ఎన్ కౌంటర్లో చంద్రబాబు మీద దాడికి సూత్రదారి నంబాల మృతి
ఇప్పటివరకు ఎన్ కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల్లో కేశవరావు కూడా ఉన్నట్లు నారాయణపూర్ పోలీసులు గుర్తించారు;
మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. బుధవారం ఉదయం నుండి జరుగుతున్న ఎన్ కౌంటర్లో మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజు చనిపోయాడు. ఇప్పటివరకు ఎన్ కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల్లో కేశవరావు కూడా ఉన్నట్లు నారాయణపూర్ పోలీసులు గుర్తించారు. చత్తీస్ ఘడ్, నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో మావోయిస్టు(Maoists encounter)లు సమావేశమవుతున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందింది. దాంతో భద్రతాదళాలు ఆపరేషన్ కగార్(Operation Kagar) లో భాగంగా అబూజ్ మడ్ అడవుల్లో మావోయిస్టులు సమవేశమవుతున్న ప్రాంతాన్ని బుధవారం తెల్లవారుజామున చుట్టుముట్టారు. భద్రదాదళాల రాకను పసిగట్టిన మావోయిస్టులు తమ టాప్ లీడర్లు తప్పించుకునేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తునే మరోవైపు కాల్పులు మొదలుపెట్టారు.
మావోయిస్టుల నుండి కాల్పులు మొదలుకాగానే భద్రతాదళాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించారు. బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ మొదలైంది. కడపటివార్తలు అందే సమయానికి ఇంకా ఎన్ కౌంటర్ జరుగుతునే ఉంది. భద్రతాదళాలపై కాల్పులు జరుపుతునే మావోయిస్టులు తమ టాప్ ర్యాకింగ్ లీడర్లను కాపాడుకుంటు అడవుల్లో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాల్పుల్లో ముందుకు చొచ్చుకుపోతున్న భద్రతాదళాలకు చనిపోయిన మావోయిస్టులు కనబడ్డారు. వీళ్ళని గుర్తించే క్రమంలో నంబాల కేశవరావు(Top leader Nambala Kesavarao) ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. నంబాల మృతి మావోయిస్టులకు పెద్ద దెబ్బనేచెప్పాలి. ఎందుకంటే గెరిల్లా దాడుల వ్యూహాలు రచించటంలో, అమలుచేయటంలో నంబాల చాలా దిట్టగా పేరుంది. మావోయిస్టుల్లో మిలిటరీ కమిషన్ ను ఏర్పాటుచేసింది కూడా నంబాలే.
2003లో తిరుపతి అలిపిరిలో చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) మీద జరిగిన క్లెమోర్ మైన్ ఎటాక్, 2018లో విశాఖపట్నం జిల్లలోని అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమాను ప్రజాకోర్టులో చంపటంలో నంబాలే కీలకవ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టంటు ప్రభుత్వం కోటిన్నర రూపాయల రివార్డు ప్రకటించిందంటేనే నంబాల ఎంతటి కీలకనేతో అర్ధమవుతోంది. అలాంటి నంబాల ఈరోజు ఉదయం మొదలైన ఎన్ కౌంటర్లో చనిపోవటం మావోయిస్టులకు తీరని నష్టమనే చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో చదివాడు.
ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టులను వేరివేయటానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు డిసైడ్ అయ్యాయి. 2026, మార్చికి దేశంలో మావోయిస్టులే ఉండకూడదన్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పెట్టుకున్న టార్గెట్. ఆ టార్గెట్ ను రీచవ్వటంలో భాగంగానే కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్, యాంటీ నక్సల్ స్క్వాడ్, లోకల్ పోలీసులతో కలిసి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సుమారు 30 వేలమందితో అతిపెద్ద భద్రతాదళాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భద్రతాదళమే గడచిన ఐదునెలలుగా మావోయిస్టుల కోసం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) , జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకోసం జల్లెడపడుతున్నది. ఇందులో భాగంగానే బుధవారం తెల్లవారి నుండి మావోయిస్టులు-భద్రతాదళాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.