Hydra Ranganadh|వివాదంలో హైడ్రా రంగనాధ్ ఇల్లు

రంగనాధ్ ఉంటున్న ఇల్లు కృష్ణకాంత్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) పరిధిలోకి వస్తుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

Update: 2024-11-26 08:34 GMT

హైడ్రా రంగనాధ్ వివాదంలో ఇరుక్కున్నారు. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెతలాగ తయారైందా ? రంగనాధ్ వ్యవహారం అనే చర్చ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రంగనాధ్ ఉంటున్న ఇల్లు కృష్ణకాంత్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) పరిధిలోకి వస్తుందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చాయని చెప్పి హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలోని చాల ప్రాంతాల్లో వందలాది అపార్టమెంట్లు, ఇళ్ళు, విల్లాలను కూల్చేసిన విషయం తెలిసిందే. బాధితులు ఎంతమొత్తుకుంటున్నా హైడ్రా(Hydra) పట్టించుకోకుండా కూల్చేస్తోంది. ఈ విషయమై రేవంత్ రెడ్డి(Revanth reddy) కూడా బాదితులను పట్టించుకోవటంలేదు. చాలామంది బాధితులు కోర్టులో హైడ్రా వ్యవహారంపై కేసులు వేశారు. హైడ్రా దెబ్బకు మొదటికే మోసం వస్తుందేమో అన్న భయంతో ప్రభుత్వం కాస్త నెమ్మదించటంలో హైడ్రా జోరు తగ్గింది.

ఈ నేపధ్యంలోనే హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్(Hydra Commissioner Ranganadh House) ఇల్లు, హైడ్రా ఆఫీసు చెరువు బఫర్ జోన్లో(Buffer zone)నే ఉన్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇదే విషయమై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత బక్క జడ్సన్(judson Bakka) ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఇంతకీ జడ్సన్ ఏమన్నారంటే రంగనాధ్ ఇల్లు కృష్ణకాంత్ పార్క్ కు దగ్గర్లోనే ఉందని బల్లగుద్ది చెప్పారు. చెరువును ఆక్రమించేసి ఇపుడున్న కృష్ణకాంత్ పార్క్(Krishnakanth Park) కట్టినట్లు జడ్సన్ ఆరోపించారు. చెరువును పునరుద్ధరించాల్సిన బాధ్యత హైడ్రాదే కదాని లాజిక్ మాట్లాడారు. చెరువు బఫర్ జోన్లోనే కమిషనర్ ఇల్లుతో పాటు హైడ్రా ఆఫీసు కూడా ఉందని జడ్సన్ అంటున్నారు. జడ్సన్ కృష్ణకాంత్ చెరువు ముందు నిలబడి ఇపుడున్న పార్కును చెరువులోనే ఏర్పాటుచేశారని చెప్పారు. అలాగే కమీషనర్ ఇల్లు కూడా చెరువు బఫర్ జోన్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పారు. ఇల్లే కాదు హైడ్రా ఆపీసు కూడా చెరువు బఫర్ జోన్లోనే ఉంది కాబట్టి ఇల్లు, ఆపీసు భవనాన్ని కూడా కూలగొట్టాల్సిందే అని పదేపదే డిమాండ్ చేశారు.

150 ఎకరాల పరిధిలో విస్తరించిన చెరువులోనే మథురానగర్ లే అవుట్ ఏర్పాటుచేసినట్లు జడ్సన్ ఆరోపించారు. చట్టం అందరికీ ఒకటే అయితే రంగనాధ్ ఇల్లుతో పాటు ఆపీసు కూడా వెంటనే కూల్చేయాలన్నారు. ఎలాంటి అండా లేని మధ్య, ఎగువమధ్యతరగతి జనాల ఇళ్ళు, విల్లాలు, అపార్టమెంట్లను కూల్చేసినపుడు కమీషనర్ ఇంటితో పాటు ఆఫీసును కూడా ఎందుకు కూల్చటంలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కమీషనర్ ఇంటితో పాటు ఇంకా చాలామంది ఇళ్ళను హైడ్రా ఎందుకు కూల్చలేదని నిలదీశారు. మధ్య, ఎగువమధ్య తరగతి ప్రజలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కొనుకొన్న ఇళ్ళను చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని చెప్పి నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన హైడ్రా ఇపుడు తన కమిషనర్ ఇంటి విషయంలో ఏమి సమాధానం చెబుతుందని జడ్సన్ అడిగారు. అన్నీరకాల అనుమతులు తీసుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని కొనుక్కున్న ఇళ్ళు ఒకపుడు చెరువును ఆక్రమించి కట్టినవే అని హైడ్రా చెబుతున్న విషయాన్ని జడ్సన్ గుర్తుచేశారు. అదే పద్దతిలో రంగనాధ్ ఇంటితో పాటు ఆఫీసును కూడా కూల్చేయాలన్న జడ్సన్ డిమండ్ కు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది.

రంగనాధ్ ఇల్లు కృష్ణకాంత్ పార్కున్న చెరువు బఫర్ జోన్ పరిధిలోకే వస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్టువచ్చింది. దాని ఆధారంగానే జడ్సన్ అసలు వాస్తవం ఏమిటో తెలుసుకునేందుకు మ్యాపులను దగ్గర పెట్టుకుని యూసుఫ్ గూడ చెరువు, కృష్ణకాంత్ పార్క్, మధురానగర్ లేఅవుట్, కమీషనర్ ఇల్లు, హైడ్రా ఆఫీసు ఏరియాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తాను సేకరించిన సమాచారాన్ని మ్యాపుల సాయంతో జనాలకు ట్విట్టర్ వేదిక ద్వారా జడ్సన్ వివరించారు. ఈ వేదికలోనే మామూలు జనాల ఇళ్ళకు ఒక న్యాయం, హైడ్రా కమిషనర్ ఇంటికి, హైడ్రా ఆఫీసుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. నిబంధన అన్నపుడు అందరికీ ఒకటేలా అమలు కావాలని డిమాండ్ చేశారు.

తనిల్లు బఫర్ జోన్లో లేదు

ఇదే విషయమై మీడియాతో కమిషనర్ రంగనాధ్ మాట్లాడుతు తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలో లేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా అసలు అక్కడ ఇపుడు ఎలాంటి చెరువు లేదన్నారు. లేని చెరువును, లేని బఫర్ జోన్ ను సోషల్ మీడియాలో సృష్టించి తనను స్పందించమంటే ఏమి స్పందిస్తానని అడిగారు. ఇపుడు తాము ఉంటున్న ఇల్లు 44 ఏళ్ళ కిందట తన తండ్రి నిర్మించినట్లుగా చెప్పారు. పార్కుకు తనిల్లు కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి బఫర్ జోన్ పరిధిలోకి రాదని రంగనాధ్ చెప్పారు. తాజాగా మొదలైన వివాదంలో ఏమి తేలుతుందో చూడాలి.

Tags:    

Similar News