హరియాణాలో ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ మన తెలుగువాడే!

ఇప్పుడీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కుల వివక్షతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా?

Update: 2025-10-11 13:33 GMT
హరియాణాలో బలవన్మరణానికి పాల్పడిన వై. పూరన్‌ కుమార్ అక్షరాల మన తెలుగువారు. 2001 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. హర్యానా క్యాడర్. గత మంగళవారం చండీగఢ్‌ సెక్టర్-11లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని మరణించారు. ఇప్పుడీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదలు ఎందరెందరో ఆయన మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై అధికారులు వేటు వేశారు.

 పూరన్‌ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో హరియాణా డైరెక్టర్ జనరల్‌ ఆఫ్ పోలీస్ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమ్నీత్‌ కుమార్‌ డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అమ్నీత్ కుమార్ కి మద్దతుగా నిలిచారు. కుల వివక్షే పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే ఎస్పీని పదవి నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ కి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అమ్నీత్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. న్యాయం కోసం మీరు (అమ్నీత్ కుమార్) చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారంటూ సోనియా గాంధీ మద్దతు పలికారు. చండీగఢ్‌లోని తన నివాసంలో ఆయన రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉండటంతో తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అమ్నీత్‌ కుమార్‌ ఆరోపించారు. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయగా.. అది అసంతృప్తిగా ఉందని, నిందితులందరి పేర్లు చేర్చాలని ఆమె డిమాండ్‌ చేశారు.
ప్రకాశం జిల్లా వాసి?
52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ప్రకాశం జిల్లా వాసి. ప్రాధమిక విద్యాభ్యాసం కూడా ప్రకాశం జిల్లాలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. ఐపీఎస్ అధికారిగా ఆయన తన సేవా కాలమంతా సవాళ్లతో సాగింది. పోలీస్‌ వ్యవస్థలో షెడ్యూల్డ్ కాస్ట్ (SC) అధికారుల ప్రాతినిధ్యం గురించి బహిరంగంగా మాట్లాడిన ఆయన, సమానత్వం కోసం తరచూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తన వృత్తి జీవితంలో అంబాలా, కురుక్షేత్ర వంటి జిల్లాల్లో పని చేసిన ఆయన, రోహ్‌తక్‌, అంబాలా రేంజ్‌ల ఐజీగా కూడా పనిచేశారు. హోమ్ గార్డ్స్‌, టెలికమ్యూనికేషన్స్‌, డయల్-112 అత్యవసర సేవా ప్రాజెక్టులు వంటి ముఖ్య విభాగాలకు కూడా ఆయన నాయకత్వం వహించారు. 2033లో ఆయన రిటైరవ్వాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో పూరన్ కుమార్ అనేక పరిపాలనా, విధివిధాన సంబంధిత తగాదాల్లో పాల్గొన్నారు.
2024 ఏప్రిల్‌లో, అధికారిక వాహనాల కేటాయింపులో “వివక్షాత్మక వ్యవహారం” జరుగుతోందని ఆరోపిస్తూ తన వాహనాన్ని తిరిగి ఇచ్చి, తన హోదాకు సరిపడే కారు ఇవ్వాలని అప్పటి హోమ్ సెక్రటరీ టి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌కి లేఖ కూడా రాశారు.
అలాగే, 1991, 1996, 1997, 2005 బ్యాచ్‌ల అధికారుల ప్రమోషన్‌లను ప్రశ్నిస్తూ, అవి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు విరుద్ధమని, కేవలం ఫైనాన్స్‌ విభాగం అనుమతితో జరిగాయని కూడా ఆరోపించారు.
“2001 బ్యాచ్ అధికారులను డీఐజీ పదవికి పరిగణనలోకి తీసుకోవాలని” ఆయన 2022 అక్టోబరులో అప్పటి అదనపు ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రమోషన్ ఆలస్యం వల్ల వేతనాన్ని సవరించాలని, బకాయిలు చెల్లించాలనీ కూడా డిమాండ్ చేశారు.
తన ఫిర్యాదులు పట్టించుకోకపోవడానికి కారణం తాను, తన బ్యాచ్‌కి చెందిన మరికొందరు SC కేటగిరీకి చెందినవారు కావడమేనని ఆయన లేఖలో ఆరోపించారు. హోమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను లీగల్‌ అభిప్రాయానికి పంపుతోందని ఆయన ఆరోపించారు.
1997 బ్యాచ్‌ అధికారులకు ముందుగానే వేతన సవరణలు చేసి, ఇంక్రిమెంట్లు ఇచ్చినప్పుడు తన ప్రమోషన్‌ ను ఎందుకు వాయిదా వేశారని కూడా ఆయన ప్రశ్నించారు. 2024లో ఈ అధికారిపై కేవలం రెండు నెలల్లో ఐదు ఫిర్యాదులు నమోదు చేశారు. ఇది తనకు అవమానకరమని కూడా ధ్వజమెత్తారు.
2023 మార్చిలో ఆయనను హోమ్‌ గార్డ్స్‌ ఐజీగా నియమించారు. అయితే ఆ పోస్టు తన కేడర్‌ పోస్టు కాదని, ఖాళీగా ఉన్న ఐజీ స్థాయి పోస్టులు ఉన్నప్పటికీ తనను అక్కడకు పంపడం ఉద్దేశపూర్వకమని పేర్కొన్నారు.
ఆయన భార్యఅమ్నీత్ పి. కుమార్ హరియాణా క్యాడర్‌కి చెందిన సీనియర్ IAS అధికారి. ప్రస్తుతం ఆమె హరియాణా ముఖ్యమంత్రి నాయకత్వంలోని అధికార ప్రతినిధి బృందంతో జపాన్‌లో ఉన్నప్పుడు పూరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అమ్నీత్ కుమార్ సోదరుడు ఆప్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బఠిండా రూరల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా అమిత్ రత్తన్ ఎన్నికయ్యారు. పూరన్ కుమార్ కి బావమరిది.
ఆయన ఈ సంఘటనపై మాట్లాడుతూ “మాతో చెప్పకుండా మృతదేహాన్ని తరలించారు. ఇది అన్యాయం. డీజీపీ స్థాయి అధికారి మరణించి ఐదురోజులు గడిచాయి. ఇప్పటికీ మాకు న్యాయం దొరకలేదు,” అన్నారు.
పూరన్ కుమార్ మృతి వెనుక కులం, మత వివక్ష ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. సూసైడ్ నోట్ లో 8 మంది సీనియర్‌ పోలీసు అధికారుల పేర్లున్నాయి. వీరందరూ “ ఉద్దేశపూర్వకంగా జాతి, వర్ణ వివక్షకు పాల్పడ్డారు. మానసికంగా వేధింపులకు గురిచేశారు. పబ్లిక్ గా అవమాన పరిచారు. దౌర్జన్యాలు” చేశారని ఆరోపించారు. ఇప్పుడీ లేఖ ప్రకంపనాలు సృష్టిస్తోంది. సోనియా గాంధీ కూడా ఈ లేఖ ఆధారంగానే స్పందించినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News