దారీ తెన్నులేని జనసేన పార్టీని ఈ స్థాయికి తెచ్చా
విశాఖలో జరిగిన సేనతో సేనాని సభలో పవన్ కల్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి నుంచి తన కష్టాలు, భవిష్యత్‌లో పార్టీని ఎలా నడిపిస్తారో కూడా స్పష్టం చేశారు.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-08-30 17:02 GMT
విశాఖపట్నంలో గురువారం నుంచి మూడు రోజులు సేనతో సేనాని పేరిట పార్టీ శ్రేణులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడో రోజు సాయంత్రం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. తన ప్రసంగంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, నిలదొక్కుకున్న తీరును, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడం, శ్రేణులకు ఇచ్చే అవకాశాలను వివరించారు. తరచూ తాను వైఖరి మార్చుకుంటానంటూ విమర్శించే వారికి సమాధానం చెప్పారు. జనసేనను జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్తానని వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
సభలో వేదికపై నుంచి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
2014లో జనసేనను తెలంగాణలో ప్రారంభించి ఏపీలో నిలదొక్కుకున్నాం. పార్టీ పెట్టినప్పుడు దారీతెన్నూ తెలీదు. కేవలం నమ్మకం. పార్టీ పెట్టాక సినిమాలపై దృష్టి సారించలేకపోయాను. కుటుంబాన్ని పట్టించుకోలేదు. కానీ పార్టీపై మాత్రం సంపూర్ణ దృష్టి సారించాను. దీంతో దేశంలోనే ఘనమైన విజయాన్ని సాధించాను. కష్టాలకోర్చి ఈ స్థాయికి వచ్చాను. గతంలో ఒక్క ఓటమితో నావెంట ఉన్న వారు పిట్టల్లా పారిపోయారు. రత్నాలు మిగిలాయి.. నత్తగుల్లలు వెళ్లిపోయాయి. 150 మందితో మన ప్రయాణం మొదలుపెట్టాం. ఈరోజు 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు చేరింది. ఇందుకు పదేళ్లు పట్టింది. 2014లో ఏ ఉద్వేగంతో ఉన్నానో నేటికీ అదే ఉద్వేగంతో ఉన్నాను. అదే బాధ్యత, నిజాయితీ, సిద్ధాంతాలతో ఇప్పుడూ ఉన్నాను. తగిలిన ప్రతి దెబ్బకు రాటు తేలాను. ప్రతి కుట్ర నన్ను మరింత బలపరిచింది. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆనాటి నుంచి నాతో నిలబడ్డ మీరే నిజమైన హీరోలు. జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. కులం, కుటుంబం కోసం పెట్టింది కాదు. ఓ ప్రాంతం కోసం కాదు.. కులం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. మానవాళి కోసం వచ్చాను. అన్ని కులాలను, ప్రాంతాలను గౌరవిస్తాం. దేశం అంతా మన పార్టీ గురించి మాట్లాడాలని కలగన్నాను. 2019–24 మధ్య నన్ను ఎంత నలిపేశారో మీకు తెలుసు. అందుకే అధికారంలో భాగస్వామ్యం తీసుకోవాలన్న ఐడియాలజీతో పనిచేస్తున్నాను. జనసేన కొన్నాళ్లకు నేషనల్ పార్టీ అవుతుంది. కానీ అది అంత తేలిక కాదు.
సేనతో సేనాని సభకు హాజరైన పార్టీ శ్రేణులు
రోజుకొకలా మట్లాడతానంటారు..
కమ్యూనిజం నుంచి డెమోక్రసీకి రష్యా రాలేదా? మావోయిజం అని చెప్పిన చైనా ఏమైంది? అక్కడ క్యాపిటలిజం రాలేదా? ఒకప్పుడు అమెరికా క్యాపిటలిస్టు. ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీలున్నాయి. ఒకప్పుడు సౌదీ అరేబియా హార్డ్ కోర్ ఇస్లామిక్ నుంచి ఆడవాళ్లకు డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తున్నాయి. ప్రపంచమే మారుతున్నప్పుడు నేను మారడంలో తప్పేముంది? గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోతున్నాయో చూస్తున్నాం. ఏమీ అవగాహన లేకుండా పార్టీ పెట్టేస్తామా? దీనిపై కమ్యూనిజం ఏ మాట్లాడుతుంది? అన్నీ అర్థం చేసుకునే ఇన్ని సిద్ధాంతాలతో ముందుకొచ్చాం. మాట్లాడితే మారిపోయాం అంటారు. కమ్యూనిస్టులే మారినప్పడు మేం మారడం తప్పేంది. మేం కూడా సంపూర్ణ అవగాహనతోనే మారుతున్నాం. గతంలో గద్దర్‌తో సంభాషణ జరిగినప్పుడు నాలో మార్పుపై ఆయన అడిగితే... దేవుడు లేడు అని పాటలు రాశావు. నువ్వే యాదాద్రి నరసింహుడి మీద రాశావు. నువ్వే మారినప్పడు నేను మారితే తప్పేంటి? అని అడిగాను. నేను నలిగి పోయి ఈరోజు నిలబడి చూపించాను. ఎర్రజెండాతో మావోయిస్టులా మారాల్సిన అవసరం లేదు. దీనికి నేను తుపాకులు పట్టుకోనక్కర్లేదు. అవసరమైతే జెండా కర్రే ఆయుధం. మన మాటే తూటా కావాలి. మా జనసైనికుల రక్తం సలసలా కాగుతూ ఉంటుంది. ఎవరికీ భయపడం. పోరాటాలే ఉంటాయి. మహిళలు పేరంటానికి వెళ్లాలి. పోరాటాలు చేయాలి. విశాఖలో గత ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టినా ప్రధాని, హోంమత్రికి ఫిర్యాదు చేయలేదు. వారి సలహా అడగలేదు. అడిగితే నా అంత బలహీనుడు ఉండడు.
రోడ్ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నా..
జనసేనలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నాం. ప్రతి క్రియాశీలక సభ్యుడికి త్రిశూల్ ప్రోగ్రాంను రూపొందిస్తున్నాం. దీనిని దసరా తర్వాత ప్రారంభిస్తాం. క్రియాశీలక సభ్యుడి కేంద్ర కమిటీ సభ్యునితో పనిచేసేలా వ్యవస్థ ఏర్పాటవుతుంది. గ్రామ, వార్డు, నియోజకవర్గం పార్లమెంటు, జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో మీరు నాయకుడు తయారు కావాలని రోడ్డు మ్యాప్ తయారు చేశాను. నాయకత్వం పదవి కాదు.. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో ఉన్న వారే నాయకులవుతారు. మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్ లక్ష్యంగా పనిచేస్తాం. ఆడపడచులకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నాం. భర్త కంట్రోల్ చేసే భార్య కాదు..సత్తా ఉన్న మహిళలు రావాలి. క్షేత్రస్థాయి నుంచి కేంద్ర నాయకత్వం వరకు అవకాశాలు కల్పిస్తాను. నేనే గుర్తిస్తాను వారిని. కార్యకర్తల భద్రత, గౌరవం బాధ్యతగా తీసుకుంటాను. 2029 నాటికి ఇంతకు మించి బలమైన నాయకులను తయారు చేస్తాను. దేశం కోసం పెట్టిన పార్టీ ఇది..
సామాజిక సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తాం. పార్టీలో అన్ని విభాగాలను పటిష్టం చేస్తాం. ఆషామాషీగా గాలికి తిరిగే వారు నాకొద్దు. సరైన వారిని కింద నుంచి ఓ స్థాయికి తీసుకెళ్తా.
దశాబ్దకాలం నాకివ్వండి..
మీ (పార్టీ శ్రేణుల) నుంచి నేను ఆశిస్తున్నది మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను నిలబడటానికి సిద్ధం. దశాబ్దకాలం మీరు నాకివ్వండి. మిమ్మల్ని దేశ నిర్మాణంలో నాయకులుగా తీర్చిదిద్దుతాం. దసరా నుంచి ఆయుధం పట్టుకోండి. దేశాన్ని బలోపేతం కోసం మనస్ఫూర్తిగా అడుగులేద్దాం. ఏపీకి సంబంధించి పాలనలో 15 ఏళ్ల పాటు కూటì మి స్థిరత్వంగా ఉండాలి. తప్పొప్పులుంటే చంద్రబాబుతో చర్చించి సరి చేస్తాను. చిన్నపాటి కోపతాపాలతో తప్పులు చేస్తే ప్రజలతో పాటు రాష్ట్రమూ నష్టపోతుంది. అరాచకపాలన మళ్లీ వస్తుంది.
ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైల్వే జోన్ వచ్చింది. గత ప్రభుత్వం రైల్వే జోన్‌కు స్థలం కూడా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. తగినన్ని నిధులు వస్తున్నాయి’ అని తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ వివరించారు. 55 నిమిషాల పాటు ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సభకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి జనసైనికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.