చీర్స్, ఆంధ్రా మందు బాబులకు మంచి రోజులొస్తున్నయ్
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీ ఏవిధంగా ఉంటుంది? ప్రైవేట్ వారు డిపాజిట్లు చేస్తే షాపులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారా? వేలం ద్వారా కేటాయిస్తారా?
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-25 12:34 GMT
ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ వస్తుందని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మద్యం దుకాణాలను దక్కించుకోడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐదేళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీలు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎప్పుడూ చూడని ఆదాయం
ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా రూ. 36వేల కోట్ల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో నాలుగో వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు రూ. 27వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది. 2019కు ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది?
ఐదేళ్ల క్రితం వైసీపీ సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మద్యం ధరల్ని గణనీయంగా పెంచింది. 2019 ధరలకు రెండు రెట్లు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇతర మార్గాలను అన్వేషించారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం రవాణా అయ్యేది. అక్రమ రవాణా నిరోధంతో పాటు నాటుసారా తయారీని అరికట్టడానికి సెబ్ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవేమి ప్రభుత్వం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ధరల్ని కొంత తగ్గించారు. అయితే నాణ్యత విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ మద్యం దుకాణాలు..
2019కు ముందు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చాలా భాగం రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోయేది. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టడం ద్వారా రాష్ట్రానికి మేలు జరిగింది. గతంలో మద్యం తయారీ దారులు, విక్రయదారులు, లీజుదారులు, రాజకీయ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పెట్లో పెట్టుకునే వారు. 2019 నుంచి వీటికి అడ్డుకట్ట పడింది.
అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో లాభనష్టాలు రెండూ ఉన్నాయి. ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించే విధానం చాలా కాలం క్రితమే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉంది. ఢిల్లీలో ఇటీవల లిక్కర్ పాలసీ స్కామ్ రాక ముందు వరకు సమర్ధవంతంగా ప్రభుత్వ దుకాణాల వ్యవస్థ నడిచేది. దీని వల్ల కల్తీ మద్యం, నాసిరకం విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. ఏపీలో కూడా ఈ తరహా దుకాణాలను ప్రవేశపెట్టినా మరో పద్ధతిలో అక్రమాలు జరిగాయి. పూర్తిగా నగదుతోనే మద్యం విక్రయించడం, కొన్ని బ్రాండ్లను మాత్రమే అనుమతించడం ద్వారా కావాల్సిన వారికి మాత్రమే మద్యం అమ్ముకునే అవకాశం కల్పించారు.
అమాంతంగా పెరిగిన మద్యం ఆదాయం
2018–19లో దాదాపు రూ.16వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం ఐదేళ్లలో రూ. 36వేల కోట్లకు చేరింది. ఇందులో ఉత్పాదక వ్యయం, కమిషన్లు పోగా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. అయితే డిస్టిలరీను గత ప్రభుత్వంలో పెద్దలు చేజిక్కించుకుని భారీగా లాభపడ్డారనే విమర్శలు ఉన్నాయి. మద్యం వ్యాపారాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒత్తిళ్లను తట్టుకోలేక వ్యాపారాల నుంచి పక్కకు తప్పుకున్నారు. 2019 వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్ల స్థానంలో రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి. జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు. వైఎస్సార్‌సీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది. మద్యం ధరలు భారీగా పెరగడం, నాసిరకం బ్రాండ్లను విక్రయించడంతో మద్యం ప్రియుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ధర నిర్ణయాధికారం ఎవరిది?
సాధారణంగా ఏ ఉత్పత్తినైనా ఎంత ధరకు విక్రయించాలనేది తయారీదారుడే నిర్ణయిస్తాడు. మద్యం మాత్రం ఏ బ్రాండ్ ఎంతకు అమ్మాలనేది ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుంది. దీని చట్టబద్ధతపై కూడా సందేహాలున్నాయి. మద్యం నాణ్యతను, రసాయినిక ప్రమాణాలను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వ కమిటీలకు ఉండగా ధరలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి చాలా కాలంగా ఉంది. మద్యం ఆదాయం ప్రభుత్వానికి వస్తుండటంతో దీనిని ప్రశ్నించిన వారు కూడా లేరు.
కుమ్మక్కవుతున్న నేతలు, డిస్టిలరీలు
మద్యం దుకాణారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీలు కుమ్మక్కవుతున్నాయి. దుకాణాలకు విక్రయాలతో వచ్చే 8శాతం కమిషన్‌లోనే షాపుల అద్దెలు, సిబ్బంది జీతాలు, ఎక్సైజ్ సిబ్బందికి మామూళ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏ మాత్రం లాభదాయకం కాకపోయినా మద్యం సిండికేట్లు దుకాణాలు కావాలని ఒత్తిళ్లు పెంచడం వెనుక పెద్ద దందా ఉంటుంది. డిస్టిలరీలు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సరఫరా చేసే మద్యంతో పాటు నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తుంటాయి. మద్యాన్ని 20 నుంచి 30శాతం కల్తీ చేయడం ద్వారా లాభాలను పెంచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా మద్యం దుకాణాలను దక్కించుకునే వారు బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు పెంచుకుంటారు. ఇదంతా ఓ దోపిడీ ఛైన్‌గా మారుతోంది.
రిటైల్ వ్యాపారం ఎవరు చేయాలి?
మద్యం రిటైల్ వ్యాపారంలో ప్రభుత్వం ఉండాలా? ప్రైవేట్ వారు ఉండాలా? అనేది తేల్చాల్సింది ప్రభుత్వమే. ఎవరు రిటైల్ వ్యాపారం చేసినా అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచితే ఏది కావాలో వినియోగదారుడు నిర్ణయించుకుంటాడు. ఫలితంగా నాణ్యత విషయంలో కూడా కంపెనీలు రాజీపడకుండా ఉంటాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని బ్రాండ్ల లభ్యతే అధికంగా ఉంటుంది. బ్రాండ్లను ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారుడికి ఉండదు. గతంలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు ఎక్కువగా జరిగేవి. ప్రభుత్వ మద్యం దుకాణాలతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా దుకాణాల ముందు క్యూలైన్లలో పడిగాపులు పడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది.
మద్యం తయారీ, నాణ్యత, కొత్త బ్రాండ్లకు అనుమతించే విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. దీంతో డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలు పెట్టే కండిషన్లకు తలొగ్గుతున్నారు. అన్ని బ్రాండ్లను అనుమతించి, కోరుకున్న బ్రాండ్ ఎంచుకునే స్వేచ్ఛ మద్యం సేవించే వారికి ఇస్తే చాలా వరకు సమస్యలు తగ్గుతాయనే వాదన ఉంది.