నెల కాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి

ఏపీలో 360 రోజులు సెక్షన్‌ 30ని పెట్టడం ధర్మమేనా అని పేర్ని నాని ప్రశ్నించారు.

Update: 2025-09-20 07:40 GMT

మెడికల్‌ కలాశాలల ప్రైవేటీకరణ్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల కోసం తాము పోరాటం చేస్తున్నామని, నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్ని నాని పేర్కొన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతి యుతంగా తాము పోరాటం చేస్తోంటే రాష్ట్ర వ్యాప్తంగా తమ వైసీపీ శ్రేణులపైన 400 మందిపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 360 రోజులు ఏపీలో సెక్షన్‌ 30ని పెట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని హోం మంత్రి, డీజీపీల విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ మండిపడ్డారు. ఏపీలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం 17 కొత్త మెడికల్‌ కళాశాలలను ఏపీకి తీసుకొచ్చిందని, వీటిల్లో ఐదు కళాశాలలను పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే మెడికల్‌ కళాశాలల నిర్వహణకు ఇబ్బందులు రాకుండా 50 సీట్లకు పేమెంట్‌ కోటా కింద పెట్టారని, జగన్‌ ఆలోచనల ప్రకారం కాలేజీల నిర్వహణకు అవసరమైన డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నాడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే తాము అధికారంలోకి వస్తే 150 సీట్లను రూ. 15వేలకే అందిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన నారా లోకేష్‌ , ఇప్పుడు కాలేజీలనే ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారని ధ్వజమెత్తారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు పోలీసు పర్మిషన్‌ అడిగామని, అయితే మెడికల్‌ కాలేజీల వద్దకు వెళ్తే లోపలేస్తామని పోలీసులు చెప్పారని, ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే ఛలో మెడికల్‌ కాలేజ్‌ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టిందన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తాము కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని పేర్ని నాని స్పష్టం చేశారు.

Tags:    

Similar News