అన్నపూర్ణ దేవి గా దుర్గమ్మ
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ అమ్మవారు మూడో రోజు బుధవారం అన్నపూర్ణదేవి గా కొలువయ్యారు. బుధవారం నాలుగు గంటల నుంచే భక్తులకు అన్నపూర్ణ దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు క్యూలో బారులు తీరారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణదేవి రూపం చాలా విశిష్టమైంది. సకల జీవరాశులకు ఆహారం అందించే అన్నపూర్ణదేవిగా దుర్గమ్మ అమ్మవారిని కొలుస్తున్నారు. జీవకోటికి జీవనాధారం ఆహారం. ఓ చేతిలో అక్షయపాత్రను, మరో చేతిలో గరిటపట్టి మానవాళి ఆకలి బాధలను తీర్చే తల్లిగా దుర్గమ్మ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవతగా అన్నపూర్ణదేవి రూపంలో ఉన్న దుర్గమ్మకు పూజలు చేస్తారు. అన్నపూర్ణదేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. అన్నపూర్ణదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించి పూజలు చేస్తే ధనధాన్యవృద్ధి, ఐశర్య సిద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం. అన్నపూర్ణదేవి రూపంలో ఉన్న దుర్గమ్మ తల్లి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను కలుగజేస్తుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో అన్నపూర్ణదేవి రూపంలో కొలువైన దుర్గాదేవికి ఈ రోజు పరమన్నాం. బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు.