తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు ఎలా తీసుకోవాలంటే..

టోకెన్ల కోసం 27 తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-22 06:39 GMT
తిరుమలలో వైకుంఠ ద్వారం (ఫైల్)

తిరుమలలో ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ నుంచి యథావిధిగానే పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ ( Tirumala Tirupati Devasthanams TTD ) నిర్ణయించింది. పాత పద్ధతి కాకుండా, పూర్తిగా ఆన్ లైన్ (Online) లో టికెట్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతాయి.

"తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darshan ) కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. ఆన్ లైన్ టికెట్ల జారీతో పారదర్శకంగా వ్యవహరించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక కౌంటర్లు లేవు..
తిరుమలలో "వైకుంఠ ద్వారం" దర్శనాలకు టిటిడి ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేదీ జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, 40 మంది గాయపడిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ పరిస్థితిని నివారించడానికి టిటిడి పాలక మండలి ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు స్వస్తి చెప్పి, ఆన్ లైన్ పద్దతిని అందుబాటులోకి తెచ్చింది. విషాధ ఘటన నేపథ్యంలో 2018 వరకు ఉన్న మాదిరే వైకుంఠ ద్వారాలు తెరవడం రెండు రోజులకే పరిమితం చేయాలని భావించారు. దీనిపై యాత్రికుల నుంచి నిరసన, వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో తర్జనభర్జన పడ్డారు. అంతిమంగా యాత్రికుల మనోభావాలు కాపాడుతూనే, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేని విధంగా ప్రత్యేక కౌంటర్ల స్థానంలో సాంకేతిక ఆధారంగా ఆన్ లైన్ టోకెన్ల జారీకి మొగ్గు చూపించారు.
సామాన్యులకు 164 గంటలు
ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశికి తోడు 2026 జనవరి మొదటి తేదీ కూడా కలిసి రావడం వల్ల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో వైకుంఠ ద్వార దర్శనాల కోసం యాత్రికులకు ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా టోకెన్లు జారీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
తిరుమలలో శ్రీవారికి ఉదయం నుంచి రాత్రి వరకు రోజువారి ఉత్సవాలు జరుగుతుంటాయి. దీంతో పది రోజుల్లో 240 గంటలు  అందుబాటులో ఉంటే, అందులో యాత్రికుల దర్శనానికి 182 గంటలు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా 164 గంటలు సామాన్య యాత్రికులనే శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడానికి వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల (నవంబర్) 27 తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అందుబాటులోకి తీసుకుని వస్తారు. టోకెన్ల కోసం ఈనెల 27వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు టిటిడి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిప్ పద్ధతిలో ఎంపిక చేసిన వారికి డిసెంబర్ రెండో తేదీ సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తుంది. ఆ లింక్ నుంచి టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు ఈ టోకెన్లు తీసుకున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్రికుడు ఆ మూడు రోజుల్లో ఏ తేదీ? ఏ సమయానికి దర్శనానికి రావాలనేది స్పష్టంగా ఉంటుంది. నిర్ణీత తేదీ ఆ సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు రావచ్చు.
రిజిస్ట్రేన్ సైట్లు..
ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వార ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు టీటీడీ వెబ్ సైట్లు అందుబాటులోకి తీసుకుని వస్తోంది.
పారదర్శకంగా: రిజిస్ట్రేషన్ లో పారదర్శకత పాటిస్తున్నట్ల టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 27 వతేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్పాప్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో దరఖాస్తు చేసుకునేందుకు కూడా టీటీడీ ఆప్షన్ ఇస్తుంది.
లక్కీ డిప్: దరఖాస్తు చేసుకున్న యాత్రికులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆ మేరకు డిసెంబర్ రెండో తేదీ వారి సెల్ ఫోన్లకు టీటీడీ లింక్ పంపిస్తుంది. అందులో ఏ తేదీ, ఏ సమయానికి దర్శనానికి రావాలనే విషయం స్పష్టంగా ఉంటుంది. ఆ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని, దర్శనానికి రావచ్చు.
శ్రీవాణి (Srivani) టికెట్లు రద్దు : డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి ఒకటో తేదీ వరకు ఈ మూడు రోజులు రూ.300 టికెట్లు, 10,500 రూపాయల శ్రీవాణి ట్రస్టు టికెట్లు రద్దు చేశారు. సిఫారసు లేఖలు కూడా అనుమతించమని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులు వస్తే, వారికి మాత్రమే దర్శనం ఉంటుంది.
2026 జనవరి 2 : తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార ప్రవేశం, శ్రీవారి దర్శనం కూడా అందుబాటులో ఉంటుంది. దీనికోసం గతంలో మాదిరి తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు. టోకెన్ల జారీలో పారదర్శకత, యాత్రికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధ్యాన్యతగా భావించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు స్నష్టం చేశారు.
ఇదీ ప్రత్యామ్నాయ ఏర్పాటు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం సామాన్య యాత్రికుల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ (అలపిరి వద్ద), విష్ణునివాసం (రైల్వే స్టేషన్), శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం (ఆర్టీసీ బస్టాండు వద్ద) రోజూ 18 వేల నుంచి 26 వేల టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి 2026 జనవరి మూడో తేదీ నుంచి ఈ కేంద్రాల్లోనే టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్లు ఉంటేనే తిరుమలకు వెళ్లడానికి అలిపిరి సమీపంలోని టోల్ గేట్ వద్ద అనుమతి ఉంటుంది. టోకెన్లు లేని వారిని ఇక్కడ నిలిపివేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్నష్టం చేశారు. అంటే సాధారణ రోజుల మాదిరి సర్వదర్శనానికి టోకెన్లు లేని వారిని అనుమతించరనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
టికెట్ల పునరుద్ధరణ :
2026 జనవరి రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు సాధారణ రోజుల మాదిరే రూ.300 టికెట్లు రోజుకు 1,500, శ్రీవాణి టికెట్లు 1,000 జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అంటే సాధారణ యాత్రికులతో పాటు ప్రత్యేక దర్శనాలు ఉంటాయనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టం అవుతోంది.
స్థానికులకు ప్రత్యేకం
తిరుమల, తిరుపతి స్థానికులకు యథావిధిగానే టీటీడీ ప్రాధాన్యత ఇచ్చింది. జనవరి ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రోజుకు 5,000 మందికి టోకెన్లు జారీ చేయడానికి చర్యలు తీసుకున్నారు.
స్థానికులు కూడా టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్పాప్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముందు వచ్చిన దరఖాస్తుదారుడికి ముందే అవకాశం కల్పిస్తూ, లక్కీడిప్ లో ఎంపిక చేసిన వారి సెల్ ఫోన్లకు మెసేజ్ తోపాటు, లింక్ కూడా టీటీడీ ఐటీ విభాగం పంపిస్తుంది. ఆ టోకెన్ లోనే ఏ తేదీ, ఏ సమయానికి దర్శనానికి వెళ్లాలనే వివరాలు స్పష్టంగా తెలియజేస్తారు.
Tags:    

Similar News