YCP| వైసీపీ సోషల్ మీడియా వర్కర్ 'వర్రా' పై 40 కేసులు
వైసీపీ సోషల్ మీడియా వర్కర్ 'వర్రా'ను కేసులు వెంటాడుతున్నాయి. కడపలో రిమాండ్ ఖైదీగా ఉన్న అతనిని ప్రొద్దుటూరు పోలీసులు విచారణకు తీసుకువెళ్లారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-11-23 14:51 GMT
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని కేసులు చుట్టుముట్టాయి. కడప సెంట్రల్ జైలులో వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రొద్దుటూరులో నమోదైన కేసులో ఒకటో పట్టణ పోలీసులు అతనిని పీటీ వారెంట్ పై శనివారం తీసుకుని వెళ్లారు. కడప జిల్లా వేముల మండలానికి చెందిన వర్రా రవీంద్రారెడ్డి వైసీపీలో చురుకుగా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ సోషల్ మీడియా వర్కర్ గా వర్రా కీలకంగా వ్యవహరించారు.
సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, వారి కొడుకు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తోపాటు దివంగత సీఎం వైఎస్ఆర్ భార్య వైఎస్. విజయమ్మ, వారి కూతురు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల, మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి కూతురు వైఎస్. వైఎస్. సునీతపై కూడా అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంత వర్రాపై వివిద ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వర్రా ఆగడాలు మితిమారాయి. అడ్డూ అదుపు లేనివిధంగా మహిళలనే విచక్షణ లేకుండా జుగుత్సాకరంగా పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్రంలో దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. అందులో పది కేసులు ఉమ్మడి కడప జిల్లాలోనే నమోదుకావడం గమనార్హం.
పులివెందులలో వర్రాపై ఉన్న కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం అతను కడప కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కాగా, సోషల్ మీడియాలో చేసిన పోస్టింగులపై ప్రొద్దుటూరులో కేసు నమోదు కావడంతో కోర్టు అనుమతి తీసుకున్న ఆ పట్టణ పోలీసులు పీటీ వారెంట్పై శనివారం ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పరిచారు. సోషల్ మీడియాలో పోస్టింగులపై తనకు కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి ద్వారా కార్యాలయం నుంచి వచ్చని కంటెంట్ ఆయన పీఏ రాఘవరెడ్డి నుంచి అందిందని మొదట పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇదిలావుండగా, రాయలసీమ జిల్లాల్లో వర్రా రవీంద్రారెడ్డిపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. దీంతో కోర్టు ద్వారా అనుమతితో పోలీసులు విచారణ కోసం కష్టడీకి తీసుకున్నట్లు తెలిసింది.