మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం ఎంత అప్పు చేయనున్నారంటే...
విజయవాడ, విశాఖపట్నాల్లో నిర్మించనున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం విదేశీ బ్యాంకుల నుంచి రూ. 12 వేల కోట్లు ప్రభుత్వం అప్పు తీసుకు రానుంది.;
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలుగా కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. 2024లో డీపీఆర్ లు ఆమోదించారు. రెండు నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ. 42,362 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ మేరకు మొదటి దశ టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చింది. అయితే ఇందులో అప్పుగా ఎంత మొత్తం ప్రభుత్వం తీసుకు రానుందనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల నుంచి రూ. 12వేల కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కన్సల్టెట్స్ నియామకానికి టెండర్లు
రెండు మెట్రో ప్రాజెక్ట్ లకు సంబంధించి ఇప్పటికే జనరల్ కన్సల్టెంట్ ల నియామకానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా రుణ సమీకరణపై దృష్టి సారించింది. రెండు మెట్రో ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో రూ. 12000 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేసింది. ఏపీఎంఆర్ఎల్ విజయవాడ మెట్రో కోసం రూ. 5,900 కోట్లు, విశాఖపట్నం మెట్రో రైల్ కోసం రూ. 6,100 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేసింది. ఈ నిధుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేసే బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు.
రుణం ఇచ్చేందుకు విదేశీ బ్యాంకుల ఆసక్తి...
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం AIIB బ్యాంకు ప్రతినిధులు సంతోష్, పాస్కల్ రసెల్ తో విజయవాడలోని తన కార్యాలయంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశమయ్యారు. అంతకు ముందు AIIB ప్రతినిధులు విజయవాడలోని ప్రతిపాదిత మెట్రో కారిడార్ ల మార్గాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకూ ఉన్న 26 కిమీ కారిడార్ ను, అలాగే బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ ఉన్న 12 కిమీల కారిడార్ ను పరిశీలించిన తర్వాత రుణం ఇచ్చేందుకు ఆసక్తి కనబరిచారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బ్యాంకు ప్రతినిధులు సమావేశం కానున్నట్లు ఎండీ రామకృష్ణా రెడ్డి తెలిపారు.
మరోవైపు జర్మనీకి చెందిన KFW బ్యాంకు, ఫ్రాన్స్ కు చెందిన AFD బ్యాంకు, బీజింగ్ కేంద్రంగా ఉన్న AIIB తో పాటు జపాన్ కు చెందిన జైకా బ్యాంకులతో పాటు ADB, NDB, ప్రపంచ బ్యాంకు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లు ఎండీ తెలిపారు. అయితే వీటిలో తక్కువ వడ్డీతో పాటు మెట్రో ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించే బ్యాంకులను గుర్తించిన తర్వాత మరిన్నిసార్లు చర్చలు జరపనున్నారు.
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్
మొదటి దశ (ఫేజ్-1): రూ. 11,498 కోట్లు (46.23 కి.మీ., మూడు కారిడార్లు) ఖర్చు చేస్తారు. ఇందులో భూమి సేకరణ కోసం రూ. 882 కోట్లు కేటాయించారు. రెండవ దశ కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కి.మీ., అంచనా వ్యయం రూ. 14,309 కోట్లు గా ఉంది. మొత్తం రెండు దశలు రూ. 76.90 కిలో మీటర్లకు రూ. 17,232 కోట్లు ఖర్చు కానుంది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్
మొదటి దశ (ఫేజ్-1): రూ.11,009 కోట్లు (38.40 కి.మీ., రెండు కారిడార్లు) ఖర్చు చేస్తారు. ఇందులో భూమి సేకరణ కోసం రూ. 1,152 కోట్లు కేటాయించారు. రెండవ దశ కింద పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) నుంచి అమరావతి వరకు 27.80 కి.మీ., రూ. 14,121 కోట్లతో పనులు మొదలు కానున్నాయి. మొత్తం రెండు దశలు కలిపి 66.20 కిలో మీటర్లకు రూ. 25,130 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
రెండు నగరాల్లోని మెట్రో రైల్ ప్రాజెక్టులు కలిపి రూ. 42,362 కోట్లు. అవుతుందని అంచనా. (2024 ధరల ఆధారంగా)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 100 శాతం ఈక్విటీ ఫండింగ్‌ను కోరుతోంది. కోల్‌కతా మెట్రో మాదిరిగా, రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రెండు నగరాల్లోనూ డబుల్-డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో రైల్ కోసం కలిపి DPR తయారీకి కన్సల్టెంట్ నియామకం కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ జరిగింది. ఈ DPRలు మే 14, 2025 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. సిస్ట్రా MVA కన్సల్టింగ్ (ఇండియా)ని కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్స్ (CMPs) నవీకరణ కోసం నియమించారు. ఇది కేంద్ర ప్రభుత్వ అనుమతులకు కీలకం.
ప్రాజెక్టు స్థితి
రెండు ప్రాజెక్టుల మొదటి దశకు డిసెంబర్ 2024లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. DPRలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం డిసెంబర్ 5, 2024న పంపించారు. భూమి సేకరణ ప్రక్రియ జనవరి 30, 2025 నాటికి ప్రారంభమైంది. విశాఖపట్నంలో 99.75 ఎకరాలు, విజయవాడలో 91 ఎకరాలు సేకరించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మార్చి 2025 చివరి నాటికి అనుమతులు ఇవ్వవచ్చని Andhra Pradesh Metro Rail Corporation Limited (APMRCL) ఆశిస్తోంది. నిర్మాణ పనులు కేంద్రం అనుమతి తర్వాత ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాలలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.