పేర్ని నాని అకౌంట్‌లో పెరిగిన బస్తాల సంఖ్య
రేషన్ బియ్యం మాయం కేసు పేర్ని నాని కుటుంబాన్ని వెంటాడుతోంది. ఏ రోజు ఏ మలుపు తిరుగుదుందో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు పేర్ని నాని, ఆయన కుటుంబం ఇంకా అజ్ఞాతం వీడలేదు. వారిపై నమోదైన కేసు గురించి వాస్తవాలను వెల్లడించడంలో వెనుకబడ్డారు. దీంతో పేర్ని నాని కుటుంబం కేసులో అసలు ఏమి జరిగిందేనే విషయాలపైన అయోమయం నెలకొంది. ప్రతి అంశంలోను త్వరగా స్పందించే గుణం కలిగిన పేర్ని నాని, తన కుటుంబంపై నమోదైన కేసులో నోరు విప్పక పోవడంతో కేసులోని అంశాలు వాస్తవమే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన రేషన్ బియ్యం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాయమైన రేషన బియ్యం బస్తాల సంఖ్య భారీగా పెరిగాయి. తొలుత చెప్పిన బస్తాల సంఖ్య కంటే రెండింతలు ఉన్నట్లు చర్చ సాగుతోంది. పేర్ని నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్ నుంచి 3,708 రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయని తొలుత వెల్లడించారు. తర్వాత ఆ లెక్క తప్పని, 4,840 బస్తాలు మిస్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు అవి కూడా తప్పని అంతకంటే పెద్ద మొత్తంలోనే రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయని చెబుతున్నారు. ఏకంగా 7,577 రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయని లెక్కలు తేల్చారు.
అయితే ఈ లెక్కలపైన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, పేర్ని నాని కుటుంబం సన్నిహితుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాయమైన బస్తాల సంఖ్యను తేల్చేందుకు దాదాపు నెల రోజులు సమయం పట్టింది. గోడౌన్‌లో ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని బస్తాలు మిస్ అయ్యాయనే లెక్కలు తేల్చేందుకు అన్ని రోజులు ఎందుకు సమయం పట్టిందనే దానిపైన వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే సంఖ్యను పెంచడానికే అంత సమయం తీసుకున్నారా? అనే టాక్ కూడా వారిలో వినిపిస్తోంది. మరో వాదన కూటమి వర్గాల్లో వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో లెక్కలు తీసేందుకు ఆ మాత్రం సమయం పడుతుందని, బస్తాలు మాయం కాకపోతే లెక్కలెందుకు చెబుతారు, మాయమైన బియ్యానికి పేర్ని నాని తాలూకు న్యాయవాది డీడీలు ఎందుకు చెల్లిస్తారని చర్చించుకుంటున్నారు. మరో వైపు పోలీసులు ఇచ్చిన నోటీసులపైన హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను పేర్ని నాని ఉపసంహరించుకున్నారు. కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసు విచారణలో ఉండగా కేసుకు సంబంధించిన పలు అంశాలు తెరపైకి వస్తుండటం ఆసక్తి కరంగా మారింది. గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమయ్యాయని పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై డిసెంబరు 10న పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిందనే చర్చ నడుస్తోంది.