నకిలీ మద్యం కేసు: అసలైన వారిని తెరపైకి తెస్తాం..

రాజకీయ ముసుగులో నేరస్తులు... వైసీపీపై హోం మంత్రి ఫైర్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-11 14:01 GMT
గంగాథరనెల్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న హోెం మంత్రి వంగలపూడి అనిత, దళిత ఎమ్మెల్యేలు

కుల,మతాల మధ్య చిచ్చుపెట్టడం ద్వారా వైసీపీ చలిమంటలు కాచుకునే స్థితికి దిగజారిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ ముసుగు ధరించిన నేరస్తులు అలజడి సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీమద్యం తయారీలో తెరవెనుక ఉన్న వారు కూడా బయటకు తీసుకుని వస్తామని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"నకిలీ మద్యంలో పైకి కనబడుతున్నది అసలైన నిందితులు కాదు. తెర వెనుక ఉన్న వారిని త్వరలోనే బయటికి తెస్తాం" అని హోం మంత్రి అనిత సంచలన ప్రకటన చేశారు.

చిత్తూరు జిల్లా గంగాథరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవళంపేటలో కొన్ని రోజుల కిందట అంబేడ్కర్ విగ్రహం దగ్ధమైన ఘటనను శనివారం ఆమె టీటీడీ దళిత ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. సమీపంలో మళ్లీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఆ విగ్రహానికి హోంమంత్రి అనిత పుష్పాంజలి ఘటించారు. జీడీ.నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ థామస్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు, ఎమ్మెల్యేలు, జీడి. నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విఎం. థామస్, పూతలపట్టు మురళీమోహన్, మడకశిర M.S రాజు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ,, మాజీ ఎమ్మెల్యే గాంధీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిఆర్. రాజన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజకీయ క్రీడకు అంబేడ్కర్ ను వదలరా?

సభలో మాట్లాడుతున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు, పక్కన పూతలపట్టు ఎమ్మెల్యే కే. మురళీమోహన్, జీడి. నెల్లూరు ఎమ్మెల్యే థామస్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

దేవళంపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాన్య వ్యక్తి ప్రశ్నించినా, మా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. దళిత డ్రైవర్ ను హత్య చేయించిన కేసులో నిందిత ఎమ్మెల్యీని సభలో కూర్చోబెట్టి మాట్లాడించే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మమ్మలిని ప్రశ్నించే హక్కు  ఉందా? అని సూటిగా నిలదీశారు.
దళితులకు రాజ్యాంగ హక్కు కల్పించిన బీఆర్. అంబేద్కర్ ను కూడా రాజకీయ క్రీడ కు వాడుకోవడం దారుణం అన్నారు.
"ఇదే నియోజకవర్గం (గంగాథరనెల్లూరు) నుంచి డిప్యూటీ మాజీ సీఎంగా పనిచేసిన కళ్లత్తూరు నారాయణస్వామికి వయసు పెరిగింది. బుద్ధి మాత్రం పెరిగినట్టు లేదని" హోం మంత్రి అనిత వ్యాఖ్యానించారు.
"అంబేడ్కర్ విగ్రహం వద్ద ఓ మహిళ ఏర్పాటు చేసుకున్న షాపు అగ్నిప్రమాదానికి గురైంది. ఆ మంటలు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకడం వల్ల దెబ్బతినింది. మాజీ మంత్రి అనుచరుడు సర్పంచ్ గోవిందయ్య మరో రకంగా చిత్రీకరించారు. నారాయణస్వామి ఇదేమీ పట్టించుకోకుండా అంబేడ్కర్ ను కూడా కుటిల రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని ప్రయత్నించడం దళిత జాతికే సిగ్గు చేటు" అని మాజీ నారాయణ స్వామి తీరుపై తీవ్రంగా మాట్లాడారు. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అంటే అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల వల్లే అని ఆమె గుర్తు చేశారు. ఈ సంఘటన జరిగిన గంటల్లోనే ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ వాస్తవాలు వెలుగులోకి తెచ్చారని ఆమె గుర్తు చేశారు. ఈ సంఘటన వెనుక ఇంకా ఎవరు ఉన్నారనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేలుస్తామని ఆమె హెచ్చరించారు.
దళితులను రెచ్చగొడితే ఊరుకోం..

రాజకీయ క్రీడకు దళితులను రెచ్చగొట్టి, లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హోం మంత్రి అనిత తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వంపై
పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక , ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల ఐక్యమత్యంగా ఉండాలని ఆమె సూచించారు.
తప్పులు మన్నించేది లేదు..
ఎవరు తప్పు చేసిన వదిలేది లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని స్టేషన్ కు వెళ్లి బెదిరించడం పోలీసులకే అవమానం. దానికి తగినట్టే యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.
ఈమె ఇంకా ఏమన్నారంటే..
"అధికారంలో ఉన్న ఐదేళ్లు రౌడీయిజం చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రవర్తించాలంటే కుదరదు" అని వైసీపీ నేతలకు హోం మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేసిన వారికి నోటీసులు జారీ చేయడమే కాదు. కేసులు కూడా పెట్టి, అరెస్టు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
నకిలీ మద్యం తెర వెనుక ఎవరు?
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు వద్ద వెలుగు చూసిన నకీలీ మద్యం తయారీపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు.
"నకిలీ మద్యం తయారీ పై ప్రభుత్వం కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. నకిలీ మద్యం తయారీపై ఆరోపణలు వచ్చిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారికి చట్టప్రకారం కేసులు నమోదు చేసి, విచారణ చేస్తున్నాం" అని హోంమంత్రి అనిత గుర్తు చేశారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"నకిలీ మద్యం తయారీలో పైకి కనబడుతున్న వారు అసలైన వారు కాదు. తెర వెనుక కుట్రలు చేసిన వారు త్వరలోనే బయటకు వస్తారు. దాని వెనుకున్న కుట్రను ఛేదిస్తాం" అని కొత్త విషయాన్ని హోంమంత్రి అనిత చెప్పారు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది త్వరలోనే వెలుగుచూసే అవకాశం ఉంది.
Tags:    

Similar News