ఇంతకూ.. "పిన్నెల్లి" వీడియో ఎలా బయటికి వచ్చింది..?

పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశారు? ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది?? అందుకు ప్రధాన కారకులు ఒకరా? ఇద్దరా?? అనేది చర్చకు ఆస్కారం కల్పించింది.

Update: 2024-05-24 03:26 GMT

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... రాష్ట్రంలో ఇప్పుడు పరిచయం అవసరం లేని వ్యక్తి. ఆయన పేరు చెప్పగానే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పొరుగునే ఉన్న తమిళనాడులో కూడా చర్చ జరుగుతోంది. తమిళ పత్రికలు కూడా ఆయన గురించి రాశాయి అంటే.. ఎన్నికల వ్యవహారంలో ఆంధ్ర రాష్ట్ర పరువు గంగలో కలిసింది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం ఉండకపోవచ్చు. అసలు విషయంలోకి వస్తే..

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో సాధారణంగానే గొడవలు జరిగాయి. వీటిని నివారించడంలో పోలీసులు విఫలమయ్యారన్న కారణంతో అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. పది రోజుల తర్వాత బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేయడం స్పష్టంగా వీడియోలో రికార్డు అయింది. ఇన్ని రోజుల తర్వాత ఆ వీడియో ఎలా బయటికి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అనే అంశంపై మొదట అధికారపక్షంలోనే కాదు.. ప్రతిపక్ష వర్గాల్లో కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొద్ది గంటల్లోనే ఆ వ్యవహారం బట్టబయలైంది.

 

ఇంతకీ ఎవరు బయటపెట్టారు...

మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసిన వ్యవహారం సంచలనం రేపడమే కాదు. ఆ వీడియో బయటకి తీసుకురావడం ఉన్న వ్యక్తి ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ పరిస్థితి ఏర్పడడానికి అసలు వ్యక్తి ఎవరు అనేది కాస్త పరిశీలిద్దాం. వ్యవహారం మొత్తం బయటకు తీసుకురావడానికి రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధాన అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ఒక వాదన, అయితే విదేశాల్లో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా ఎలా ఇది వచ్చింది అని అధికార వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు నిలదీస్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగ విరమణ అనంతరం "ఎలక్షన్ వాచ్" టీం ద్వారా రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ తయారీ, వ్యవహారాలపై ఆయన సునిశితంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే జరిగిన రోజు మాచర్లతో పాటు అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ తీరుపై క్షుణ్ణంగా పరిశీలించారు. మాచర్లలో జరిగిన సంఘటనలు చాలా వరకు బయటకు వచ్చాయి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం యంత్రాలను ధ్వంసం చేసిన సంఘటన వ్యవహారంలో అధికారుల తీరు సరిగా లేకపోవడంతో సందేహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి పదేపదే లేఖలు రాసారని తెలిసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సమాధానం ఇవ్వాలని ఎన్నికల అధికారిని గట్టిగా నిలదీశారని తెలుస్తోంది.

" మాచర్లలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అధికారుల బదిలీ తదితర కారణాల నేపథ్యంలోని కేసు నమోదులో జాప్యం జరిగిందని" రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా వివరణ ఇచ్చుకోవడంతోపాటు, రీపోలింగ్ ఆవకాశం లేని చర్యలు తీసుకున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ఏవీఎంను ధ్వంసం చేశారని స్వయంగా ఆ పోలింగ్ కేంద్రంలోని అధికారి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకున్నారు. మినహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. సందేహించిన ఎలక్షన్ వాచ్ పేరుతో దృష్టి సారించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ " మాచర్లలో జరిగిన సంఘటనలు పూస గుచ్చినట్లు వివరిస్తూ.." కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో అసలు బండారం బయటపడినట్లు భావిస్తున్నారు.

ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకు రాకుండా ఉండి ఉంటే, మాచర్లలో పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చేవే కావని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు హాయిగా ఉండేవారు. కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర చేయడంతో అనివార్యమైన పరిస్థితిలో రంగంలోకి దిగిన గుంటూరు జిల్లా పోలీసులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కూడా విభిన్న కథనాలు వినిపిస్తున్నప్పటికీ, పిన్నెల్లి ద్వారా హైకోర్టులో ముందస్తు మెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయి పోలీసులు గతంలో మాదిరి ఏమరపాటుగా ఉండేందుకు ఆస్కారం లేకుండా పోయిందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే లేడీస్ సింగం మల్లికా గర్గ్ ఆ జిల్లా ఎస్పీగా రావడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోజే కిందిస్థాయి అధికారులకు సున్నితంగా, స్పష్టమైన మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. "ఓట్ల లెక్కింపు రోజు, ఆ తర్వాత కూడా పరిస్థితి ప్రశాంతంగా ఉంచడమే తన ముందున్న కర్తవ్యం" అని ఎస్పీ మల్లికా గర్గ్ స్పష్టంగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం వరకు అధికార పార్టీతో అంట కాగిన పోలీసులు, అధికారుల ఆటలు సాగవనే వాతావరణం కూడా అక్కడ కనిపిస్తోంది.

 

విషయం పరిశీలిద్దాం..

తప్పు చేస్తే సరిదిద్దుకోవడం మానవ లక్షణం. చేసిన తప్పును దిద్దుకోవడానికి మరో తప్పు చేస్తే.. అదే జరిగింది. పల్నాడు ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వత్తాసుగా మాట్లాడుతున్న వార్తలు అనేకం ఇప్పటికే వెలుగు చూశాయి. రెండు రోజుల క్రితం " సాక్షి మీడియాలో" చర్చ వేదిక మరో దిశగా సాగింది.

"పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం. ఆయన రాకను చూసి ఎన్నికల అధికారి లేచి నమస్కారం పెట్టడం. ఆ వెంటనే రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడం. అడ్డుకున్న వ్యక్తిని మరో వ్యక్తి నిలువరించడం. వచ్చినంత తాపీగా రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వెలుపలికి వెళ్లిపోవడం. ఆయన వెళ్ళిన తర్వాత మరో పోలింగ్ అధికారి అక్కడి దృశ్యాలను వీడియో తీయడం" వెలుగులోకి వచ్చిన వీడియోలో కనిపించిన దృశ్యాలు ఇవి. ఎక్కడ ఎవరికీ ఉండకపోవచ్చు. కానీ..

"సాక్షి టీవీ"లో ఆ వీడియోను ఫ్రీజ్ చేశారు. వీడియోకు కుడి వైపు పైభాగంలో కనిపించే సెల్ సిగ్నల్ గీతలు. ఎడమ వైపు పై భాగంలో రెండున్నర నిమిషాల నిడివి అని చూపించే వీడియో టైమింగ్. కుడివైపు కింది భాగంలో రెండు గంటల కొన్ని నిమిషాలు.. చూపిస్తున్న సమయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ టీవీ యాంకర్ న్యాయవాదిని మించిపోయిన స్థాయిలో అనేక లా పాయింట్లు లేవనెత్తారు. ఈ వీడియోను ఈ దృశ్యాన్ని పరిశీలిస్తే.. ఎవరో సమీపంలోనే ఉండి సెల్ఫోన్లో చిత్రీకరించారు. అసలు పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోను తీసుకువెళ్ళడం నేరం కాదా..?" అని మితిమీరిన తెలివిని ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. జరిగిన తప్పును పక్కన ఉంచి ఆయన ధర్మ సందేహాలకు.. డిబేట్‌లో పాల్గొన్న మేధావి ట్యాంక్ తగిలించుకున్న వ్యక్తులు కూడా ఆనందంగా తలలు కనిపించారు.

"ఈ తరహా చర్చ ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాం?" అనేది విచక్షణ కూడా కోల్పోయినట్లు కనిపించింది. మీడియా రంగంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు, విలువలు పాటించాలనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట. మీడియా సంస్థలు, జర్నలిస్టులకు కొన్ని స్వీయ నియంత్రణలో ఉండాలి అనే మాటను కూడా మరిచారని ఆ దృశ్యాలను చూస్తే, మాటలు వింటే స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్ర విశ్రాంత సీనియర్ ఐఏఎస్, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ శ్రీనివాస్ పట్టుదల వల్లే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం బాహ్య ప్రపంచానికి తెలిసిందని స్పష్టమవుతోంది. దీనిని పక్క దారి పట్టించే విధంగా ఆ మీడియాలో చర్చ జరిగిన తీరు తప్పును సమర్థించేదిగా ఉన్నట్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News