ఒక్కటైన ఇద్దరు IAS లు..ఎంత సింపుల్ గా అంటే..
ఆదర్శ ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరు IAS అధికారులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తిరుమణి శ్రీపూజ, మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యవర్మ అత్యంత సాదా సీదాగా ఆదర్శ ప్రేమ వివాహం చేసుకున్నారు. శుక్రవారం (21 నవంబర్ 2025) విశాఖపట్నంలో అతి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే స్థోమత, హోదా ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి.. ఎలాంటి హంగామా, ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా ఈ ఇద్దరు యువ అధికారులు సింపుల్ గా పెళ్లి చేసుకుని సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు.
విశాఖపట్నంలోని కైలాసగిరి శివాలయంలో దండలు మార్చుకుని, అదే విశాఖలోని సూపర్ బజార్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం నమోదు చేసుకున్నారు. కేవలం తల్లిదండ్రులు, సోదరసోదరీమణులు, ఇద్దరు ముగ్గురు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఎటువంటి ఆడంబర దుస్తులు, ఆభరణాలు, బ్యాండ్ మేళాలు, రిసెప్షన్, భోజనాలు లేవు. సాధారణ దుస్తుల్లోనే ఇద్దరూ కార్యాలయానికి చేరుకుని, 15 నిమిషాల్లో వివాహం పూర్తి చేసుకున్నారు.
వధువు తిరుమణి శ్రీపూజ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా, ఇన్‌ఛార్జ్ సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని డొంగపిండి గ్రామానికి చెందిన ఆమె 2021లో యూపీఎస్సీలో 62వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయింది. ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్, సబ్ కలెక్టర్‌గా పనిచేసిన ఆమె గిరిజన సంక్షేమంలో గణనీయ కృషి చేస్తోంది.
వరుడు ఆదిత్యవర్మ 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అస్సాం-మేఘాలయ జాయింట్ కేడర్‌లో మేఘాలయకు అలాట్ అయిన ఆయన ప్రస్తుతం షిల్లాంగ్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ శిక్షణ కాలంలోనే పరిచయమై, ప్రేమలో పడ్డారు. దీర్ఘకాలం స్నేహం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సాదాసీదా వివాహానికి సామాజిక మాధ్యమాల్లో అపార మెప్పు వస్తోంది. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “అధికారులే ఇలా చేస్తే సామాన్యులకు ఆదర్శం కాకుండా ఉంటారా ” అంటూ వేలాది మంది ప్రశంసిస్తున్నారు. ఖర్చులు లేకుండా, ఒత్తిడి లేకుండా జీవితాన్ని ప్రారంభించిన ఈ జంటకు అందరి నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు కురిపిస్తున్నారు.