దీపాళికి..వైసీపీకీ పవన్ ఎలా లింకెట్టారంటే

తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారంటూ పరోక్షంగా వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

Update: 2025-10-19 10:27 GMT

వైసీపీని, ఆ పార్టీ నాయకులను విమర్శించడానికి సమయ సందర్భాలను అందిపుచ్చుకోవడంలో పవన్ కల్యాణ్ అందివేసిన చేయి అనే చర్చ ఏపీ రాజకీయాలలో ఉంది. అంతేకాకుండా పండుగల సందర్భంగా ఆయన ఓ పండితుడిలా మారిపోయి దాని నేపథ్యాన్ని చెప్పడం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కల్యాణ్ ఒంటబట్టించుకున్నారనే టాక్ కూడా ఉంది. తాజాగా దీపావళి పండుగను కూడా వదలలేదు. దీపావళి పండుగ సందర్భాన్ని వైసీపీకి ముడిపట్టి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. 

దీప కాంతులతో శోభాయమానంగా... సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అంటూ పవన్ కల్యాణ్ ఆదివారం ట్వీట్ చేశారు. 


Tags:    

Similar News