ఏపీలో అక్షయపాత్రకే ఆశ్రమ పాఠశాలల ఆహారం బాధ్యతలు
328 కోట్లు చెల్లించనున్నారు. ఇప్పటి వరకు వంట చేస్తున్న సిబ్బందిని వడ్డించేందుకు, సెక్యురిటీ వంటి పనులకు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకు ఇక నుంచి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మిడ్‌డే మీల్‌ను ఇప్పటికే అక్షయ పాత్రకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్లను కూడా అక్షయపాత్ర ఫౌండేషన్‌కే అప్పిగించింది. ఆ ఫౌండేషన్ ద్వారానే అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలను కూడా అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఫౌండేషన్ ద్వారానే ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న ఎస్టీ విద్యార్థులకు ఆహారం అందించనున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఆహారం కలుషితమైన ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోడి గుడ్లు, చికెన్ కర్రీలు మాత్రం ప్రత్యేకంగా వండి అందించాలని చూస్తున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అక్షయపాత్ర ఫౌండేషన్‌కి ఒప్పందం కూడా కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా 747 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో కలిపి దాదాపు 1.82లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఆహారం అందించడానికి డైట్ చార్జీల కోసం రూ. 260 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే అక్షయపాత్ర ఫౌండేషన్ అప్పగించిన నేపథ్యంలో ఈ ఖర్చు ఇంకా పెరగ నుంది. అదనంగా మరో రూ. 68 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తంగా రూ. 328 కోట్లు వరకు అక్షయపాత్రకు చెల్లించనున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో 2,054 మంది వంట సిబ్బంది ఉన్నారు. వీరిని ఆ విధుల నుంచి తప్పించి ఆహారం వడించడం, సెక్యురిటీ వంటి పనులకు వినియోగించుకోవాలని చూస్తున్నారు.