ఎంఆర్పీఎస్ పోరులో ఆటుపోట్లు ఎన్నో.. ఈ విజయం వారికే అంకితం..

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో ఉద్యమ కణిక ఆరినివ్వలేదు. సుదీర్ఘ పోరాటం సుప్రీం కోర్టు తీర్పుతో సఫలమైంది. పోరుబాటలో ప్రాణాలొదిలిన కార్యకర్తలకు విజయం అంకితం చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ చీఫ్ మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు

Update: 2024-08-01 10:24 GMT

మూడు దశాబ్దాల తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పిఎస్) తన లక్ష్యాన్ని సాధించింది. జనాభా దామాషాలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలనే డిమాండ్తో 1994 నుంచి ప్రారంభమైన ఉద్యమం సఫలమైంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎంఆర్పిఎస్ సాగిస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. 



"సుదీర్ఘంగా సాగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఈ విజయం అంకితం ఇస్తున్నా" అని సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆ  సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దగ్దద స్వరంతో అన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ రాడికల్ నేత మంద కృష్ణమాదిగ "తన జాతి ప్రయోజనాల కోసం" అంటూ బీజేపీకి మద్దతు ప్రకటించి, ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు ప్రకటించి విమర్శలకు గురయ్యారు. తన లక్ష్యం ముందు ఇది పెద్దది కాదనే విధంగా సాగిన ఆయన సుదీర్ఘపోరాటం ద్వారా ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలకు విద్య, ఉద్యాగాల్లో వాటి సాధించడం ద్వారా సఫలం అయ్యారు.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థించిన ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. మూడు దశాబ్దాల తర్వాత ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఫలించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సారధ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటం ఊపిరిపోసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనీ యువ విద్యావంతులైన మాదిగ నాయకులు కీలక పాత్ర పోషించారు.


1994లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జులై 7 న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో (ఎంఆర్ఎస్ ఏర్పడింది. రాడికల్ గా పూర్వజీవితం గడిపిన మంద కృష్ణ మాది అధ్యక్షుడిగా, వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్న కృపాకర్ మాదిగ కార్యదర్శిగా వ్యవహరించారు. జనాభా దామాషాలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలనే ఉద్యమం 1994 నుంచి సాగుతోంది. ఈ ఉద్యమంలో 23 మంది కార్యకర్తలు ప్రాణాలు వదిలారు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న 23,560 మందిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. వారిలో చాలామంది ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

"సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నా, ఒకేసారి ఉద్యమరూపం దాల్చడం వంటివి దీనికి అనుకూలత అయ్యాయి" అని మానవహక్కుల ఉద్యమకారుడు కే.బాలగోపాల్ అభివర్ణించారు. "సరళంగా వివరించగల ఉద్యమ లక్ష్యాన్ని ప్రజలకు చేరవేయడంలో సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కొంత ఇబ్బందికరమైంది" అని ఆయన భావించారు.

క్లుప్తంగా స్వరూపం

ఎస్సీ వర్గీకరణ అనుకూల ఉద్యమకారులు పలు పార్టీల నాయకులను కలిసి వారికి దీన్ని గురించి వివరించారు. అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ డిమాండుకు అనుకూలంగా తీర్మానం జరిగింది. వీటి నేపథ్యంలో ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల నడుమ సామాజిక అసమానతలను విచారించేందుకు రామచంద్రరాజు కమిషన్ అన్న జ్యుడీషియల్ కమిషనన్ ను సెప్టెంబరు 10, 1996న ఏర్పాటుచేసింది. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కు అనుకూలంగా మే 1997లో రామచంద్రరాజు కమిషన్ తన నివేదికను సమర్పించింది. జూన్ 6, 1997న ప్రభుత్వం జీవో ద్వారా షెడ్యూల్డ్ కులాల కోటాను వర్గీకరించింది. ఈ వర్గీకరణలో భాగంగా ఎస్సీలనుఏ,బీ,సీ,డీగా వర్గీకరించారు. "ఎ" గ్రూపులో రెల్లి సహా 12 కులాలు ఉంటాయి. వీరికి ఒక శాతం రిజర్వేషన్, రోస్టర్ స్లాట్లలో ముందుగా అవకాశాన్ని ఇచ్చారు. బి- గ్రూపులో మాదిగ, సంబంధిత 18 కులాలు చేర్చారు. 'సీ- గ్రూపులో మాల కులస్తులతో పాటుగా మరో 24 కులాలను చేర్చారు, -డీ గ్రూపులో ఆదిఆంధ్ర వగైరా కులాలు ఉంటాయి.
వ్యతిరేకించిన మాలమహానాడు

మాల మహానాడు ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేసింది. సెప్టెంబర్ 18, 1997న ఏపీ హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ జీవో ప్రభుత్వ పరిధికి మించినదనీ, రాజ్యాంగ విరుద్ధమంటూ జీవోను నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం జీవో విషయంలో కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను సంప్రదించకపోవడం, షెడ్యూల్డ్ కులాల్లో వెనుకబడ్డవి, అత్యంత వెనుకబడ్డవి చేర్చి విభజన చేశారనీ, షెడ్యూల్డ్ కులాల్లో మార్పుచేర్పులు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం అని పలు కారణాలను ప్రస్తావించారు. హైకోర్టు తీర్పు అనంతరం మాల, మాదిగ వర్గాల మధ్య భౌతికదాడులు కూడా జరిగాయి.
1997 అక్టోబరు మొదటివారంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ గొడవల్లో చింతలచెరువు గ్రామంలో ఒక యువకుడు మరణించగా, మిగతా చోట్ల చెప్పుకోతగిన స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి.
2004 వరకు ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత..
"మాదిగలు అనేక అవకాశాలు కోల్పోయారు. మేము ఎస్సీ రిజర్వేషన్ కోటా ఇంకా పెంచాలనడం లేదు. మాదిగలకు ప్రత్యేక హోదా అడగలేదు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కోటాలో తమ జనాభాకు తగిన కోట ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాం" అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ చాలాసార్లు స్పష్టం చేశారు.

30 ఏళ్ల పాటు సాగిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాకుండా పరుగున ఉన్న కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కూడా విస్తరించింది. ఆయా రాష్ట్రాల్లోని మాదిగ ప్రజలను చైతన్యం చేయడంలో మందకృష్ణ మాదిగ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అంతేకాకుండా జాతీయ రాష్ట్రస్థాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతు పలికే విధంగా ఆయన తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అంశాన్ని ఏపీ అసెంబ్లీలో మూడుసార్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో పడడం, కోర్టుల వరకు వెళ్ల డంతో ఆలస్యం జరిగింది.

సుదీర్ఘపోరాటంలో ఎన్నో ఆటుపోట్లు..
రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంలో రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. మాల, మాదిగల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తన లక్ష్యాన్ని సాధించగలిగారు.

1994 ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం ఈదుముడి గ్రామంలో 13 మంది మాదిగ యువకులతో స్థాపించబడింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. షెడ్యూల్ కులాల జాబితాలో చర్చ వారందరికీ సమానంగా రిజర్వేషన్ల ఫలాలు అందించడానికి మాదిగల విముక్తి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సిద్ధాంతంతో ఆవిర్భవించింది.

ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తమ ప్రయత్నాలను దండోరా ఉద్యమంగా ప్రకటించారు. ఈ ఉద్యమం గ్రామీణ మాదిగవాడల్లోకి చొచ్చుకుపోయింది. దండోరా ర్యాలీలు సమావేశాలతో మద్దతును సమీకరించారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మొదటి సమావేశం
1995 మే 31న ఒంగోలులో జరిగింది ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి టీ.ఎం సదాలక్ష్మి తో పాటు 70 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. అక్టోబర్ 25న నెల్లూరులో 35 వేల మందితో నిర్వహించిన బహిరంగ సభ వర్గీకరణ ఉద్యమం ఊపందుకుంది. నవంబర్ 25న విజయవాడ, 1996 జనవరి 8న కర్నూల్ లో వేలాదిమంది మాదిగల తోపాటు సామాజిక ఉద్యమం పోరాటాన్ని మార్పు చేస్తుంది. ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ యువసేన, మాదిగ మహిళ సమాఖ్య వంటి విభాగాలతో శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దడానికి మందకృష్ణ గెరిల్లా యుద్ధతంత్రాన్ని అమలు చేశారు.

1996 ఫిబ్రవరి 3వ తేదీ హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో మందకృష్ణ మాదిగ సారధ్యంలో ఎమ్మార్పీఎస్ దాదాపు ఐదు లక్షల మంది మాదిగలతో తొలి రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ బహిరంగ సభ దండోరా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా విభజించడానికి అనుకూలంగా ప్రజాభిప్రాయానికి బలం లభించింది. అన్ని పార్టీల్లోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈసభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మాదిగల ఉద్యమం మరో రూపు సంతరించుకుంది.

1996 మార్చి 25న మాదిగల ఆత్మగౌరవ ప్రదర్శన హైదరాబాద్లోని నిజాం కళాశాల బాబు జగ్జీవన్ వద్ద 80చ వేల మందితో బహిరంగ సభ నిర్వహించారు.ీ సమావేశానికి సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు మాదిగ మంత్రులు హాజరయ్యారు ఎస్సీ రిజర్వేషన్ అమలులో అన్యాయం జరగకుండా రిజర్వేషన్ వర్గీకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

1996 సెప్టెంబర్ రెండో తేదీ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ జగ్జీవన్ విగ్రహం నుంచి ఇందిరాపార్కు వరకు జరిగిన ర్యాలీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెండు లక్షల మందికి పైగా మాదిగలు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, సాయంత్రం వరకు బైఠాయించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో అధికార టీడీపీ మాదిగ ఎమ్మెల్యేలు మందా జగన్నాథం, రాజయ్య, సుదర్శన్ బృందాన్ని ప్రభుత్వం పంపించింది. మాదిగలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.

ఎమ్మార్పీఎస్ డిమాండ్ పై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ పై ఆరోజు ఉదయాన్నే శాసనసభలో సీఎం చేసిన ప్రకటనను వారు కూడా ప్రస్తావించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు నమ్మకం కలగలేదు. ప్రతినిధులను వేదిక నుంచి బయటకు వెళ్ళమని బలవంతం చేశారు. దీంతో సీఎం ఎన్. చంద్రబాబు నివాసం నుంచి రాత్రి 10 గంటల సమయంలో మాదిగ నేతలకు ఫోన్ వచ్చింది. సీఎం కలిసిన ఎంఆర్పిఎస్ నేతలకు 45 రోజుల్లోగా విచారణ జరిపి వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. మాల, మాదిగ ఉపకలాల రిజర్వేషన్ల వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలించేందుకు జస్టిస్ పీ. రామచంద్రరావు కమిషన్ నియమించి, వర్గీకరణకు సిఫారసు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంలో దండోరా ఉద్యమం విజయవంతమైంది.

1997 ఏప్రిల్ 14వ తేదీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచి హైదరాబాద్ వరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సారథ్యం లాంగ్ మార్చ్ నిర్వహించారు.
ఇదిలాసాగుతుండగానే , ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సవాల్ చేస్తూ, మాలమహానాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాంకేతిక కారణాలను చూపిస్తూ, వర్గీకరణ జీవోను సస్పెండ్ చేసింది.

1998 అక్టోబర్ ఒకటో తేదీ ప్రభుత్వం వర్గీకరణ పై ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గం కూడా అంగీకరించింది. దానిని ఏపీ గవర్నర్ (సీ. రంగరాజన్)కు పంపించారు. ఆయన రాష్ట్రపతి (కె.ఆర్ నారాయణ) కు పంపించారు.

1999 నవంబర్ 30వ తేదీ భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 2000 ఏప్రిల్ ఒకటో తేదీ జీవో జారీ చేసింది.
ఈ జీవోకు వ్యతిరేకంగా మాల మహానాడు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. అన్ని చర్చలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రానికి లేదు పార్లమెంట్కు మాత్రమే ఉందంటూ ఆ జీవోను కొట్టివేసింది.

దీంతో సుప్రీంకోర్టు తర్వాత అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశాయి ఆందోళనలో భాగంగా ఎమ్మార్పీఎస్ మళ్లీ విభిన్న కార్యక్రమాలను ప్రకటించింది.
అందులో ప్రధానంగా
2004 నవంబర్ 16వ తేదీ అప్పటి సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి స్వగ్రామమైన పులివెందుల నియోజకవర్గం బలపనూరు నుంచి చైతన్య యాత్ర ప్రారంభించింది. ఆ సమయంలో వైఎస్ఆర్ తల్లి జయమ్మకు వినతిపత్రం అందించారు. ఆ తరువాత డిసెంబర్ 10వ తేదీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో..

2005 ఏప్రిల్ 18వ తేదీ 55 రోజుల పాటు మాదిగల ధర్మయుద్ధ మహా పాదయాత్ర బెంగళూరు నుంచి హైదరాబాదుకు నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది మాదిగ ప్రజలు పాల్గొన్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లే తేదీని ప్రకటించాలని ప్రభుత్వానికి 12 గంటల సమయం ఇచ్చారు. నిజాం కాలేజీ మైదానంలో కార్యకర్తలతో మందకృష్ణ బైఠాయించారు. ఎట్టకేలకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపేపందుకు సీఎం వైఎస్ఆర్ అంగించికరించక తప్పలేదు.

2006 ఏప్రిల్ 5వ తేదీ మాదిగల తిరుగుబాటు మహా పాదయాత్ర 45 రోజులపాటు నిర్వహించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం 2006 సెప్టెంబర్ 7వ తేదీ కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ కొంతకాలం తర్వాత ఆ ప్రతిపాదన తిరస్కరించారు. దీంతో
2007 ఏప్రిల్ 17వ తేదీ విజయవాడ సింగ్ నగర్ స్టేడియంలో 15 లక్షలతో విశ్వరూప మహాసభ నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హాజరయ్యారు. కేంద్రం నియమించిన కమిషన్ సారధ్యం తీసుకునేందుకు జస్టిస్ దురైస్వామి, జస్టిస్ మదన్మోహన్ ముందుకు రాలేదు. దీంతో మంద కృష్ణమాదిగ సికింద్రాబాద్ సీతాఫల్ మండీ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు దిగారు. గత్యంతరం లేని స్థితిలో సీఎం వైఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, కమిషన్ చైర్మన్ నియామాకానికి చర్యలు తీసుకున్నారు.
2007 జూన్ 11వ తేదీ అనంతపురం నుంచి బైక్ ర్యాలీ తో జైత్రయాత్ర నిర్వహించారు రాష్ట్రంలో దాదాపు 1950 కిలోమీటర్ల మేరయాత్ర సాగింది అనంతరం జూలై 25వ తేదీ ర్యాలీ హైదరాబాద్ చేరింది ఇందిరాపార్క్ వద్దకు చేరిన వారంతా అసెంబ్లీ ముట్టడికి ప్లాన్ చేశారు దీంతో వీరిని సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది చర్చల అనంతరం ధర్నాను ముగిసించారు
2008 ఏప్రిల్ 25వ తేదీ జస్టిస్ ఉషా మహిళా కమిషన్ ఏపీలో పర్యటించి, షెడ్యూల్ కులాల గ్రామాలను సందర్శించి, నివేదిక సిద్ధం చేసినా, సమర్పించడంలో జాప్యం జరిగింది. దీంతో ఏప్రిల్ 4వ తేదీ సికింద్రాబాద్ వద్ద మందకృష్ణ మాదిగ ఇతర నాయకులతో ఆమరణదీక్ష ప్రారంభించారు.

2008 మే ఒకటో తేదీ జస్టిస్ ఉషామెహ్రా కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఎంఆర్పిఎస్ నాయకులు ఆమరణ దీక్ష విరమించారు.
2008 డిసెంబర్ 14వ తేదీ ముషీరాబాద్ వద్ద పాస్ అంటూ డెత్ ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రారంభించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితేనే నిరాహార దీక్ష విరమిస్తానని కృష్ణ మాదిగ పట్టుబట్టారు. ఎనిమిది రోజుల తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
2009 ఫిబ్రవరి 16వ తేదీ జస్టిస్ ఉష మహిళా కమిషన్ నివేదిక వర్గీకరణకు సానుకూలంగా సమర్పించారు. దీంతో ఆ తర్వాత చర్యలు తీసుకోలేదు. దీనిని నిరసిస్తూ రాజమండ్రి వేదికగా విశ్వరూప మహాసభ కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ చేపట్టారు.
2009 ఫిబ్రవరి 4వ తేదీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు అసెంబ్లీ పైభాగానికి చేరి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు ఎంతో వందలాది మందిపై కేసులు నమోదు చేశారు.
2009 మార్చి రెండో తేదీ గాంధీభవన్ ముట్టడించారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగంగా మొత్తం 23 మంది సభ్యులు ప్రమాదాలలో మరణించారు. ముఖ్యంగా గాంధీభవన్ ముట్టడిలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నలుగురు అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చనిపోయారు.
2010 హైదరాబాదులోని నిజాం కళాశాలలో జరిగిన యుద్ధభేరి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షణాదిమంది మాదిగ ప్రజలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలని లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆ మేరకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటలకు సీఎం ఇంటివైపు ర్యాలీని ప్రారంభించారు. దీంతో ఎంఆర్పిఎస్ నాయకులను అడ్డుకున్నారు. రెండు గంటలకు వారిని విడుదల చేశారు. వర్గీకరణ పై రాజ్యాంగ సవరణకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హామీ మేరకు దీక్ష విరమించారు.
ప్రతిసారీ ప్రభుత్వం నుంచి హామీలు రావడం, సమస్య పరిష్కరించకపోవడంతో ఎప్పటికప్పడు ఎంఆర్పీఎస్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆలస్యం అయ్యే కొద్దీ విభిన్న కార్యక్రమాలతో మంద కృష్ణమాదిగ సాగించిన ఆందోళనల ద్వారా నిప్పు కణిక ఆరనివ్వకుండా రాజుకునేలా చేస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్టులో కేసులు సాగుతున్నా, క్షేత్రస్ధాయిలో మాత్రం ఉద్యమాలకు విరామం ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయన సాగించిన పోరాటానికి ఫలితం దక్కింది. రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎంఆర్పీఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


Tags:    

Similar News