శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కు
మహిళల వన్డే ప్రపంచ కప్ సాధించడంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా క్రికెటర్ త్రిష శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శ్రీచరణికి ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహక చెక్కును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అండగా ఉంటుంది అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీచరణిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో శాప్ (SAAP) చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సిఎస్) అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.