మూర్ఖుల విమర్శలను పట్టించుకోను
జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 15 వేలు ఆదా అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డాటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు మూర్ఖులు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు వల్ల 12 దేశాలకు సేవలు అందుతాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల, విదేశాల్లో పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కూడా ఇదే కావడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తోందని, ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే పదేళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని... ప్రపంచంలోనే తెలివైన వారికి చిరునామాగా ఏపీ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. విజయవాడ పున్నమి ఘాట్లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనాధ పిల్లలతో కలిసి క్రాకర్ షోను వీక్షించారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.