ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
ఈ పెట్టుబడులు ఒక్కరోజులో రాలేదు. మంతెన రామరాజు, ఎన్ఆర్ఐ టీడీపీ నేత సాగర్ దొడ్డపనేని, కాటంనేని భాస్కర్ ఈ ప్రాజెక్ట్ ను విశాఖపట్నానికి తీసుకురావడంలో ఎంతో కీలకపాత్ర పోషించారు.ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతో మంది కృషి ఉంది. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. విశాఖపట్నం ఏపీకి ఆర్థిక రాజధాని. ఇది మా అజెండా. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రజలు ఆ విధంగానే ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. 94 శాతం సీట్లతో విజయం సాధించాం. సమర్థ పాలనకు, ఉద్యోగాల సృష్టికి, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు అని లోకేష్ అన్నారు. 
విశాఖ ప్రజలు ఎప్పుడూ టీడీపీతోనే ఉన్నారు
ఈ నగరంపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. 2019లో రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో మేం ఓడిపోయినా విశాఖ ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారు. విశాఖ ప్రజలు ధైర్యవంతులు. 2014 సమయంలో హుద్ హుద్ విపత్తు వచ్చినప్పుడు నగరం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు విశాఖ ప్రజలు నగర పునరుద్ధరణకు చంద్రబాబునాయుడికి ఎంతో మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ గారు కూడా నష్టాన్ని స్వయంగా చూశారు. ఇంత విధ్వంసం తర్వాత కూడా ప్రజలు చిరునవ్వుతో చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. అది విశాఖ ప్రజల స్ఫూర్తి.
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది
గత 17 నెలల్లో ఏపీకి వచ్చిన 120 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం కంటే ఎక్కువగా గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు వస్తోంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖపట్నానికే వస్తోంది. దీనివల్ల శక్తివంతమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం అని లోకేష్ స్పష్టం చేశారు. 
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తోంది
టీసీఎస్ కు 99 పైసలకే భూమి కేటాయించారని కొంతమంది నన్ను విమర్శించారు. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఆ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఆ నిర్ణయం వల్ల కాగ్నిజెంట్, యాక్సెంచర్, సత్వా, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వచ్చాయి. ఒక విధాన నిర్ణయం ఎన్నో మార్పులకు కారణమైంది. విశాఖకు ఇది ఎంతో కీలక సమయం. ఇది కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదు.. డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ రైలులా దూసుకెళ్తోంది. ఏపీ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారు. కేంద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖలో 3 లక్షల మంది యోగాంధ్ర నిర్వహించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం. ఇది చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు. ఇదీ విశాఖ ప్రజల నిబద్ధత.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగాం
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగాం. కేంద్రం స్టీల్ ప్లాంట్ కు రూ.11వేల కోట్ల సాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు అందించింది. మూడు ఫర్నేస్ లు ఇప్పుడు పనిచేస్తున్నాయి. వంద శాతం సామర్థ్యంతో నడిపి ప్లాంట్ ను లాభదాయకంగా మారేలా చేస్తాం. నిధులు అడగాల్సిన అవసరం రాకూడదు. ఇదే మా లక్ష్యం. రూ.14వేల కోట్ల సాయం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడమే కాదు.. అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. ఇది కేవలం ఏపీ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థకూ దోహదం చేస్తుంది. రైల్వే జోన్ సాధించాం, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం. ఇప్పుడు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఏ ఒక్క పెట్టుబడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. మొత్తం ఎకో సిస్టమ్ రావాల్సిన అవరసం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.