టీడీపీ ఎంఎల్ఏ వసంతకు షాకిచ్చిన హైడ్రా

వసంతకు చాలాకాలంగా హైదరాబాద్(Hyderabad) లో రియల్ ఎస్టేట్ వ్యాపారముంది;

Update: 2025-04-19 09:30 GMT
TDP ML Vasantha hit by Hydra

హైడ్రా దెబ్బేంటో టీడీపీ ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ రుచిచూశారు. కృష్ణాజిల్లాలోని మైలవరం నియోజకవర్గం నుండి 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున వసంత గెలిచారు. వసంతకు చాలాకాలంగా హైదరాబాద్(Hyderabad) లో రియల్ ఎస్టేట్ వ్యాపారముంది. భారీఎత్తున విల్లాలు, అపార్ట్ మెంట్లు కట్టి అమ్ముతుంటారు. అలాంటి వసంత(TDP MLA Vasanta Krishna Prasad) హౌస్ పేరుతో కొండాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న కట్టడాలను శనివారం ఉదయం హైడ్రా కూల్చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను హైడ్రా(Hydra) స్వాధీనంచేసుకుని విచారణచేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కొండాపూర్ ఏరియాలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల్లో వసంత హౌస్ భారీ నిర్మాణాలను చేస్తోంది. ఈ భూములన్నీ ప్రభుత్వ భూములని, ఎంఎల్ఏ కబ్జాచేసి నిర్మాణాలు చేస్తున్నట్లు చాలాకాలంగా ఆరోపణలున్నాయి.

ప్రభుత్వానికి ఇదేవిషయమై స్ధానికులు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ఎంఎల్ఏ కబ్జాపై ప్రభుత్వానికి ఫిర్యాదుచేసి ఉపయోగంలేదని అర్ధమైన స్ధానికులు ఇదే విషయాన్ని హైడ్రాకు ఫిర్యాదుచేశారు. అందిన ఫిర్యాదును హైడ్రా అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ భూములు కబ్జా అయిన విషయం నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత శనివారం ఉదయం సడెన్ గా భారీ పోలీసు బందోబస్తుతో హైడ్రా అధికారులు నిర్మాణాలు జరుగుతున్నచోటికి చేరుకున్నారు. బుల్డోజర్లు, జేసీబీలను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు వెంటనే ఆపేయాలని అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు.

ప్రభుత్వ భూములకు పెద్ద ఫెన్సింగ్ వేసి మరీ నిర్మాణాలు చేస్తున్నారు. అందుకనే ముందు హెచ్చరించినా పట్టించుకోని కారణంగా హైడ్రా అధికారులు జేసీబీలు, బుల్డోజర్లను రంగంలోకి దింపారు. జేసీబీలు రంగంలోకి దిగి ఫెన్సింగ్ తో సహా పెద్దపెద్ద షెడ్లను కూల్చేసింది. కూల్చివేతలను వసంత కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నంచేసినా హైడ్రా పట్టించుకోకుండా నిర్మాణాల కూల్చివేతలతో ముందుకుపోయింది. హఫీజ్ పేటలో రు. 2 వేల కోట్ల విలువైన వివాదాస్పద భూమితో పాటు మాదాపూర్లో(Madapur)ని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా వసంత గ్రూప్ కబ్జాచేసినట్లు ఆరోపణలున్నాయి. కబ్జాల తొలగింపుపై హైడ్రా, ఎంఎల్ఏ వసంత అధికారికంగా స్పందించాల్సుంది.

Tags:    

Similar News