రాయలసీమ భవిష్యత్తు మళ్లీ ప్రశ్నార్థకమేనా?
రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని వినియోగించకుండా వరదలు సృష్టిస్తున్నారు
కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుని రాయలసీమను ఆదుకోవాలన్న స్పష్టమైన దృష్టి, దీర్ఘకాలిక కార్యాచరణను తొలిసారిగా చూపించిన నాయకులు— ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన అంజయ్య ,నందమూరి తారకరామారావు.
శ్రీశైలం రిజర్వాయర్‌కు 854 అడుగుల కనీస నీటిమట్టం అనే చట్టబద్ధ నిర్ణయాన్ని గౌరవిస్తూ; పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం ద్వారా మద్రాసు త్రాగునీరు, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టులకు అవసరమైన 60 టిఎం సి ల నీటిని పొందే అవకాశాన్ని వారు కల్పించారు.రాయలసీమ ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది. వారి నిర్ణయాలు ఈనాటికీ దిశానిర్దేశకాలుగా నిలుస్తున్నాయి.
తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి 75 శాతం సంవత్సరాల్లో వరదలు వస్తున్న వాస్తవాన్ని గుర్తించి, శ్రీశైలం ప్రాజెక్టు నిండినప్పుడు సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను సంరక్షించాల్సిన బాధ్యతగా భావించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.
ఈ జలాలను వినియోగించుకునే లక్ష్యంతో గాలేరు నగరి ప్రాజెక్టుకు పాలనపరమైన అనుమతులను నందమూరి తారక రామారావు ఇచ్చారు. కాని పనులు మొదలు కాలేదు. ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని విస్మరించాయి. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునే లక్ష్యంతో జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టులో వరద ఉన్న ముఖ్యమైన 30 రోజుల్లో, రోజుకు 44,000 క్యూసెక్కుల చొప్పున నీటిని వినియోగిస్తే, రాయలసీమకు 120 టి ఎం సి ల నీరు అందించవచ్చని స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు.
దీనికోసం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్యాలను పెంచారు.
తెలుగుగంగ ప్రాజెక్టు లో భాగంగా వెలుగోడు, బ్రహ్మసాగర్ రిజర్వాయర్లకు 15,000 క్యూసెక్కుల నీటి సరఫరాకు కార్యాచరణ చేపట్టారు.
SRBC – గాలేరు నగరి వ్యవస్థలో భాగంగా గోరుకల్లు, గండికోట, మైలవరం, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గాలేరునగరి లోని అనేక రిజర్వాయర్లకు 22,000 క్యూసెక్కుల నీటి పంపిణీ చేయడానికి వీలుగా ప్రధాన కాలువ, తదితర నిర్మాణాలు చేపట్టారు.
ఎస్కేప్ కెనాల్ ద్వారా కుందూనదికి 8,000 క్యూసెక్కుల నీటి విడుదల చేసేలాగా నిర్మాణాలు చేపట్టారు.
ఈ అంశం గురించి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ,
‘వీరు చేపట్టింది కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు. రాయలసీమ భవిష్యత్తుకు రూపకల్పన.
తమ ఆధ్యులు చేపట్టిన రాయలసీమ భవిష్యత్తు రూపకల్పనను నిర్లక్ష్యం చేసే వారసులు వచ్చారు. ఇక్కడినుంచే కథ దారి తప్పింది.శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గించి, రాయలసీమకు నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటూ శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్ ఆర్ ఎం సి ), బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్యం 80,000 క్యూసెక్కులకు పెంచే కార్యక్రమం చేపట్టారు. కాని తమ పెద్దలు చేపట్టిన కార్యక్రమం ద్వారా బనకచర్లకు చేరే 44,000 క్యూసెక్కుల వరద జలాలు తెలుగుగంగ, ఎస్ ఆర్ బి సి / గాలేరు నగరి ప్రాజెక్టులు వినియోగించుకునడానికి ఉన్న చిన్న చిన్న అడ్డంకులను తొలగించడం పట్ల అలక్ష్యంగా వ్యవహరించారు/ వ్యవహరిస్తున్నారు.
120 టి ఎం సి ల వినియోగానికి నిర్మాణాలను గత పాలకులు చేపట్టినప్పటికి, వీటిలో చిన్నచిన్న పనులు అసంపూర్తిగా ఉండటంతో కనీసం 30 టి ఎం సి ల నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ చిన్న, చిన్న అడ్డంకులను తొలగించి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందించే పనులను చేపట్టకుండా, కుందూనదిలోకి 35,000 క్యూసెక్కుల నీరు పంపే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా వారసులు చేపట్టారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని వినియోగించకుండా వరద జలాలను కుందూనదికి మళ్లించి, వరదలు సృష్టిస్తూ, “నది వెడల్పు – లోతు” పేరుతో మట్టి పనులకు సిద్ధమవుతున్నారు” అన్నారు.
ఇప్పుడున్న ప్రశ్న ఒక్కటే ;తాము అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా–పరోక్షంగా కారణమైన, తమ పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఈ వారసులు నడుచుకుంటారా?
లేదా
నీటిని వినియోగించకుండా, వరదలను సృష్టిస్తూ, రాయలసీమ భవిష్యత్తును మళ్లీ ప్రశ్నార్థకంగా వదిలేస్తారా?
సమాధానం చరిత్రే చెబుతుంది…
కానీ ప్రశ్న మాత్రం రాయలసీమది.
* * *