జగన్ ధర్నాకు విశేష స్పందన.. ఇండియా కూటమి పార్టీల మద్దతు

ఢిల్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఇండి కూటమి నేతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏపీలో పరిస్థితులపై కేంద్రం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-07-24 11:00 GMT

‘‘ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోంది. హత్యారాజకీయాలకు పెంచి పోషిస్తున్నారు. విపక్ష పార్టీ నేతలే టార్గెట్ దాడులు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీనికి వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రషీద్ అనే వ్యక్తిని అది దారుణంగా హత్య చేసిన ఘటనే నిదర్శనం. ఆంధ్రలో శాంతి భద్రతలకు కాపాడాలి’’ అని పేర్కొంటూ ఢిల్లీలో జంతర్‌మంతర్‌లో భారీ ధర్నా చేస్తున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రజలకు ఈ కక్ష్యపూరిత రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలని, అందుకోసం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కోరారాయన. దేశ రాజధాని ఢిల్లీలో జగన్ చేస్తున్న ధర్నాకు ఇండి కూటమి పార్టీల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన(ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్, అదే పార్టీ ఎంపీ అరవింద్ సావంత్, ప్రియాంక చతుర్వేది అంతా వెళ్లి జగన్‌కు తమ మద్దతు తెలిపారు. దేశంలో కూడా ఇదే తరహా నిరంకుశ పాలన జరుగుతుందంటూ వారు బీజేపీని టార్గెట్ చేశారు. అంతేకాకుండా వైసీపీ నిర్వహించిన ఫొటో గ్యాలరీని కూడా వారు సందర్శించారు.

 

ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం

‘‘వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైనే దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో హింస ప్రజ్వల్లుతోంది. ఎక్కడ చూసినా విపక్ష పార్టీ వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఇళ్లపై దాడులు చేశారు.. వాహనాలను దహనం చేశారు. ప్రస్తుతం ఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దీనిపైనే లోకేష్ హోర్డింగ్స్ కూడా పెట్టారు. ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ఏమాత్రం ప్రోత్సహించలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచికన్నా ప్రతీకార దాడులే ఎక్కువ జరిగాయి. మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారు. దాడులు చేయడమే కాకుండా తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు’’ అని మండిపడ్డారు జగన్.

అందుకే మీడియా ముందుకు

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తి కనుమరుగవుతుంది. అందుకే ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఏపీలో ప్రభుత్వం మారిన 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులు నమోదయ్యాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఆంధ్రలో ప్రజాస్వామ్యం ఉందా? అన్న అనుమానాలు కలుగుతోంది. అందుకే ఢిల్లీకి వచ్చి మీడియా ముందుకు వచ్చాను’’ అని తన ధర్మాకు కారణాన్ని వివరించారు జగన్.

 

జగన్‌కు అండగా ఉండటానికే వచ్చా: సంజయ్

జంతర్‌మంతర్‌లో జగన్ చేస్తున్న ధర్మానకు శివసేన నేత సంజయ్ రౌత్ సంఘీభావం తెలిపారు. వైసీపీ ఫొటో గ్యాలరీని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైన ప్రభుత్వానికి ఒక్కరోజులో కూడా అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. ‘‘జగన్‌కు అండగా ఉండటానికే ఇక్కడి వచ్చాను. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదని నాకు మా పార్టీ అధినాయకుడు ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన 45 రోజుల్లోనే నరమేధం జరిగింది. ఇంకా జరుగుతోంది. రాజకీయ కక్ష్య సాధింపు అనేది దేశానికే కీడు చేస్తుంది. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపి అక్కడ జరుగుతున్న దాడులు, విధ్వంసంపై విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన తర్వాత ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యంగం అనేవే లేదు అని అర్థమైంది’’ అని వ్యాఖ్యానించారు.

 

దాడులు సరైనవి కాదు: అఖిలేష్

‘‘ఇక్కడికి రాకపోయి ఉంటే నాకు నిజాలు తెలిసేవి కావు. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. బుల్డోజర్ సంస్కృతికి మేము వ్యతిరేకం. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాలు ఏం చెప్పదల్చుకుంటున్నాయి? ప్రజాస్వామ్యంలో ప్రతీకార, కక్ష్యపూరిత దాడులు సరికాదు. జగన్ తన కార్యకర్తల కోసం పోరాటం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మేము బూటకపు ఎన్‌కౌంటర్లు కూడా చూశాం’’ అంటూ అఖిలేష్ అన్నారు.

Tags:    

Similar News