అడవుల రక్షణపై పెరిగిన ఆశలు
అడవుల పరిరక్షణ అందరి బాధ్యత. అడవులు, పర్యావరణ పరిరక్షణ మంత్రిగా పవన్‌కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నందున పర్యావరణ ప్రేమికుల ఆశలు చిగురించాయి.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-19 11:43 GMT
ప్రస్తుతం దేశంలో అడవుల సంరక్షణ ప్రధానమైన అంశం. రోజు రోజుకు అడవులు నాశనం అవుతున్నాయి. స్మగ్లర్ల ధాటికి అటవీ సంపద ఎల్లలు దాటుంతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో కూడా అడవులు నాశనం అవుతున్నాయి. నల్లమల అడవిని ఒకప్పుడు కాకులు దూరని కారడవిగా పిలిచే వారు. ప్రస్తుతం కృష్ణానదికి ఇరువైపుల ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో తుప్పలు తప్ప పెద్ద చెట్లు కనిపించడం లేదు. టేకు, జిట్టేగి, ఇనమద్ది, ఏగిస, వేపె మాన్లు కనిపించకుండా పోయాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విచ్చల విడిగా స్మగ్లింగ్ జరుగుతోంది.
పాలకులు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను స్ట్రంతన్ చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఒకప్పుడు అడవుల్లోకి మేకలు వెళ్లాయంటే ఫైన్ కట్టాల్సిందే. ఇప్పుడు భారీ స్థాయిలో మేకలు, గొర్రెలు పెంపకం కూడా తగ్గింది. నల్లమల అడవుల్లో చాలా సార్లు ఫారెస్ట్ వారిపై దాడులు జరిగి హత్యలకు గురయ్యారు. అయినా నిందితులకు పెద్దగా శిక్షలు పడిన సందర్భాలు కూడా లేవు. అడవుల్లో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పెద్ద మాన్లు ఎక్కువగా ఉన్నాయి. కొండ పై నుంచి కిందకు నీరు ప్రవహించే కొండచెల ప్రాంతాల్లో వెదురు విపరీతంగా పెరిగి సూర్యరస్మి కూడా కిందకు కనిపించని పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు వెదురు కూడా స్మగ్లర్ల చేతిలో ముక్కలవుతోంది.
తగ్గుతున్న అటవీ భాగం..
ఆంధ్రప్రదేశ్‌లో 37,392 చదరపు కిలోమీటర్ల మేరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో 23 శాతం అటవీ భూభాగం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం విస్తీర్ణంలో కనీసం 33 శాతం అడవులు ఉండాలి. అందుకోసం ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు ప్రణాళికలు వేసుకోవడం, పట్టీపట్టనట్లు వ్యవహరించడం వల్ల అడవులు తరుగుతున్నాయే తప్ప పెరగటం లేదు.
పర్యావరణానికి కలుగుతున్న ముప్పును నివారించేందుకు పలువురు పర్యావరణ సంరక్షకులు ప్రభుత్వాలు, వ్యక్తులపై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు కూడా వేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మడ అడవులకు తీవ్ర నష్టం కలిగించినందున ప్రభుత్వంపైనే విశాఖపట్నానికి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కోర్టుల్లో కేసులు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అడవుల నాశనానికి కారణమవుతున్న పలువురిపై మృత్యుంజయరావు కోర్టుల్లో కేసులు వేశారు. వీరిని ఆపేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి వత్తాసు పలికే పెద్దలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
సామాజిక వన విభాగం ఎక్కడుంది..
కమ్యూనిటీ ఫారెస్ట్ కార్యక్రమాలు కానీ, రైతులకు బీడు భూముల్లో ఉద్యాన వనాలు పెంచేందుకు ప్రోత్సహకాలు ప్రభుత్వం చతికిల పడింది. రెడ్, ఆరెంజ్ పరిశ్రమ నుంచి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా పచ్చదనాన్ని పెంచేందుకు ý ూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ద్వారా గాలి, నీరు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన చర్యలు కూడా శూన్యమనే విమర్శలు ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు కూడా ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వ లేదు.
వన మహోత్సవాలు ఎందుకు చేపట్టరు..
ప్రతి సంవత్సరం వన మహోత్సవాలు నిర్వహించి మొక్కల పెంపకాలు సామాజిక వన విభాగం ద్వారా పంపిణీ చేపట్టే వారు. కానీ గడచిన ఐదేళ్లలో ఇటువంటి కార్యక్రమమే జరగలేదు. గతంలో ఉపాధిహామీ నిధులను వినియోగించి మొక్కలు పెంచే వారు. అది కూడా గత ప్రభుత్వం చేయలేదు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యునిటీ స్థలాలు, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాలు గతంలో ముమ్మరంగా జరిగేవి. ఇప్పుడు అటువంటి కార్యక్రమాలే లేవు. అడవులు ఎక్కువగా నాశనం అవుతున్నప్పుడు అడవుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు వర్షాకాలంలో విత్తనాలు హెలికాఫ్టర్‌ల ద్వారా చల్లించే వారు. ఇవేవీ ఇప్పుడు జరటం లేదు.
ఉద్యాన పంటలకు ఉపాధిహామీ అనుసంధానం
ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బుధవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఉద్యాన పంటలకు ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. దీని వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది. అలాగే రైతులకు ఉచితంగా పండ్లమొక్కలు పెంచి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.
అడవుల ద్వారానే ప్రాణవాయువు
ఆక్సిజన్, ఉష్ణోగ్రత స్థాయిలను నిర్వహించడానికి అడవులు సహాయపడతాయి. మొక్కల కిరణజన్య సంయోగ క్రియ సమయంలో ఇది కార్బన్ డై ఆక్సైడ్‌ను వినియోగిస్తుంది. భూమిపై ఆక్సిజన్ చక్రాన్ని నిర్వహించడానికి అడవులు సహాయపడతాయి. మనిషికి ప్రాణ వాయువు చెట్ల ద్వారానే వస్తుంది. భూమి గ్లోబల్ వార్మింగ్ స్థాయిలను నివారించడంలో అడవులు సహాయపడతాయి. పర్యావరణ వ్యవస్థలో అడవులు ప్రధాన భాగం. అవి వివిధ రకాల మొక్కలు, జంతువులకు నిలయం. కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చడం, వర్షపాతాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను చెట్లు కాపాడుతాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సహాయపడే జంతువులకు ఆహారం, స్థలాన్ని అడవులు అందిస్తాయి. అడవులన్నీ నాశనమైతే పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రభావం పడుతుంది. తరచుగా భూకంపాలు, వరదలు వస్తాయి. భూమి ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. భూమిపై జీవితం అసాధ్య మయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.
వాతావరణ సమతుల్యతకు అడవులు కావలి
అటవీ పరిరక్షణ అనేది భవిష్యత్ తరాలకు సుస్థిరత కోసం అవసరం. ఎక్కువ చెట్లను నాటి అడవులను అభివృద్ది చేయాలి. అడవులు ఒక ముఖ్యమైన సహజ వనరు. మానవులకు అనేక విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తాయని గ్రీన్ రెవల్యూషన్ సంస్థ చైర్మన్ జెవి రత్నం అభిప్రాయపడ్డారు.
పారిశ్రామికీకరణ పెరగటం వల్ల ముడి పదార్థాలు, ఇతర ప్రయోజనాల కోసం అనేక చెట్లు నరికి వేశారు. ఈ చెట్ల నరికివేతను సెలెక్టివ్ కట్టింగ్, క్లియర్–కటింగ్, షెల్టర్‌వుడ్ కటింగ్ ద్వారా నియంత్రించవచ్చు.
అడవుల విస్తీర్ణం పెంచేందుకు మరిన్ని చెట్లను పెంచాలి. నిర్దిష్ట ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చెట్లను ఎంపిక చేసుకోవాలి, చెట్ల పెరుగుదల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటవీ సంరక్షణ కోసం అటవీ ఉత్పత్తుల దోపిడీని నిరోధించడం అవసరం.