అవునన్నా కాదన్నా మీ అత్తనే చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు.;

By :  Admin
Update: 2025-01-18 08:58 GMT

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండో భార్య, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎన్టీఆర్‌ వల్ల లక్షల కోట్లు సంపాదించుకున్నారని, అలాగే ఆయనను సాగనంపారని విమర్శలు గుప్పించారు. మీరు అవునని అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తనను తీవ్రంగా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అంటూ చంద్రబాబుని నిలదీశారు. ఎన్టీఆర్‌ గౌరవం కాపాడే విధంగా బతుకుతున్నట్లు తెలిపారు. తనను బెదిరిస్తూ విపరీతంగా ఫోన్‌లు చేస్తున్నారని వాపోయారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా శనివారం ఆమె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి.. సామాజిక మాధ్యమాలలో తనపై జరుగుతున్న దాడి గురించి.. 29 ఏళ్లుగా తాను సాగిస్తున్న పోరాటం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్ష్మీపార్వతి ఏమన్నారంటే.. 29 ఏళ్లుగా నా పోరాటానికి స్పూర్తిని ఇస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నిరంతరంగా సాగిస్తున్న నా పోరాటం ఎన్నాళ్లు సాగుతుందో నాకే తెలియదు. కళ్లెంబడి ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్దాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం, నన్ను వెంటాడుతూనే ఉంది. వేధిస్తూనే ఉంది. ఎన్నిరకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియడం లేదు. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు. అందరి ముందే నన్ను వివాహం చేసుకున్నారు. లక్షలాది జనం ముందు అనౌన్స్‌ చేసి పెళ్లి చేసుకున్నారు. భార్యగా నన్ను ఎన్టీఆర్‌ తన ఇంటికి తీసుకొచ్చారు. గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఎన్టీఆర్‌ ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, ఆయన అధికారంలోకి రావడం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు. ఒక రూపాయి డబ్బులు ఆశించ లేదు. నిస్వార్థంగానే మిగిలి పోయాను. చివరికి ఆయన వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో కూడా తెలుసు. ఎన్ని కుతంత్రాలు జరిగాయో కూడా తెలుసు. ఆ తర్వాత కూడా వాళ్లు వదిలిపెట్టకుండా అదే అబద్దాలను కంటిన్యూ చేస్తూ.. నా జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
నిన్న కూడా వారు ఎవరో తెలియదు. వాళ్ల సోషల్‌ మీడియాలో ఎవరో నా ఫోన్‌ నంబరును రిలీజ్‌ చేశారు. చేసిన దగ్గర నుంచి టీడీపీ వాళ్లు తిట్లు ప్రారంభించారు. ఎందుకు నాకే అర్థం కావడం లేదు. నేను ఎవరిని ఈ మధ్య ఏమీ అనలేదు. ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా నేను ఎవరి ఏమీ అనలేదు. ఎవరి జీవితాల గురించి నేను మాట్లాడలేదు. ఎప్పుడూ మాట్లడను కూడా. వందలాది ఫోన్లు నాకు వస్తూనే ఉన్నాయి. ఇలా నా ప్రైవేటు ఫోన్‌కు ఫోన్‌ చేసి ఈ విధంగా విఘాతం కలిగించొచ్చా? నేను చంద్రబాబునే ధర్మం అడుగుతున్నాను. నేను నందమూరి ఇంటిదాన్నే కదా. మీరు అవుననుకున్నా.. కాదనుకున్నా మీ అత్తగారినే కదా. ఎన్టీఆర్‌ భార్యనే కదా. మీ వాళ్లు నన్ను అవమానం చేస్తావుంటే.. మీరు భరిస్తున్నారా? మీరు చూస్తూ ఊరుకున్నారా? అసలు మీకు తెలుసా? తెలియదా? న్యాయమనేది ఉంటే.. స్త్రీలను కాపాడాల్సినటువంటి ధర్మం మీకు లేదా? అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
Tags:    

Similar News