ అలయన్స్‌ కు చెందిన వేరువేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం సమావేశం అయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్‌ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్‌ లతో పాటు పరిశోధనలు, నిపుణులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. తద్వారా ఏపీ నాలెడ్జి ఎకానమీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, జపాన్, సింగపూర్, తైవాన్, ఐర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆయా దేశాల్లో బయోడిజైన్‌ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఏఐ,మెడ్‌ టెక్‌ అలయన్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాకేష్‌ కలపాల, స్టాన్‌ఫర్డ్‌ సెంటర్‌ ఫర్‌ బయోడిజైన్‌ ప్రొఫెసర్‌ అనురాగ్‌ మైరల్, ఆసియా పసిఫిక్‌ బయోడిజైన్‌ సహాధ్యక్షుడు డాక్టర్‌ యోనా వైస్‌బచ్, బయోడిజైన్‌ ఆస్ట్రేలియా ఛైర్‌ ప్రొఫెసర్‌ కెవిన్‌ ఫ్లెగర్, టోక్యో బయోడిజైన్‌ ప్రతినిధి యూరియోన్‌ కొబయాషి, తైవాన్‌ బయోడిజైన్‌ నుంచి జేమ్స్‌ చియెన్‌–హియా ట్సెంగ్, సింగపూర్‌ నేషనల్‌ యూనివర్శిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మార్క్‌ చాంగ్, మిరాయ్‌ మెడికల్‌ సహ వ్యవస్థాపకుడు కొలిన్‌ ఫోర్డే తదితరులు ముఖ్యమంత్రికి తమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరరించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను వైద్యారోగ్య రంగంలో ఆవిష్కరణలకు, మెడ్‌టెక్‌ పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే రోడ్‌మ్యాప్‌ పై ముఖ్యమంత్రి చర్చించారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతిక బదిలీ స్టార్టప్, ఇంక్యుబేషన్‌ తదితర రంగాల్లో సహాకారం అందించే అంశంపై గ్లోబల్‌ నిపుణులు – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ప్రత్యేకించి యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎయిమ్‌ ఫౌండేషన్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంతో భారత్‌ బయోడిజైన్‌ – బయోడిజైన్‌ ఆస్ట్రేలియాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి. వైద్యారోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను నిర్వహించేలా ఈ ఒప్పందం సహకరించనుంది.
ప్రజారోగ్యంలో ఇప్పటికే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైద్య సేవలు అందించేలా కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టాటా– గేట్స్‌ ఫౌండేషన్‌ లతో కలిసి డిజినెర్వ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా ఆస్పత్రిని అనుసంధానించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజినెర్వ్‌ సెంటర్‌ సేవలు విస్తరిస్తామని తెలిపారు. ఆధునిక వైద్య సేవలతో పాటు భారతీయ సంప్రదాయ వైద్య విధానాలైన యోగా, నేచురోపతిని కూడా ప్రజారోగ్యం కోసం అనుసంధానిస్తున్నామని తెలిపారు. విశాఖలోని ఏపీ మెడ్‌ టెక్‌ జోన్‌ కూడా ఆధునిక వైద్య పరికరాల తయారీలో కీలకంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత ఒప్పందంతో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యం అవుతాయని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్, ఈడీబీ సీఈఓ సాయికాంత్‌ వర్మ తదితరులు హాజరయ్యారు.
Tags:    

Similar News